అవినాష్ అరెస్ట్ ఆశావ‌హుల‌కు షాక్‌!

క‌డ‌ప ఎంపీ అవినాష్‌రెడ్డిని సీబీఐ ఎప్పుడు అరెస్ట్ చేస్తుందా అని ఆశ‌గా ఎదురు చూస్తున్న వారికి ఆశాభంగం త‌ప్ప‌లేదు. ముంద‌స్తు బెయిల్ పిటిష‌న్ వేసుకునే హ‌క్కు అవినాష్‌రెడ్డికి ఉంద‌ని జ‌స్టిస్ మ‌హేశ్వ‌రి, జ‌స్టిస్ న‌ర్సింహుల‌తో…

క‌డ‌ప ఎంపీ అవినాష్‌రెడ్డిని సీబీఐ ఎప్పుడు అరెస్ట్ చేస్తుందా అని ఆశ‌గా ఎదురు చూస్తున్న వారికి ఆశాభంగం త‌ప్ప‌లేదు. ముంద‌స్తు బెయిల్ పిటిష‌న్ వేసుకునే హ‌క్కు అవినాష్‌రెడ్డికి ఉంద‌ని జ‌స్టిస్ మ‌హేశ్వ‌రి, జ‌స్టిస్ న‌ర్సింహుల‌తో కూడిన సుప్రీంకోర్టు ధ‌ర్మాస‌నం కీల‌క వ్యాఖ్య‌లు చేయ‌డం విశేషం. ఇటీవ‌ల రెండు ద‌ఫాలు సీబీఐ విచార‌ణ‌కు అవినాష్‌రెడ్డి వెళ్ల‌ని విష‌యం తెలిసిందే.

త‌న త‌ల్లి తీవ్ర అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్నార‌ని, ఆమె యోగ‌క్షేమాలు చూసుకోవాల్సిన బాధ్య‌త త‌న‌పై ఉంద‌ని, మ‌రోసారి విచార‌ణ‌కు వ‌స్తాన‌ని సీబీఐకి ఆయ‌న లేఖ రాసిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం క‌ర్నూలులోని ఓ ప్రైవేట్ ఆస్ప‌త్రిలో అవినాష్‌రెడ్డి త‌ల్లి చికిత్స తీసుకుంటున్నారు. ఆమె ద‌గ్గ‌ర అవినాష్ వున్నారు. ఈ నేప‌థ్యంలో క‌ర్నూలుకు సీబీఐ అధికారులు వెళ్ల‌డం, ఇదిగో అరెస్ట్‌, అదిగో అరెస్ట్‌, కేంద్ర బ‌ల‌గాలు వ‌స్తున్నాయంటూ ఎల్లో మీడియా నానా హ‌డావుడి చేసింది. చివ‌రికి అంతా తుస్సుమంది.

మ‌రోవైపు ముంద‌స్తు బెయిల్ కోసం సుప్రీంకోర్టును అవినాష్‌రెడ్డి ఆశ్ర‌యించారు. తెలంగాణ హైకోర్టు వెకేష‌న్ బెంచ్‌కు వెళ్లాల‌ని అవినాష్‌రెడ్డికి సుప్రీంకోర్టు ధ‌ర్మాస‌నం సూచించింది. అవినాష్ పిటిష‌న్‌పై ఈ నెల 25న విచారించాల‌ని తెలంగాణ హైకోర్టు వెకేష‌న్ బెంచ్‌ను సుప్రీంకోర్టు ధ‌ర్మాస‌నం ఆదేశించింది. ఈ సంద‌ర్భంగా వివేకా కుమార్తె డాక్ట‌ర్ న‌ర్రెడ్డి సునీత త‌ర‌పు న్యాయ‌వాది వాద‌న‌లు వినిపించ‌డానికి ప్ర‌య‌త్నించ‌గా ధ‌ర్మాస‌నం అంగీక‌రించ‌లేదు.

కేసు మెరిట్స్‌లోకి తాము వెళ్ల‌ద‌లుచుకోలేద‌ని, ఏదైనా చెప్పాల‌ని అనుకుంటుంటే తెలంగాణ హైకోర్టుకి వెళ్లాల‌ని స్ప‌ష్టం చేసింది. దీంతో చేసేదేమీలేక‌పోయింది. ఈ నెల 25వ తేదీలోపు అవినాష్‌రెడ్డిని అరెస్ట్ చేయ‌క‌పోతే, ఆ త‌ర్వాత ఏమీ చేయ‌లేర‌ని ఎల్లో గ్యాంగ్ ఆందోళ‌న చెందుతోంది. ఇదిలా వుండ‌గా రెండు రోజుల పాటు అరెస్ట్ నుంచి అవినాష్‌కు ఊర‌ట ల‌భించ‌డంపై వైసీపీ ఆనందం వ్య‌క్తం చేస్తోంది. ఈ రెండు రోజుల గండం దాటితే అవినాష్‌ను అరెస్ట్ చేసే ప‌రిస్థితి వుండ‌ద‌నే చ‌ర్చ న‌డుస్తోంది.