జగన్ సుప్రీంకు వెళ్లడం లేదు! ఎందుకంటే..?

ఏకైక రాజధానిగా అమరావతికి మద్దతుగా హైకోర్టు చాలా విస్పష్టమైన తీర్పు చెప్పేసింది. ఆరు నెలల్లోగా నిర్మాణాలు కూడా చేయాలని, మూడు నెలల్లోగా మౌలిక వసతులు కల్పించి.. పొలాలు ఇచ్చిన రైతులకు ప్లాట్లు అప్పగించాలని కూడా…

ఏకైక రాజధానిగా అమరావతికి మద్దతుగా హైకోర్టు చాలా విస్పష్టమైన తీర్పు చెప్పేసింది. ఆరు నెలల్లోగా నిర్మాణాలు కూడా చేయాలని, మూడు నెలల్లోగా మౌలిక వసతులు కల్పించి.. పొలాలు ఇచ్చిన రైతులకు ప్లాట్లు అప్పగించాలని కూడా తీర్పులో స్పష్టంగా పేర్కొంది. 

రాజధానిలో ఉండదగిన కార్యాలయాలను ఇప్పుడున్న విజయవాడ, అమరావతి ప్రాంతాలనుంచి ఇతర ప్రాంతాలకు తరలించడానికి కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ వీల్లేదని చెప్పేసింది. ఈ హైకోర్టు తీర్పుపై ముఖ్యమంత్రి జగన్ మంత్రులతోను న్యాయనిపుణులతోను చర్చించారు. 

తీర్పును ప్రభుత్వం సమీక్షించుకున్న రోజున.. బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్లగల అవకాశాలను పరిశీలిస్తున్నామని అన్నారు. కోర్టు తీర్పు కాపీని పూర్తిగా చదివిన తర్వాత.. సుప్రీం కు వెళ్లడంపై నిర్ణయం తీసుకుంటాం అని కూడా అన్నారు. 

అయితే తాజాగా తాడేపల్లి వర్గాల నుంచి తెలుస్తున్న సమాచారాన్ని బట్టి.. అమరావతి విషయంలో హైకోర్టు తీర్పుపై సుప్రీం కోర్టులో అప్పీల్ చేయకూడదని ప్రభుత్వం నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. సుప్రీంకు వెళ్లాలని, వద్దని కొంత మల్లగుల్లాలు పడినప్పటికీ.. నిజం చెప్పాలంటే.. సుప్రీంలో అప్పీల్ చేయడానికి తగిన విధంగా హైకోర్టు తీర్పు లేదని, అప్పీలుకు వెళితే భంగపాటు తప్పదని న్యాయనిపుణులు హెచ్చరించినట్టు సమాచారం. దాంతో, సుప్రీంకు వెళ్లే ఆలోచనను జగన్ సర్కారు వదలుకుంది. 

సుప్రీంకోర్టుకు ఎందుకు వెళ్లడం లేదంటే..

1) సిఆర్‌డిఏ రద్దు చట్టాన్ని జగన్ సర్కారు ఉపసంహరించుకున్న తర్వాత అసలు సిఆర్‌డిఎ చట్టం అమల్లో ఉన్నట్టే లెక్క! ఆ చట్టాన్ని వెంటనే అమలు చేయాలని హైకోర్టు తమ తీర్పులో చెప్పింది. ఈ తీర్పుపై సవాలు చేయడానికి అవకాశం లేదు. 

2) రాజధానిగా ఇతర ప్రాంతాలను ఎంపిక చేసినట్టుగానీ.. రాజధాని వికేంద్రీకరణ చేసినట్టుగానీ.. ఇప్పటిదాకా ఎలాంటి అధికార ప్రకటన లేదు. వికేంద్రీకరణ ఆలోచనకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని మాత్రమే.. జగన్ సర్కారు చెబుతోంది. అలాంటి నేపథ్యంలో.. విజయవాడ/ అమరావతినుంచి కార్యాలయాలను తరలించ వలసిన అవసరమే లేదు. ‘తరలించరాదు’ అనే కోర్టు ఆదేశాలను సవాలు చేసే అవకాశం లేదు. 

3) పిటిషన్ వేసిన రైతులందరికీ 50వేల రూపాయల వంతున ప్రభుత్వం పరిహారం చెల్లించాలని హైకోర్టు చెప్పింది. దీనిపై అప్పీలు అంటే కామెడీగా ఉంటుంది.  

4) మూడునెలల్లోగా రైతులకు ప్లాట్లు అప్పగించాలని ఆదేశించింది. అయితే ఈవిషయంలో తాము ఏం చేయగలమో.. ఎంత చేయగలమో.. ఎందుకు చేయలేమో.. ప్రభుత్వం ముందుగా అఫిడవిట్ హైకోర్టులోనే ఇవ్వాల్సి ఉందది. ఆ పర్వం ముగియకుండా.. సుప్రీంకు వెళ్లడం అనేది జరగదు. 

.. సింపుల్ గా చెప్పాలంటే.. ఈ తీర్పు మీద అప్పీలుకు వెళ్లే అవకాశమే లేదు. మూడు రాజధానులు అనే వికేంద్రీకరణ చట్టం ఉన్నట్లయితే.. దాన్ని హైకోర్టు కొట్టివేసి ఉంటే.. సుప్రీంలో సవాలు చేయవచ్చు. ఇప్పుడు సుప్రీంలో సవాలు చేయగల అంశాలేవీ లేవు. పైగా ఒకసారి సుప్రీం కోర్టుకు వెళితే.. ఇక పరిణామాలు రాష్ట్ర ప్రభుత్వం చేయి దాటిపోతాయి. 

అక్కడ ఏ సంగతి తేలేదాకా.. కొత్తగా మరోసారి రాజధాని వికేంద్రీకరణ బిల్లు లాంటిది మరింత పటిష్టంగా కొత్తగా తీసుకు రావడానికి కూడా అవకాశం ఉండదు. జగన్ ప్రభుత్వం పూర్తిగా చేతులు కట్టుకుని చూస్తూ కూచోవాలి. అందుకే ఈ కారణాలు అన్నింటినీ దృష్టిలో ఉంచుకుని.. సుప్రీం కోర్టుకు వెళ్లరాదని ప్రభుత్వం నిర్ణయించుకున్నదని సమాచారం.