ఆ మధ్య ఆర్జిత సేవల టికెట్ రేట్లు, రెండింతలు, నాలుగింతలు పెంచేయండి అంటూ టీటీడీ బోర్డ్ మీటింగ్ లో వైవీ సుబ్బారెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపాయి. సామాన్యులకు దేవుడ్ని దూరం చేస్తున్నారంటూ పెడర్థాలు తీశాయి ప్రతిపక్షాలు.
కేవలం రికమండేషన్ కోటా టికెట్ రేట్లు పెంచాలనుకున్నాం, సామాన్యులపై ప్రతాపం చూపించట్లేదు అని ఎంత మొత్తుకున్నా ఎవరూ నమ్మలేదు. దీంతో ఆర్జిత సేవలను వారంలో మూడు రోజులు కట్ చేసి, సామాన్యుల కోటా పెంచి టీటీడీ ఓ సంచలన నిర్ణయం తీసుకుంది. దానికి కొనసాగింపుగా ఇప్పుడు మరోసారి ఆర్జిత సేవల సహా ఏ టికెట్ రేటు కూడా పెంచట్లేదని ప్రకటించారు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి.
అన్నదాన సత్రాల సంఖ్య పెంపు..
తిరుమల కొండపై ప్రైవేటు హోటల్స్ ని పూర్తి స్థాయిలో నిషేధించేందుకు టీటీడీ ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే దీనిపై ప్రకటన కూడా వెలువడింది. హోటళ్లు లేకపోతే దానికి ప్రత్యామ్నాయంగా ఉచిత అన్నదాన సత్రాల సంఖ్య గణనీయంగా పెంచాల్సి ఉంటుంది. 24 గంటలు అక్కడ ఏదైనా ఫలహారాలు, ఇతర ఆహార పదార్థాలు అందుబాటులో ఉంచాల్సిన అవసరం ఉంది.
దీనిపై కసరత్తులు చేస్తున్న టీటీడీ ప్రస్తుతానికి తరిగొండ వెంగమాంబ అన్నసత్రంతో పాటు మరో రెండు ప్రాంతాల్లో ఉచిత అన్నప్రసాద వితరణ కేంద్రాలు ప్రారంభించబోతున్నట్టు తెలిపింది. ఇక కొండపై ఉత్తరాది భక్తుల కోసం ప్రత్యేకంగా చపాతీలు, రొట్టెలు కూడా అందుబాటులో ఉంచుతామన్నారు సుబ్బారెడ్డి. భోజనంతో పాటు మూడు పూటలా చపాతీ, రొట్టె భక్తులకు అందిస్తామని స్పష్టం చేశారు.
ఏప్రిల్ 1నుంచి ఆర్జిత సేవలు మొదలు..
కొవిడ్ తర్వాత సాధారణ పరిస్థితులు నెలకొంటున్న దశలో.. ఇటీవలే సర్వదర్శనం కోటాని పెంచింది టీటీడీ. ఆన్ లైన్ తోపాటు, ఆఫ్ లైన్ లో కూడా టికెట్లను జారీ చేస్తోంది. దీంతో భక్తుల రాక భారీగా పెరిగింది. ఇప్పుడు ఆర్జిత సేవల్ని కూడా పునఃప్రారంభించేందుకు టీటీడీ సిద్ధమైంది.
ఏప్రిల్ 1నుంచి ఆర్జిత సేవలు తిరిగి మొదలు పెట్టబోతున్నట్టు ప్రకటించారు చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి. సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తామని, వీఐపీ దర్శనాల సంఖ్య వీలైనంతగా తగ్గిస్తామన్నారు.