పురుషులందు పుణ్య పురుషులు వేరయా అన్నట్టు…రాజకీయాల్లో చంద్రబాబు అంతటి సుఖ పురుషుడు లేరు. చంద్రబాబుకు ఏ మాత్రం ప్రజాకర్షణ లేకపోయినా, ఆంధ్రప్రదేశ్‌ను 14 ఏళ్ల పాటు అత్యధిక కాలం పాలించిన సీఎంగా ఘనత దక్కించుకున్నారు. ఎన్టీఆర్ శతజయంతి వేడుకలను టీడీపీ అట్టహాసంగా నిర్వహిస్తోంది. దీని వెనుక రాజకీయ లక్ష్యాలు, ఉద్దేశాలేంటో అందరికీ బాగా తెలుసు.
సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రజాదరణ పొందేందుకు చంద్రబాబు ఎన్నెన్నో వ్యూహాలు రచిస్తున్నారు. చంద్రబాబు మొదటి నుంచి రాజకీయంగా స్వయం ప్రకాశకం కాదు. దీంతో ప్రతి ఎన్నికల్లోనూ ఏదో ఒక పార్టీపై ఆధారపడాల్సిన తప్పనిసరి పరిస్థితి. బాబు రాజకీయ ప్రస్థానాన్ని గమనిస్తే… అడుగడుగునా రాజకీయ ఊత కర్రలపై అధికారాన్ని సంపాదించుకోవడం, నిలుపుకోవడం కనిపిస్తుంది.
ఇప్పుడు కూడా ఎన్టీఆర్ పేరుతోనే టీడీపీకి ఓట్లు వేయాలని ఆయన అప్పీల్ చేస్తున్నారు. ఎన్టీఆర్ యుగపురుషుడు, శకపురుషుడని ఆయన్ని వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు కీర్తించడం గమనార్హం. ఎన్టీఆర్ యుగ, శక పురుషుడనే అంశాన్ని పక్కన పెడితే, చంద్రబాబు మాత్రం సుఖ పురుషుడనే కామెంట్స్ వెల్లువెత్తుతున్నాయి. ఇతరుల కష్టంపై ఆయన సుఖాన్ని అనుభవిస్తున్నారు.
కాంగ్రెస్ పార్టీలో ఆయన రాజకీయ ప్రస్థానం మొదలైంది. మొదట్లో ఆయన్ను మాజీ మంత్రి గల్లా అరుణకుమారి తండ్రి, మాజీ ఎంపీ రాజగోపాల్‌నాయుడు ప్రోత్సహించారు. ఆ తర్వాత చంద్రబాబు కుమార్తె భువనేశ్వరిని పెళ్లి చేసుకోవడం రాజకీయంగా ఆయన దశను మార్చింది. అయితే ఎన్టీఆర్ టీడీపీని స్థాపించినప్పుడు ఆ పార్టీ భవిష్యత్‌పై అనుమానంతో కాంగ్రెస్‌లోనే చంద్రబాబు కొనసాగారు. పైగా ఇందిరాగాంధీ ఆదేశిస్తే… తన మామ ఎన్టీఆర్‌పై పోటీ చేస్తానని ప్రగల్భాలు పలికారు.
ఆ తర్వాత రాజకీయ పరిణామాలు అందరికీ తెలిసినవే. 1994లో టీడీపీని అత్యధిక సీట్లతో ఎన్టీఆర్ అధికారంలోకి తెచ్చుకున్నారు. 1995లో పిల్లనిచ్చిన మామ అని కూడా చూడకుండా సీఎం పదవి నుంచి కూలగొట్టారు. ఆ తర్వాత ఎన్నికల్లో వాజ్‌పేయ్ హవాలో బీజేపీతో పొత్తు పెట్టుకుని అధికారాన్ని దక్కించుకున్న అదృష్టజాతకుడు చంద్రబాబు. రాష్ట్ర విభజన ఆయనకు కలిసొచ్చింది.
పరిపాలన అనుభవం కలిగిన నాయకుడు విభజన రాష్ట్రానికి సీఎం అయితే బాగుంటుందని కొన్ని వర్గాలు భావించడం, అలాగే మోదీ గాలి వీస్తున్న సమయంలో బీజేపీతో పొత్తు, జనసేనాని పవన్‌కల్యాణ్ మద్దతు చంద్రబాబు మరోసారి అధికారంలోకి రావడానికి కలిసొచ్చాయి. 2019లో టీడీపీ ఒంటరిగా పోటీ చేయడంతో బాబుకు ఘోర పరాజయం తప్పలేదు. 2024 ఎన్నికల ముంగిట ఏపీలో రాజకీయ సమీకరణలు మారుతున్నాయి.
సీఎం జగన్‌పై విపరీతమైన ద్వేషంతో చంద్రబాబు పల్లకీ మోయడానికి పవన్‌కల్యాణ్ తహతహలాడుతున్నారు. ఇది బాబు అదృష్టం కాకుండా మరేమవుతుంది? జనసేన అనే పార్టీ పెట్టుకుని చంద్రబాబును సీఎం చేయాలని ఒక పార్టీ అధ్యక్షుడిగా పవన్‌కల్యాణ్ మాదిరిగా బహుశా ప్రపంచంలో మరే రాజకీయ నాయకుడు ఆలోచించరేమో!
ఇలా ఏ రకంగా చూసినా రాజకీయాల్లో చంద్రబాబు అదృష్టపురుషుడు, సుఖ పురుషుడే. బాబు లాంటి జిత్తుల మారికి పిల్లనిచ్చి, చేజేతులా పదవీ గండం తెచ్చుకున్న ఎన్టీఆర్ అంతటి దురదృష్టవంతుడు మరొకరు ఉండరేమో! ఎన్టీఆర్ రెండోసారి వెన్నుపోటు నుంచి తప్పించుకోలేకపోవడానికి ప్రధాన కారణం… నాయకత్వం వహించిన చంద్రబాబు స్వయాన అల్లుడు కావడమే.
బాబుకు ఎన్టీఆర్ రక్తం పంచుకుని పుట్టిన బిడ్డలే వెన్నుదన్నుగా నిలిచిన సంగతి తెలిసిందే. పాపం దురదృష్టవంతుడైన ఎన్టీఆర్‌ను యుగ పురుషుడు, శకపురుషుడుని చేసి రాజకీయ పబ్బం గడుపుకోవాలనే ప్రయత్నాలు చూస్తే… అంతా కాల మహిమ అని సరిపెట్టుకోవాలేమో!