మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడిలో ఇటీవల ఏదో తెలియని మార్పు. ఎప్పుడూ సీరియస్‌గా కనిపించే చంద్రబాబు, ఇటీవల నవ్వుతూ కనిపించడం సరికొత్త మార్పుగా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రధాన ప్రత్యర్థి , ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు ఇటీవల వరుస ఎదురు దెబ్బలు తగులుతుండడం బాబులో జోష్ నింపుతోందని చెప్పొచ్చు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై నవ్వుతూ సెటైర్స్ విసురుతూ, శ్రేణుల్ని నవ్వించడం ఆసక్తికర పరిణామంగా చెప్పొచ్చు. వైసీపీ నేతల ఇళ్లల్లో దంపతులు సంసారం చేసుకోకపోయినా తనే కారణమని అంటారని ఆయన చలోక్తులు విసరడం… ఆయనలో వచ్చిన మార్పునకు నిదర్శనం. ఈ సందర్భంగా ఆయన అత్యుత్సాహానికి పోతూ ప్రత్యర్థులపై విమర్శలు చేస్తున్న నేపథ్యంలో నవ్వులపాలు కూడా అవుతున్నారు.
హైదరాబాద్‌ను తానే అభివృద్ధి పరిచానని, అక్కడ రింగ్‌రోడ్డు, సైబర్ సిటీ నిర్మాణం, తదితర కట్టడాలన్నీ తన ఘనతే అని బాబు ప్రకటిస్తూ సోషల్ మీడియాలో ట్రోలింగ్‌కు గురి అవుతున్నారు. ఇవాళ ఆయన మీడియా మాట్లాడుతూ కామెడీ పండించారు. తెలుగువారంతా తమ కుటుంబ సభ్యులే అన్నారు. తెలుగు వారే తన కులం, మతం అని చెప్పడం గమనార్హం. అభివృద్ధి చేయలేని వారే కులం, మతం, ప్రాంతం పేరుతో ప్రజల్ని రెచ్చగొడతారని ఆయన తీవ్ర విమర్శలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో అన్ని తప్పులకు తానే కారణమంటున్నారని ఎద్దేవా చేశారు.
పేటీఎం బ్యాచ్‌ను అడ్డుపెట్టుకుని టీడీపీపై విషప్రచారం చేశారని చంద్రబాబు విమర్శించారు. ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ఎండగట్టాలన్నారు. ప్రజల కష్టాలను వెలుగులోకి తేవాల్సిన బాధ్యత ఐటీడీపీ సభ్యులపై ఉందన్నారు. ఐటీడీపీ సభ్యులపై ఎన్నో అక్రమ కేసులు పెట్టారని, భయపడకుండా ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్ధంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు.
అన్ని రకాల మీడియా సంస్థల్ని తన గుప్పిట పెట్టుకుని ప్రత్యర్థులపై విషాన్ని చిమ్మడంలో చంద్రబాబుకు సాటి రారెవరనే పేరు సొంతం చేసుకన్నారు. అలాంటి చంద్రబాబు తనపై జగన్ విష ప్రచారం చేశారని విమర్శించడం పెద్ద జోక్. అలాగే తెలుగు వారే తన కులం, మతం అని చెప్పడం కంటే పెద్ద జోక్ ఏముంటుందని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.
తన సామాజిక వర్గం ప్రయోజనాలు తప్ప, మిగిలిన వారి గురించి చంద్రబాబు ఏ మాత్రం పట్టించుకోక పోవడం వల్లే గత సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని మూటకట్టుకున్నారు. అంతెందుకు అమరావతి రాజధానిలో భూములు ఏ సామాజిక వర్గానికి ఉన్నాయో లెక్కిస్తే బాబు మాటల్లో నిజాయతీ ఏంటో తెలుస్తుందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.