2024 ఎన్నికలకు ఎంతో ముందుగానే టీడీపీ సిద్ధమవుతోంది. మళ్లీ జగనే అధికారంలోకి వస్తే… ఇక టీడీపీని మరిచిపోవాల్సిందే అని ఆ పార్టీ నాయకులకు బాగా తెలుసు. దీంతో జనసేనతో పొత్తు, సీట్ల పంపకాలు, సొంత పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబునాయుడు సీరియస్‌గా కసరత్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ మేనిఫెస్టో తయారీకి ప్రత్యేకంగా కమిటీని ఏర్పాటు చేశారు.
ఇందులో భాగంగా మొదటి విడత మేనిఫెస్టోను మహానాడులో ప్రకటిస్తామని టీడీపీ నేతలు తెలిపారు. ఈ మేనిఫెస్టోలో మహిళలు, యువత, రైతులకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్టు చెప్పారు. అలాగే పూర్తిస్థాయి మేనిఫెస్టోను దసరా నాడు విడుదల చేయనున్నట్టు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తెలిపారు. ఇవాళ మహానాడు నిర్వహణ కమిటీలతో నిర్వహించిన సమావేశంలో అచ్చెన్నాయుడు మాట్లాడుతూ వివరాలు వెల్లడించారు.
27 న టీడీపీ ప్రతినిధుల సమావేశం నిర్వహిస్తామన్నారు. 15 వేల మంది ప్రతినిధులతో.. 15 తీర్మానాలు రూపొందిస్తామన్నారు. టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోను విజయదశమి నాడు ప్రకటిస్తామన్నారు. అచ్చెన్నాయుడి ప్రకటనపై సోషల్ మీడియాలో సెటైర్స్ పేలుతున్నాయి. 2014లో ఎలాగైనా అధికారంలోకి రావాలనే ఉద్దేశంతో ఆచరణ సాధ్యం కాని హామీలతో మేనిఫెస్టోను తయారు చేశారని నెటిజన్లు గుర్తు చేశారు. రైతుల రుణమాఫీ, బ్యాంకుల్లో కుదవ పెట్టిన బంగారాన్ని ఇంటికి తీసుకొచ్చే హామీ, నిరుద్యోగులకు ఉద్యోగాలు, డ్వాక్రా రుణాల మాఫీ తదితరాలతో కూడిన 600 హామీలు ఇచ్చారని, 2019 ఎన్నికల నాటికి టీడీపీ వెబ్‌సైట్‌లో మేనిఫెస్టో కరువైందంటూ నెటిజన్లు దెప్పి పొడిచారు.
కనీసం వచ్చే ఎన్నికలకైనా గర్వంగా అమలు చేశామని చెప్పుకునే మేనిఫెస్టోను తయారు చేయాలని నెటిజన్లు హితవు చెబుతున్నారు. వందలాది హామీలతో జనాన్ని మభ్యపెట్టేలా కాకుండా, నిజాయతీగా అమలు చేసేవి మాత్రమే చెప్పాలని టీడీపీ మేనిఫెస్టో కమిటీకి సూచిస్తున్నారు.