విశాఖలో ఉన్న శ్రీ శారదాపీఠం అధిపతి స్వరూపానందేంద్ర స్వామీకి ప్రభుత్వ పెద్దలకు బిగ్ గ్యాప్ ఏర్పడిందా. జగన్ ప్రభుత్వాన్ని మనసారా స్వామి దీవిస్తారని అలాగే స్వామిని రాజ గురువుగా వైసీపీ పెద్దలు ప్రేమిస్తారని చాలా చాలా అంతా అనుకుంటారు.
స్వామి కోసం పీఠానికి అనేక సార్లు ముఖ్యమంత్రి హోదాలో జగన్ రావడం జరిగింది. స్వామి అంటే వైసీపీ మొత్తానికి మొత్తం భక్తి ప్రపత్తులు ఎక్కువని చెబుతూంటారు. స్వామి చుట్టూ వైసీపీ ఆశావహులు చేరి ఆయన ద్వారా తమ కోరికలను పై వారికి చెప్పుకుని వాటిని ఈడేర్చుకునేవారు అన్న ప్రచారమూ చాలా కాలం సాగింది.
అంతటి రాజగురువుగా పేరు పొందిన శారదాపీఠం స్వామీజీతో దూరం పెరిగింది అని అంటున్నారు. ఇటీవల విజయవాడలో జరిగిన మహా చండీయాగం సహిత రాజశ్యామల యాగానికి స్వామిని చాలా వరకూ దూరం పెట్టారని అంటున్నారు. ఆరు రోజుల పాటు ఈ యాగం జరిగితే కేవలం చివరి రోజున మాత్రమే స్వామి హాజరయ్యారు.
ఈ ఏడాది మొదట్లో శ్రీ శారదా పీఠం లో జరిగిన వార్షిక యాగానికి జగన్ హాజరు కలేదు. గత నెలలో సింహాచలంలో జరిగిన చందనోత్సవం సందర్భంగా స్వామీజీ ప్రభుత్వం మీద విమర్శలు ఒక స్థాయిలో చేసారు. దాని మీద ప్రభుత్వ పెద్దలు గుర్రుగా ఉన్నారని అంటున్నారు.
స్వామీజీ తాను చేసిన రాజశ్యామల యాగం వల్లనే జగన్ సీఎం అయ్యారని చెప్పుకోవడం తానే వైసీపీ ప్రభుత్వానికి ఆధ్యాత్మిక గురువుని అని ప్రచారం చేసుకోవడం వంటి అతి విషయాలే ఈ బిగ్ గ్యాప్ కి కారణం అంటున్నారు. ప్రభుత్వ పెద్దల వద్ద ఉన్న పలుకుబడిని కొందరు స్వకార్యాలకు వాడుకుంటున్నారు అని అంటున్నారు.
ఇవన్నీ చూసిన వారు ఎక్కడో వ్యవహారం కాస్తా చెడింది అని అంటున్నారు. స్వాములు భౌతిక ప్రపంచానికి అతీతంగా ఆధ్యాత్మిక చింతనలో ఉండాలని, రాజకీయాల్లో వేలు పెడితే ఇలాగే వైభవాలు ప్రాభవాలు మూన్నాళ్ల ముచ్చట్టగానే ముగుస్తాయని అంటున్నారు.