చిన్న సినిమాలు.. పెద్ద చప్పుళ్లు

ఈ వీకెండ్ మహేష్ బాబు సినిమా రావట్లేదు, ప్రభాస్, పవన్ కల్యాణ్ లాంటి స్టార్స్ నటించిన సినిమాలు కూడా లేవు. కానీ సినీ ప్రేక్షకులు మాత్రం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వస్తున్నవన్నీ చిన్న సినిమాలే. కానీ…

ఈ వీకెండ్ మహేష్ బాబు సినిమా రావట్లేదు, ప్రభాస్, పవన్ కల్యాణ్ లాంటి స్టార్స్ నటించిన సినిమాలు కూడా లేవు. కానీ సినీ ప్రేక్షకులు మాత్రం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వస్తున్నవన్నీ చిన్న సినిమాలే. కానీ మంచి ప్రచారంతో, అందర్నీ ఎట్రాక్ట్ చేస్తున్నాయి. ప్రతి సినిమా కోసం ఓ సెక్షన్ ఆడియన్స్ సిద్ధంగా ఉన్నారు. ఒకటి కాదు, రెండు కాదు.. అలా 4 సినిమాలు ఎట్రాక్ట్ చేస్తున్నాయి

ఈ వీకెండ్ థియేటర్లలోకి వస్తున్న సినిమా మళ్లీ పెళ్లి. సీనియర్ నటుడు నరేష్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా కోసం ఓ సెక్షన్ ఆత్రుతగా ఎదురుచూస్తోంది. దీనికి కారణం ఏంటనేది అందరికీ తెలిసిందే. నరేష్-పవిత్ర నిజజీవితంలో సహ-జీవనం చేస్తున్నారు. అంతేకాదు, వాళ్ల లివ్ ఇన్ రిలేషన్ షిప్ నేపథ్యంలోనే ఈ సినిమా తెరకెక్కింది. నరేష్ నిజజీవితంలో జరిగిన కొన్ని ఘటనల్ని ట్రయిలర్ లో చూపించారు కూడా. దీంతో మళ్లీ పెళ్లి హాట్ టాపిక్ గా మారింది.

ఇక ఆడియన్స్ ను ఆకర్షిస్తున్న మరో సినిమా మేమ్ ఫేమస్. ఇది చాలా చిన్న సినిమా. ఇంకా చెప్పాలంటే ఇందులో నటీనటులు కూడా ఎవ్వరికీ తెలీదు. కానీ ప్రమోషన్ తో ఆకట్టుకుంటోంది ఈ మూవీ. డప్పులు కొట్టి, తెలంగాణ యాసలో వీళ్లు చేసిన ప్రమోషన్.. వాటి కోసం పేరున్న నటీనటుల్ని వీళ్లు వాడుకున్న విధానం అందరికీ నచ్చింది. విజయ్ దేవరకొండ, అడివి శేష్, నాగచైతన్య.. ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది హీరోలున్నారు ఈ సినిమా ప్రచారంలో.

మెన్ టూ అనే మరో చిన్న సినిమా కూడా యూత్ ను ఎట్రాక్ట్ చేస్తోంది. మగాడిగా ఉండడం చాలా కష్టం అనే ట్యాగ్ లైన్ తో వస్తున్న ఈ సినిమా ట్రయిలర్ ప్రామిసింగ్ గా ఉంది. మహిళల్ని కించపరచకుండానే మెన్ టూ తీశామంటున్నారు మేకర్స్. మహిళలతో ఇబ్బంది పడుతున్న మగాళ్ల జీవితాల్ని ఇందులో ఫన్నీగా, ఎమోషనల్ గా చూపించే ప్రయత్నం చేశారు.

లాస్ట్ బట్ నాట్ లీస్ట్.. 2018 మూవీ. ఇదొక డబ్బింగ్ సినిమా అయినప్పటికీ అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. దీనికి కారణం, కేరళలో ఈ సినిమా పెద్ద హిట్టవ్వడమే. మల్లూవుడ్ లో అత్యంత వేగంగా వంద కోట్లు కలెక్ట్ చేసిన మూవీగా ఇది రికార్డ్ సృష్టించింది. 2018లో కేరళలో సంభవించిన వరదల నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా, తెలుగులో కూడా మేజిక్ చేస్తుందని కొందరు విశ్వసిస్తున్నారు.