జ‌గ‌న్ వ‌ల్ల కానిది…లోకేశ్ చేస్తున్నారు!

ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి వ‌ల్ల కానిదాన్ని, ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నాయ‌కుడు నారా చంద్ర‌బాబు నాయుడు కుమారుడు లోకేశ్ చేసి చూపుతున్నారు. త‌ద్వారా జ‌గ‌న్ నెత్తిపై పాలు పోస్తున్న‌ట్టైంది. ఎన్నిక‌ల సీజ‌న్‌లో లోకేశ్ పాద‌యాత్ర టీడీపీకి…

ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి వ‌ల్ల కానిదాన్ని, ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నాయ‌కుడు నారా చంద్ర‌బాబు నాయుడు కుమారుడు లోకేశ్ చేసి చూపుతున్నారు. త‌ద్వారా జ‌గ‌న్ నెత్తిపై పాలు పోస్తున్న‌ట్టైంది. ఎన్నిక‌ల సీజ‌న్‌లో లోకేశ్ పాద‌యాత్ర టీడీపీకి ఎంత వ‌ర‌కు ప్ర‌యోజ‌నం క‌లిగిస్తుందో చెప్ప‌లేం కానీ, జ‌గ‌న్‌కు మాత్రం చాలా మేలు చేస్తున్నారు. నాలుగేళ్ల జ‌గ‌న్ పాల‌న పేద‌లు, అణ‌గారిన వ‌ర్గాలు, మైనార్టీల్లో ఆనందాన్ని నింపింది. కానీ వైసీపీ నేత‌లు, కార్యక‌ర్త‌ల్లో నిరాశ‌. నిస్పృహ‌ల‌ను మిగిల్చింది. ఈ నేప‌థ్యంలో ఇదంతా టీడీపీకి ప్ల‌స్ అవుతుంద‌ని చాలా మంది అనుకున్నారు.

కానీ అలా జ‌ర‌గ‌డానికి వీల్లేద‌ని నారా లోకేశ్ ప‌ట్టుప‌ట్టి వైసీపీకి ప్ర‌యోజ‌నం క‌లిగిస్తున్నార‌నే ప్ర‌చారానికి తెర‌లేచింది. పాద‌యాత్ర‌లో స్థానిక వైసీపీ ప్ర‌జాప్ర‌తినిధులు, ద్వితీయ, తృతీయ శ్రేణి నాయ‌కుల పేర్ల‌తో స‌హా చెబుతూ మాస్ వార్నింగ్ ఇస్తున్నారు. తన తండ్రి రాముడులాంటివార‌ని, తాను మాత్రం రావ‌ణుడిని గొప్ప‌గా చెప్పుకుంటున్నారు. అధికారంలోకి రాగానే వైసీపీ నేత‌ల‌కు వ‌డ్డీతో స‌హా చెల్లిస్తామ‌ని నోరు పారేసుకుంటున్నారు.

దీంతో అంత వ‌ర‌కూ నిరుత్సాహంతో నిద్రావ‌స్థ‌లో ఉన్న వైసీపీ ప్ర‌జాప్ర‌తినిధులు, దిగువ శ్రేణి నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల్లో రోషం వ‌స్తోంది. ఇలాగైతే త‌మ‌ను బ‌త‌కనిచ్చేలా లేర‌ని వైసీపీ నేత‌లు యాక్టీవ్ అవుతున్నారు. లోకేశ్ పాద‌యాత్ర నిన్న రాత్రి క‌డ‌ప జిల్లాలో ప్ర‌వేశించింది. కుప్పంలో మొద‌లైన పాద‌యాత్ర‌ 100 రోజు ల‌కు పైగా సాగింది. ఉమ్మ‌డి చిత్తూరు. అనంత‌పురం, క‌ర్నూలు జిల్లాల్లో సాగింది. లోకేశ్ ఘాటు విమ‌ర్శ‌ల‌తో వైసీపీ నేత‌లు కూడా తామేం త‌క్కువ కాద‌ని గ‌తంలో మాదిరిగా యాక్టీవ్ అవుతున్నారు. అందుకే అక్క‌డ‌క్క‌డ లోకేశ్ పాద‌యాత్ర‌లో ఉద్రిక్త‌త‌కు దారి తీసింది.

పాద‌యాత్ర‌లో లోకేశ్ నోరు పారేసుకుంటున్నాడ‌ని ఆవేద‌న క‌లిగిన‌ప్ప‌టికీ, ఒక ర‌కంగా ఇది త‌మ‌లో నిద్రాణ‌మైన పౌరుషాన్ని త‌ట్టి లేపుతోంద‌ని వైసీపీ నేత‌లు చెబుతున్నారు. గ‌తంలో త‌మ నాయ‌కుడు వైఎస్ జ‌గ‌న్ పాద‌యాత్ర‌లో తాను అధికారంలోకి వ‌స్తే చేయ‌బోయే మంచి ప‌నులు, న‌వ‌ర‌త్నాల సంక్షేమ ప‌థ‌కాల గురించి విస్తృతంగా ప్ర‌చారం చేశార‌ని వారు గుర్తు చేస్తున్నారు. కానీ లోకేశ్ పాద‌యాత్ర‌లో ప్ర‌త్య‌ర్థుల‌పై తిట్ల‌కే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నార‌ని చెబుతున్నారు. 

ఇదీ టీడీపీకి న‌ష్టం, వైసీపీకి లాభం క‌లిగిస్తోంద‌న్న అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.