Advertisement

Advertisement


Home > Politics - Analysis

వైసీపీకి అతిపెద్ద స‌వాల్‌!

వైసీపీకి అతిపెద్ద స‌వాల్‌!

క‌నీవినీ ఎరుగ‌ని రీతిలో ప్ర‌జాద‌ర‌ణ పొంది, అత్య‌ధిక సీట్ల‌తో అధికారం ద‌క్కించుకున్న వైసీపీకి భ‌విష్య‌త్ అతిపెద్ద స‌వాల్ విసురుతోంది. ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ ఎన్నో క‌ష్ట‌న‌ష్టాల‌కు ఓర్చి సాధించుకున్న అధికారాన్ని నిలబెట్టుకోవ‌డ‌మే ఇప్పుడు వైసీపీకి భారీ టాస్క్‌. స‌రిగ్గా నాలుగేళ్ల క్రితం ఇదే రోజు వైసీపీ తిరుగులేని ప్ర‌జాద‌ర‌ణ‌తో నాటి అధికార పార్టీ టీడీపీని మ‌ట్టి క‌రిపించింది.

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాల్లో వైసీపీ ప్ర‌స్థానంలో ఇదో సువ‌ర్ణాధ్యాయం. నాలుగేళ్ల క్రితం వైసీపీని అధికారంలోకి తీసుకురావాల‌ని శ్ర‌మించిన వారి ఆశ‌లు ఎంత వ‌ర‌కూ నెర‌వేరాయి? మెజార్టీ ప్ర‌జ‌లు కోరుకున్న‌ట్టుగా జ‌గ‌న్ పాల‌న ఉందా?  ఇదే రీతిలో జ‌గ‌న్ ఉంటే మ‌ళ్లీ అధికారం ద‌క్కుతుందా? త‌దిత‌ర ప్ర‌శ్న‌లు...పౌర స‌మాజంలో పెద్ద ఎత్తున చ‌ర్చ‌నీయాంశ‌మయ్యాయి. వైఎస్ జ‌గ‌న్‌కు ఏ న‌వ‌ర‌త్నాలైతే ఘ‌న విజ‌యాన్ని తెచ్చి పెట్టాయో, ఇప్పుడ‌వే ఆయన‌కు క‌ష్టాలు తీసుకొచ్చాయా? అనే చ‌ర్చ న‌డుస్తోంది.

2019, ఏప్రిల్ 11న సార్వ‌త్రిక ఎన్నిక‌లు జ‌రిగాయి. మే 23న ఓట్ల లెక్కింపు జ‌రిగింది. ఫ‌లితాల్లో వైసీపీ 151 అసెంబ్లీ, 22 ఎంపీ సీట్ల‌లో ఘ‌న విజ‌యం సాధించింది. టీడీపీ కేవ‌లం 23 ఎమ్మెల్యే, మూడు ఎంపీ సీట్ల‌కు ప‌రిమిత‌మైంది. జ‌న‌సేన కేవ‌లం ఒకే ఒక్క సీటుతో స‌రిపెట్టుకోవాల్సి వ‌చ్చింది. జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్ పోటీ చేసిన రెండు చోట్ల ఓడిపోయి ప‌రువు పోగొట్టుకున్నారు. 2019, మే 30న సీఎంగా వైఎస్‌ జగన్‌ ప్రమాణ స్వీకారం చేశారు.  

నాలుగేళ్ల జ‌గ‌న్ పాల‌న మ‌రోసారి ప్ర‌జాతీర్పును ఎదుర్కోడానికి స‌మ‌యం ద‌గ్గ‌ర ప‌డుతోంది. ఇప్ప‌టికే జ‌గ‌న్ పాల‌న‌పై ప్ర‌జానీకం ఒక అభిప్రాయానికి వ‌చ్చారు. అయితే మెజార్టీ అభిప్రాయం ఏంట‌నేది అంతుబ‌ట్ట‌డం లేదు. మ‌రోవైపు టీడీపీకి బ‌ల‌మైన మీడియా అండ ఉండ‌డంతో జ‌గ‌న్ పాల‌నపై భారీగా వ్య‌తిరేక‌త వుంద‌నే ప్ర‌చారం ఊపందుకుంటోంది. న‌వ‌ర‌త్నాల పేరుతో వైసీపీ తీసుకొచ్చిన మేనిఫెస్టోలో ఇప్ప‌టికే 98 శాతం పూర్తి చేసిన‌ట్టు ప్ర‌భుత్వం చెబుతోంది.

సంక్షేమ ప‌థ‌కాల అమ‌ల్లో జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు చేయ‌లేని ప‌రిస్థితి. జ‌గ‌న్‌ది సంక్షేమ పాల‌న అనే పేరు తెచ్చుకున్నారు. ఇక్క‌డ స‌మ‌స్య ఏంటంటే...బ‌ట‌న్ నొక్కి, ల‌బ్ధిదారుల ఖాతాల్లో నేరుగా డ‌బ్బు జ‌మ చేయ‌డ‌మే ప‌నిగా సీఎం పెట్టుకున్నార‌నే విమ‌ర్శ వెల్లువెత్తుతోంది. ఇది నాణేనికి ఒక వైపు. నాణేనికి రెండో వైపు ప‌రిశీలిస్తే జ‌గ‌న్ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత అనేక విప్ల‌వాత్మ‌క‌మైన మార్పులు తీసుకొచ్చారు.

క‌రోనా మహ‌మ్మారి రెండుమూడేళ్ల పాటు ఒక్క ఆంధ్ర‌ప్ర‌దేశ్ మాత్ర‌మే కాకుండా ప్ర‌పంచ ఆర్థిక వ్య‌వ‌స్థ‌ని కుదేలు చేసింది. ఇలాంటి అత్యంత క్లిష్ట‌మైన విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో కూడా జ‌గ‌న్ ప్ర‌భుత్వం సంక్షేమ ప‌థ‌కాల‌ను అమ‌లు చేసి, ఆర్థిక వెన్నుదున్నుగా నిలిచింది. క‌రోనా కాలంలో జ‌గ‌న్ ప్ర‌భుత్వం తీసుకున్న పాల‌నా విధానాలు సీఎంగా ఆయ‌న‌కు మంచి పేరే తీసుకొచ్చాయి. క‌రోనాతో స‌హ‌జీవనం చేయాల్సిందే అని మొట్ట‌మొద‌ట చెప్పిన సీఎంగా జ‌గ‌న్ చెప్పిందే, ఆ త‌ర్వాత కాలంలో తెలంగాణ సీఎం కేసీఆర్‌, ప్ర‌ధాని మోదీ, ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ కూడా చెప్పాల్సి వ‌చ్చింది. జ‌గ‌న్ ముందు చూపున‌కు ఇది నిద‌ర్శ‌నం.

జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఇప్ప‌టి వ‌ర‌కూ పేద‌ల‌కు వివిధ ప‌థ‌కాల ద్వారా రూ.2.10 ల‌క్ష‌ల కోట్ల ప్ర‌యోజ‌నం క‌లిగించ‌డం విశేషం. బ‌హుశా ఇప్ప‌టి వ‌ర‌కూ ఏ ప్ర‌భుత్వం కూడా ఈ స్థాయిలో భారీ ల‌బ్ధి క‌లిగించి ఉండ‌దనే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఇదే సంద‌ర్భంలో అప్పులు కూడా పుట్ట‌లా పెరిగిపోయాయి. నాడు-నేడు ద్వారా ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లు, అలాగే ప్ర‌భుత్వ ఆస్ప‌త్రుల రూపురేఖ‌లు మారిపోయాయి. ఒక‌ప్పుడు ప్ర‌భుత్వ ఆస్ప‌త్రికి వెళ్లాల‌న్నా, ప్ర‌భుత్వ బ‌డుల్లో చ‌ద‌వాల‌న్నా సిగ్గుప‌డే వారు. ఇప్పుడు ఆ ప‌రిస్థితి లేదు. జ‌గ‌న్ పాల‌న తీసుకొచ్చిన విప్ల‌వాత్మ‌క మార్పున‌కు ఇదో నిద‌ర్శ‌నం.

అలాగే గ్రామ‌, వార్డు స‌చివాల‌యాల‌ను తీసుకొచ్చి పాల‌న‌ను ప్ర‌జ‌ల‌కు మ‌రింత ద‌గ్గ‌ర‌గా తీసుకొచ్చారు. ఒక‌ప్పుడు ప్ర‌తి చిన్న ప‌నికి మండ‌ల కేంద్రాల‌కు ప‌రుగులు తీయాల్సిన దుస్థితి. ఇప్పుడు వాలంటీర్లే ఇంటి వ‌ద్ద‌కు వ‌చ్చి మ‌రీ వివ‌రాలు తీసుకుంటున్నారు. అవ‌స‌ర‌మైన ప‌నుల్ని రాజ‌కీయాల‌కు అతీతంగా చేసి పెడుతున్నారు. ప్ర‌భుత్వ పాఠ‌శాలల్లో ఆంగ్ల మాధ్య మం ప్ర‌వేశ పెట్ట‌డం మ‌రో అద్భుతం. మారుతున్న కాలానికి అనుగుణంగా, ప్ర‌పంచంతో పోటీ ప‌డేందుకు ఇంగ్లీష్ విద్య అత్య‌వస‌రం. ఇంగ్లీష్ చ‌దువంటే ప‌ట్ట‌ణాల‌కు, అది కూడా సంప‌న్నుల‌కు ప‌రిమిత‌మైన వ్యవ‌హారంగా ఉండింది.

జ‌గ‌న్ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత ప‌ల్లెల‌కు ఇంగ్లీష్ విద్య‌ను తీసుకొచ్చి, పేద‌లు, అణ‌గారిన వ‌ర్గాల వారికి ఆంగ్ల మాధ్య‌మంలో చ‌దివే అవ‌కాశాన్ని క‌ల్పించారు. ఇందుకోసం జ‌గ‌న్ అనేక వ్య‌వ‌స్థ‌ల‌తో త‌ల‌ప‌డాల్సి వ‌చ్చింది. స్థానిక సంస్థ‌ల్లో, ప్ర‌భుత్వంలో బ‌డుగు, బ‌ల‌హీన వ‌ర్గాల వారికి జ‌గ‌న్ పెద్ద‌పీట వేశారు. జ‌గ‌న్ కేబినెట్ రెండు ద‌ఫాలుగా కొలువుదీరిన సంగ‌తి తెలిసిందే. మొద‌టి కేబినెట్‌లో 56 శాతం ప‌ద‌వులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల‌కు కేటాయించారు. రెండో కేబినెట్‌లో ఆ సంఖ్య 70 శాతానికి పెర‌గ‌డం విశేషం. రాజ్య‌స‌భ‌, ఎమ్మెల్సీ ప‌ద‌వుల‌తో పాటు నామినేటెడ్ పోస్టుల్లో అగ్ర‌భాగం ఆ సామాజిక వ‌ర్గాల‌కే. ఇవ‌న్నీ జ‌గ‌న్ ఎన్నిక‌ల కోణంలో చేసిన‌వే.

జ‌గ‌న్ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత జ‌రిగిన స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌తో పాటు తిరుప‌తి లోక్‌స‌భ‌, ఆత్మకూరు ఎమ్మెల్యే స్థానాల‌కు జ‌రిగిన ఉప ఎన్నిక‌ల్లో వైసీపీ తిరుగులేని విజ‌యాల్ని సొంతం చేసుకుంది. ఒక‌ద‌శ‌లో టీడీపీ పోటీ నుంచి త‌ప్పుకోవాల్సిన దుస్థితి ఏర్ప‌డింది. కొత్త‌గా మెడిక‌ల్ కాలేజీల ఏర్పాటు, అలాగే జిల్లాల పున‌ర్వ్య‌స్థీక‌ర‌ణ చేప‌ట్టారు. మూడు రాజ‌ధానుల అంశం ప్ర‌స్తుతం పెండింగ్‌లో ఉంది.

ఇవ‌న్నీ జ‌గ‌న్ పాల‌న‌కు సంబంధించి సానుకూల అంశాలు. ప్ర‌తికూల అంశాలు కూడా బోలెడున్నాయి. ముఖ్యంగా జ‌గ‌న్ క‌క్ష‌పూరితంగా పాల‌న సాగిస్తున్నార‌నే ప్ర‌చారం ...సీఎంగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన కొన్ని రోజులకే మొద‌లైంది. చంద్ర‌బాబునాయుడి హ‌యాంలో కొలువుదీరిన ప్ర‌జావేదిక కూల్చివేత జ‌గ‌న్‌కు చెడ్డ‌పేరు తీసుకొచ్చింది. అలాగే మూడు రాజ‌ధానుల‌పై ఒక స్ప‌ష్ట‌మైన విధానంతో ముందుకెళ్ల‌కుండా గంద‌ర‌గోళానికి తెర‌తీసేలా జ‌గ‌న్ ప్ర‌భుత్వం ప్ర‌వ‌ర్తించింది. ఏపీకి రాజ‌ధాని లేకుండా చేశార‌నే చెడ్డ‌పేరును జ‌గ‌న్ మూట‌క‌ట్టుకున్నారు.

ముఖ్యంగా ఉద్యోగుల‌కు సంబంధించి సీపీఎస్ అమ‌లుపై జ‌గ‌న్ స‌ర్కార్ చేతులెత్తేసింది. జ‌గ‌న్ తెలియ‌క హామీ ఇచ్చార‌ని ప్ర‌భుత్వ ప్ర‌ధాన స‌ల‌హాదారు స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి వివ‌ర‌ణ ఇచ్చుకోవాల్సి వ‌చ్చింది. అలాగే తాడేప‌ల్లిలోని నివాసం నుంచి జ‌గ‌న్ బ‌య‌ట‌కు రాక‌పోవ‌డం అతిపెద్ద డ్యామేజీగా చెప్పొచ్చు. క్షేత్ర‌స్థాయిలో అస‌లేం జ‌రుగుతున్న‌దో జ‌గ‌న్‌కు తెలిసే అవ‌కాశ‌మే లేక‌పోయింది. ఇంటెలిజెన్స్ వ్య‌వ‌స్థ ఎలాంటి నివేదిక‌ల‌ను ప్ర‌భుత్వ పెద్ద‌లకు ఇస్తుందో అందరికీ తెలిసిందే. త‌మ ప‌ద‌వుల‌ను కాపాడుకోవ‌డం ఇంటెలిజెన్స్ అని సంబంధిత అధికారుల తీరుగా వుంది.

అభివృద్ధి ప‌నులేవీ లేక‌పోవ‌డం, ప‌రిశ్ర‌మ‌ల స్థాప‌న గురించి నిన్న‌మొన్న‌టి వ‌ర‌కూ ఎలాంటి చ‌ర్య‌లు లేక‌పోవ‌డం కూడా జ‌గ‌న్ స‌ర్కార్‌కు చెడ్డ‌పేరు తీసుకొచ్చింది. మ‌రీ ముఖ్యంగా జ‌గ‌న్ ప్ర‌భుత్వ వ్య‌వ‌హార శైలి వ‌ల్లే ప‌రిశ్ర‌మ‌లు ఏపీ నుంచి పారిపోతున్నాయ‌ని ప్ర‌తిప‌క్షాల విమ‌ర్శ‌ల‌ను తిప్పికొట్టే వ్య‌వ‌స్థ వైసీపీకి కొర‌వ‌డింది. సొంత పార్టీ నేత‌ల బిల్లులు సంవ‌త్స‌రాల త‌ర‌బ‌డి క్లియ‌ర్ కాక‌పోవ‌డంతో వారిలో తీవ్ర నిరాశ నిస్పృహ‌లు అలుముకున్నాయి.

క్షేత్ర‌స్థాయిలో అధికార పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు, వారి అనుచ‌రులు ఇష్టానుసారం ఇసుక‌, మ‌ట్టిని కొల్ల‌గొడుతూ ప్ర‌జ‌ల అవ‌స‌రాల‌కు లేకుండా చేయ‌డం ప్ర‌భుత్వంపై వ్య‌తిరేక‌త‌కు దారి తీసింది. గ‌తంలో కంటే ఇసుక రేటు రెండింత‌లు కావ‌డం తీవ్ర విమ‌ర్శ‌ల‌కు దారి తీసింది. మ‌ద్యానికి సంబంధించి కూడా జ‌గ‌న్ ప్ర‌భుత్వం దోషిగా నిల‌బ‌డాల్సిన దుస్థితి. మందుబాబులు కోరుకున్న బ్రాండ్లు కాకుండా, అధికార పార్టీ నేత‌లు త‌యారు చేసిన మందునే తాగేలా చేయ‌డం ఆగ్ర‌హానికి గురి చేసింది. అలాగే మ‌ద్యం ధ‌ర‌ల‌ను కొంత కాలం బాగా పెంచ‌డం కూడా జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై కోపాగ్ని ర‌గిల్చింది.

ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగుల‌కు జీతాలను ప్ర‌తినెలా ఒక‌టో తారీఖున వేయ‌డాన్ని ప్ర‌భుత్వం మ‌రిచిపోయింది. ముఖ్యంగా ఉపాధ్యాయులు, ఇత‌ర ఉద్యోగుల‌తో ప్ర‌భుత్వం ఘ‌ర్ష‌ణ వైఖ‌రితో వ్య‌వ‌హ‌రిస్తోంది. ఇది రాజ‌కీయంగా వైసీపీని భారీగా దెబ్బ‌తీసే ప్ర‌మాదం వుంది. ప్ర‌భుత్వం వ‌స్తే త‌మ జీవితాలు మారుతాయ‌ని ఆశించిన వైసీపీ శ్రేణుల‌కు తీవ్ర నిరాశే ఎదురైంది. వైసీపీ కోసం క‌ష్ట‌ప‌డిన వారిని, ఇత‌రుల‌ను ఒకే గాట క‌ట్టేయ‌డంతో ఇక తామెందుకు పార్టీ కోసం క‌ష్ట‌ప‌డాల‌న్న భావ‌న వారిలో చోటు చేసుకుంది.

ఒక‌ప్పుడు వైసీపీ కోసం సోష‌ల్ మీడియాలో సైనికులు స్వ‌చ్ఛందంగా పని చేశారు. ఇప్పుడు డ‌బ్బులిస్తామ‌న్నా వైసీపీ కోసం ప‌ని చేయ‌డానికి చెప్పుకోత‌గ్గ స్థాయిలో ఎవ‌రూ ముందుకు రావ‌డం లేదు. జ‌గ‌న్‌కు అధికారం ద‌క్కిన త‌ర్వాత బ్యూరోక్రాట్స్ అంతా చుట్టూ చేరారు. పార్టీకి సంబంధించిన నేత‌లెవ‌రూ ఆయ‌న ద‌రిదాపుల్లో లేరు. కేవ‌లం స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి, పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి మాత్ర‌మే క‌నిపిస్తున్నారు. విజ‌య‌సాయిరెడ్డి తామ‌రాకుపై నీటిబొట్టులా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

మ‌రోవైపు జ‌గ‌న్‌ను వ్య‌తిరేకించే శ‌క్తుల‌న్నీ ఏక‌మ‌వుతున్నాయి. జ‌గ‌న్ మాత్రం రోజురోజుకూ ఒంట‌రి అవుతున్నారు. 2019 నాటి ప‌రిస్థితులు 2024లో ఉండ‌వు. టీడీపీ, జ‌న‌సేన త‌ప్ప‌క క‌లుస్తాయి. బీజేపీ గురించి ఇప్పుడే చెప్ప‌లేం. జ‌గ‌న్ పార్టీతో క‌లిసొచ్చే వాళ్లెవ‌రూ లేరు. జ‌గ‌న్ న‌మ్మ‌కం దేవుడు, ప్ర‌జ‌లే. దేవుడు కేవ‌లం జ‌గ‌న్ ప‌క్షానే వుండ‌రు. అంద‌రికీ దేవుడు ఒక్క‌డే. ప్ర‌జాస్వామ్యంలో స‌మాజాన్ని దేవాల‌యంగా, ఓట‌ర్ల‌ను దేవుళ్ల‌గా కొలుస్తారు.

ఓట‌రు దేవుళ్ల ఆశీస్సులు ఎవ‌రికి వుంటే వారిదే సీఎం ప‌ద‌వి. సింహం సింగిల్‌గానే వ‌స్తుంద‌ని వైసీపీ నేత‌లు జ‌గ‌న్ గురించి గొప్ప‌గా చెబుతుంటారు. రాజ‌కీయాల్లో ఇది అన్ని స‌మ‌యాల్లో మంచిది కాదు. జ‌గ‌న్ అధికారంలోకి వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి ఎన్నో విజ‌యాల‌ను ద‌క్కించుకున్న‌ప్ప‌టికీ, కొన్ని నెల‌ల క్రితం మూడు గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో వైసీపీ అభ్య‌ర్థుల ఓట‌మితో భ‌యం ఎందుకు మొద‌లైందో స‌మాధానం చెబుతారా? క్షేత్ర‌స్థాయిలో ఏదో తేడా కొడుతుంద‌నే సంకేతాల్ని గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఫ‌లితాలు ఇచ్చాయి. 

ఇటు వైసీపీ, అటు టీడీపీ-జ‌న‌సేన కూట‌మి ఎన్నిక‌ల స‌మ‌రానికి సిద్ధ‌మ‌వుతున్నాయి. యుద్ధంలో త‌ల‌ప‌డేందుకు ఇరువైపుల వారు అస్త్ర‌శ‌స్త్రాలు సిద్ధం చేసుకుంటున్నారు. ఇటు, అటు వైపులా సైన్యాధ్య‌క్షులు చురుగ్గా ఉన్నారు.

కానీ జ‌గ‌న్ వైపు సైన్యం అనేక కార‌ణాల రీత్యా ఉత్సాహంగా లేదు. అదే ఇప్పుడు అస‌లు స‌మ‌స్య‌. శ్రేణుల్ని స‌మ‌రానికి స‌మాయ‌త్తం చేయాలంటే జ‌గ‌న్ తాడేప‌ల్లి ఇంటి నుంచి బ‌య‌ట‌కు రావాలి. "నేను విన్నా, నేను ఉన్నా" అని మాట‌లు చెప్ప‌డం కాదు, ఆచ‌ర‌ణ‌లో చూపాలి. అప్పుడే అధికారాన్ని తిరిగి నిల‌బెట్టుకునే ప‌రిస్థితి వుంటుంది. 

కాలం, జ‌యాప‌జ‌యాలు ఎప్పుడూ ఒక‌రి ప‌క్షాన్నే వుండ‌వు. వాటిని గౌర‌వించి, భ‌య‌భ‌క్తుల‌తో మెలిగే వారిప‌ట్ల సానుభూతితో వుంటాయి. కాదు, కూడ‌ద‌ని విజ‌య గ‌ర్వంతో వ్య‌వ‌హ‌రిస్తే, చంద్ర‌బాబుకు ఎలాంటి గ‌తి ప‌ట్టిందో నిలువెత్తు సాక్ష్యం మ‌న క‌ళ్లెదుటే వుంది. 

ఎప్పుడూ జ‌గ‌న్ కోస‌మే మేం త్యాగం చేయాలా? మా కోసం ఆయ‌న ఏమీ చేయ‌రా? అనే ప్ర‌శ్న వెల్లువెత్తుతోంది. ఈ ప్ర‌శ్న‌, నిల‌దీత జ‌గ‌న్‌ను ఇంత కాలం బాగా అభిమానించే వారి నుంచే వ‌స్తున్నాయి. దీనికి స‌మాధానంగా క‌నీసం ఈ ఏడాదిలోనైనా చేత‌ల్లో చెప్ప‌గ‌లిగితే జ‌గ‌న్ కోసం మ‌ళ్లీ మునుప‌టిలా ప‌ని చేస్తారు. అందుకే  అధికారాన్ని నిల‌బెట్టుకోవ‌డం ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌కు అతిపెద్ద స‌వాల్ అని చెప్ప‌డం.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?