ఇక్కడో మాట.. అక్కడో మాట : పోలవరం ఆటా?

కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షెఖావత్ పోలవరం సందర్శనకు వచ్చారు. ఎక్కడకు వెళితే.. ఆ ఊరి గురించి అవ్యాజ ప్రేమానురాగాలను కురిపించడం, ఆ ప్రాంతం మీద బోలెడు వరాలు వెదజల్లడం రాజకీయ నాయకులకు అలవాటు. నాయకులు…

కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షెఖావత్ పోలవరం సందర్శనకు వచ్చారు. ఎక్కడకు వెళితే.. ఆ ఊరి గురించి అవ్యాజ ప్రేమానురాగాలను కురిపించడం, ఆ ప్రాంతం మీద బోలెడు వరాలు వెదజల్లడం రాజకీయ నాయకులకు అలవాటు. నాయకులు వచ్చి వెళ్లిన తర్వాత.. ఆ ప్రాంతం మొత్తం కలల్లో తేలిపోయినా ఆశ్చర్యం లేదు. ఇప్పుడు ఏపీ ప్రజల పరిస్థితి కూడా అలాగే ఉంది. 

కేంద్ర మంత్రి వచ్చి విజిట్ చేసి.. ఏడాదిలోగా ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రాజెక్టు పూర్తి చేసేస్తాం అని ఘంటాపథంగా చెప్పి వెళ్లడం అంటే.. ఎవరైనా ఎందుకు నమ్మరు?

కానీ.. బీజేపీ నాయకుల మాటలకు, కనీసం ఏపీ వ్యవహారాల విషయంలో, ఉన్న విశ్వసనీయత ఎంత? వారు తమ విశ్వసనీయతను ఎప్పుడో కోల్పోయారు. నేనిక్కడ అద్భుతాలు చేస్తాను అని వారు అన్నంత మాత్రాన ప్రజలు ఏకపక్షంగా నమ్మకపోవచ్చు. వారు చేయదగిన అద్భుతం ఏమిటో.. కళ్లముందు కనిపించేదాకా నమ్మరు గాక నమ్మరు!

షెఖావత్ కూడా.. పోలవరం పూర్తి చేసే విషయంలో చాలా గట్టిగానే హామీలిచ్చారు. పునరావాసం పెంచి ఇవ్వడానికి అంగీకరించడం ఒక గొప్ప విషయం. అలాగే.. ముఖ్యమంత్రి జగన్ అడిగినట్లుగా పునరావాసం సొమ్ములను లబ్ధిదారుల అకౌంట్లకే వ్యక్తిగతంగా వేసేయడానికి కూడా ఒప్పుకోవడం ఇంకో మంచి సంగతి. 

అయితే ప్రాజెక్టు పూర్తి కావడానికి సంబంధించి.. తన చిత్తశుద్ధి బయటపడేలా ఆయన చెప్పిన ఒక మాట ఆచరణలో ఎలా ఉంటుందో వేచిచూడాలి. రాబోయే మూడు నెలల పాటూ ప్రతి 15 రోజులకు ఒకసారి సమీక్ష సమావేశాలు నిర్వహిస్తానని, పనిలో ప్రోగ్రెస్ ఎలా జరుగుతున్నదో పరిశీలిస్తూ ఉంటానని మంత్రి చెప్పారు. 15 రోజులంటే 15రోజులే.. 16వ రోజు కూడా కాదు అంటూ మరింత ఖచ్చితంగా కూడా చెప్పారు. 

కేంద్ర మంత్రి స్వయంగా రంగంలోకి దిగి, చెప్పినట్టుగా 15 రోజులకు ఓసారి సమీక్షలు జరుపుతూ అధికారుల్ని వెంటపడుతూ పనుల గురించి ఫాలోఅప్ చేస్తూ ఉంటే.. పనిలో వేగం ఖచ్చితంగా పెరుగుతుంది. మూడు నెలలు తిరిగేలోగా.. అలా వేగంగా పనిచేయడం అనేది అందరికీ అలవాటు కూడా అయిపోతుంది. ఆయన అలా చేస్తే మంచిదే. కానీ.. తొలి 15 రోజులు గడిచే దాకా ఆయన చిత్తశుద్ధితో ఆ మాటలు అన్నారా? లేదా, ఇక్కడ ఉన్నాడు గనుక.. అలా కాస్త ఊరడింపుగా అన్నారా తెలియదు. 

అదే సమయంలో ముఖ్యమంత్రి జగన్ చేసిన విజ్ఞప్తి చాలా కీలకమైనది. 15 రోజులకు ఒకసారి కేంద్రం నుంచి బిల్లుల చెల్లింపు జరిగితేనే పనులు వేగంగా పూర్తి కాగలవని సీఎం చెప్పారు. అది కూడా నిజమే. సొమ్ములు సకాలంలో ఇవ్వకుండా కేవలం సమీక్షలు, కర్రపెత్తనం మాత్రం చేస్తాం అంటే కుదరదు. 15రోజులకోసారి సమీక్ష సరే.. 15రోజులకోసారి నిధుల విడుదల గురించి కేంద్ర మంత్రి ఆలోచించాలి.