Advertisement

Advertisement


Home > Movies - Reviews

మూవీ రివ్యూ: సెబాస్టియన్ పిసి 524

మూవీ రివ్యూ: సెబాస్టియన్ పిసి 524

టైటిల్: సెబాస్టియన్ పిసి 524
రేటింగ్: 2.25/5
తారాగణం: కిరణ్ అబ్బవరం, నువేక్ష, కోమలీ ప్రసాద్ తదితరులు
కెమెరా: రాజ్ కె నల్లి
ఎడిటింగ్: విప్లవ్ నైషధం
సంగీతం: ఘిబ్రన్
నిర్మాత: సిద్ధారెడ్డి బి, రాజు, ప్రమోద్
దర్శకత్వం: బాలాజి సయ్యపురెడ్డి
విడుదల తేదీ: 4 మార్చి 2022

పోయినేడు "య‌స్ఆర్ కళ్యాణమండపం" తో యువతను ఆకట్టుకున్న కిరణ్ సబ్బవరం ఇప్పుడీ క్రైం థ్రిల్లర్ తో ముందుకొచ్చాడు. హీరో పాత్రకి రేచీకటి అనే రుగ్మతను పెట్టి కామెడీ టచ్ తో కథ నడపాలనుకోవడం ఇందులోని కమెర్షియల్ ఆలోచన. ట్రైలర్ కూడా ప్రామిసింగ్ గానే అనిపించింది.

విషయంలోకి వెళ్తే తనకి రేచీకటి అనే సత్యాన్ని దాచి సెబాస్టియన్ అనే యువకుడు పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగం సంపాదించడం, ఉద్యోగంలో భాగంగా నైట్ డ్యూటీల్ని ఎదుర్కోవలసి రావడం ప్రధాన కథ. ఆ పరిస్థితుల్లో ఒక పెద్ద క్రైం ని ఎలా చేదించాడనేది ప్లాట్ పాయింట్.

ఈ రేచీకటి కాన్సెప్ట్ తెలుగు ప్రేక్షకులకి చంటి సినిమాలోని బ్రహ్మానందం పాత్రతో పరిచయం. సాయంత్రం 6 దాటితే కళ్లు కనిపించకపోవడంతో అతనెదుర్కునే ఇబ్బందుల్ని కేవలం కామెడీ ట్రాకులోనే అద్భుతంగా రక్తికట్టించారు.

కానీ ఇక్కడ సెబాస్టియన్ హీరో. రేచీకటి అంశాన్ని పెట్టినప్పుడు మెయిన్ కథలో దానిని వాడుకోవడానికి ముందు కావల్సినంత కామెడీని నడిపించొచ్చు. ఎంత ప్రయత్నించినా ఈ కథలోని సీరియస్ డార్క్ యాంగిల్ ని కామెడీ ట్రీటెమెంట్ అధిగమించలేకపోయింది.

స్క్రీన్ ప్లే పరంగా కూడా కొన్ని అవకతవకలున్నాయి. ఎప్పుడైతే పాత్రల పరిచయం గానీ, వాళ్ల బిహేవియర్ గానీ ప్రేక్షకుడికి అర్థం కాకుండా పోతుందో అక్కడ స్క్రీన్ ప్లే లో తేడా ఉన్నట్టే. ఉదాహరణకి హీరోయిన్ మరొకరితో సంబంధం పెట్టుకుందని తెలిసినా కూడా హీరో ఆమెతో ముద్దులతో రొమాంటిక్ ట్రాక్ నడుపుతుంటాడు. ముందు వెయ్యాల్సిన సీన్ వేస్టవకూడదని తర్వాత వాడేసారేమో అనిపిస్తుంది.

అయితే ఈ కథలో చివరికదాకా ఆసక్తిగా కూర్చోబెట్టే అంశం హత్య ఎవరు చేసారన్న విషయం. ఉన్న పాత్రల్లో ఎవరై ఉంటారా అని ప్రేక్షకుడి దృష్టి అందరిమీదకూ వెళ్తుంది. ఈ జానర్ ఎప్పుడో "అవేకళ్లు" సినిమాకి ముందునుంచీ ఉంది. కానీ చివర్లో రివీలింగ్ ట్విస్ట్ ఔటాఫ్ ద బాక్స్ పాయింట్ గా ఉండాలి. ఇక్కడ అది లేదు. పోలీసుల ఇన్వెస్టిగేషన్ కూడా చాలా సిల్లీగా అనిపిస్తుంది.

మొదటి సగంలో కాస్త సరదాగా నవ్వుకునే సన్నివేశాలున్నా మలిసగంలో కథ సీరియస్ అయ్యి మొత్తం మర్డర్ మిస్టరీ చుట్టూనే తిరుగుతుంది.

సాంకేతికంగా ఘిబ్రన్ సంగీతం బాగుంది. ఈ తరహా సినిమాలకు ఆయువపట్టు నేపథ్యసంగీతం. అది ఉండాల్సిన విధంగా ఉంది.

నటీనటుల విషయానికొస్తే శ్రీకాంత్ అయ్యంగర్, సూర్య తప్ప మెయిన్ స్ట్రీం ఆడియన్స్ కి తెలిసిన మొహాలు పెద్దగా లేవు. యూట్యూబ్ వీడియోల ద్వారా పాపులారిటీ సంతరించుకున్న నటులైతే కొందరున్నారు.

దర్శకుడు ఎత్తుకున్న కథ బాగానే ఉన్నా తెరమీదకి ఎక్కించిన తీరు మాత్రం బలహీనంగా ఉంది. ఈ మధ్యన వచ్చిన ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ గానీ, హిట్ గానీ ఈ జానర్లో మంచి సినిమాలనిపించుకున్నాయి. సెబాస్టియన్ పిసీ 524 మాత్రం వాటి సరసన నిలిచేలా లేదు.

బాటం లైన్: రేచీకటే

నేను రెడ్డి అని ఎందుకు పెట్టుకున్నానంటే...

జ‌గ‌న్ ను చూసి నేను మారను