మారుతి నిర్మాతల డైరక్టర్. మారుతితో సినిమా చేస్తే, రిజల్ట్ మీడియంగా వున్న డబ్బులు బాగానే మిగులుతాయి. సినిమా మరి కాస్త రేంజ్ కు వెళ్తే నిర్మాతలకు పండగే. అందుకే మారుతి చుట్టూ నిర్మాతలు వుంటారు.
అడ్వాన్స్ లు వుంటాయి. కానీ ఎందుకో హీరోల దగ్గర వచ్చేసరికి తేడా కొడుతూంది. మారుతితో సినిమా చేయడానికి తాము రెడీ అన్నట్లు వుంటారు. కానీ ఓకె కావడం మాత్రం చాలా దూరంలో వుంటుంది. ఇక్కడే ఏదో వుంది వ్యవహారం.
ప్రతి రోజూ పండగే సినిమా తరువాత మారుతి సినిమా ఎక్కడానికి బాగా టైమ్ తీసుకుంది. హీరోలు ఎవ్వరూ ఖాళీ లేకపోవడమే ఒక కారణం. యువి/గీతా కే సినిమా చేయాలి అని మారుతి గిరి గీసుకుని కూర్చోవడం ఇంకో కారణం.
హీరోలు ఎవ్వరూ ప్రస్తుతం ఆ బ్యానర్లకు సినిమా చేసే ఆలోచనలో లేరు అని ఇండస్ట్రీ టాక్. ఎందుకంటే హీరోలకు ఫ్యాన్సీ ఆఫర్లు కావాలి. అవి ఆ బ్యానర్ల నుంచి రావు.
ఇలాంటి నేపథ్యంలో మారుతి ప్రస్తుతం గోపీచంద్ వైపు చూస్తున్నారని బోగట్టా. రవితేజ తో వ్యవహారం బెడిసిన తరువాత గోపీచంద్ ఆప్షన్ గా నిర్మాతలు ఎంచుకున్నారు.
ఇంకా డైరక్టర్-హీరో సిటింగ్ కాలేదు. సిటింగ్ వేయాలి. కథ పాయింట్ చెప్పాలి. హీరో ఒకె అనాలి. తన వరకు ఈ వ్యవహారం ఇంకా రాలేదని గోపీచంద్ తన సన్నిహితులతో అన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సీటీమార్ చేస్తున్న గోపీచంద్ చేతిలో రెండు మూడు ప్రాజెక్టులు వున్నాయి.