సిక్కోలు నుంచి మెరిసిన అందగాడు

శరత్ బాబు ది అత్యంత వెనకబడిన జిల్లా శ్రీకాకుళంలోని ఆముదాలవలస. అక్కడ నుంచి వచ్చి వెండి తెర మీద తొలిసారి హీరోగా మెరిసిన శరత్ బాబు ఆ తరువాత వెనక్కి చూసుకోలేదు. బహుభాషానటుడిగా ఎదిగారు.…

శరత్ బాబు ది అత్యంత వెనకబడిన జిల్లా శ్రీకాకుళంలోని ఆముదాలవలస. అక్కడ నుంచి వచ్చి వెండి తెర మీద తొలిసారి హీరోగా మెరిసిన శరత్ బాబు ఆ తరువాత వెనక్కి చూసుకోలేదు. బహుభాషానటుడిగా ఎదిగారు.

ఒకపుడు మద్రాస్ లో సినిమా ఇండస్ట్రీ ఉండేది. షూటింగులు అన్నీ అక్కడే స్టూడియోలలో జరిగేవి. దాంతో హీరో అంటే దేవలోకం నుంచి దిగి వచ్చిన వారుగానే భావించేవారు. అలా 1970 దశకంలో కుర్రకారుకు సినిమా ఒక మాయా ప్రపంచం. ఇరవై ఏళ్ళు వచ్చిన ప్రతీ యువకుడూ తానూ హీరో కావాలని ఉబలాటపడిపోయేవారు. దానికంటే ముందు 1966లో వచ్చిన తేనే మనుషులులో అంతా కొత్త వారు నటించారు.

ఇద్దరు హీరోలు కూడా ఆ సినిమాతో పరిచయం అయ్యారు. అలా అంతదాకా సినిమా ప్రపంచం అంటే ఆకశంలో అందనంత ఎత్తున ఉందని భావించిన వారిని దాన్ని తామూ అందుకోవచ్చు అన్న ఆశలు మొదలయ్యాయి.అలా సిక్కోలు యువకుడు సత్యనారాయణ దీక్షితులకు కూడా సినిమా మోజు కలిగింది. ఆయనది అతి పెద్ద కుటుంబం, అన్నదమ్ములు అప్పచెల్లెళ్ళు మొత్తం పద్నాలుగు మంది ఉండేవారు. అలాంటి కుటుంబం నుంచి వచ్చిన శరత్ బాబు ఆరడుగుల పొడుగుతో పసిమి చాయతో అందగాడుగా పేరు పడ్డారు

అప్పటికే స్కూల్, కాలేజ్ నాటకాలు వేసి అందరి చేత మెప్పు పొందిన దీక్షితులుని నీవెందుకు హీరో కాకూడదు అని అడిగేవారు. అలా ఆయన తన స్నేహితుల ప్రోత్సాహంతో మద్రాస్ రైలెక్కారు. ఎన్నో ప్రయత్నాలు చేసిన మీదట 1973లో వచ్చిన రామరాజ్యం మూవీలో ఆయన తొలిసారి హీరోగా వెండితెర మీద మెరిశారు. అప్పటికే హీరోయిన్ గా మంచి పొజిషన్ లో ఉన్న చంద్రకళ శరత్ బాబు పక్కన హీరోయిన్. ఈ ఇద్దరికీ అన్నవరం గుడి మెట్ల దగ్గర పరిసర ప్రాంతాల్లో ఒక డ్యూయెట్ సాంగ్ కూడా పెట్టారు.

ఈ మూవీలో ఎస్వీ రంగారావు, మహానటి సావిత్రి, జగ్గయ్య వంటి ఉద్ధండులు ఉన్నారు. అలాగే చంద్రమోహన్, రోజారమణి వంటి వారు నటించారు. ఈ సినిమా హిట్ అయింది. ఆ తరువాత హీరోగా శ్రీకాకుళం వచ్చిన శరత్ బాబుని స్నేహితులు అంతా కలసి సన్మానించారు. రామరాజ్యం ఆడుతున్న థియేటర్ లో తన వారందరితో కలసి శరత్ బాబు సినిమా చూసి పొందిన ఆనందం ఎప్పటికీ మరువలేనిది.

ఆ సినిమా తరువాత శరత్ బాబు కి హీరోగా చాన్సులు రాలేదు కానీ అనేక ఇతర చిత్రాలలో విలన్ సహా ఇతర పాత్రలు దక్కాయి. శరత్ బాబు అద్భుతమైన నటుడు అనిపించుకున్నారు. ఆయన వేసిన చాలా పాత్రలు హీరోకు సమాంతరంగా సాగేవి. ఆయన డైలాగ్ డిక్షన్, ఆయన హావ భావాలు. ఆయన నేచురల్ యక్షన్ ఇవన్నీ కట్టిపడేసేవి.

కొన్ని దశాబ్దాల పాటు వెండి తెర మీద శరచ్చంద్రికలు అలా కాంతులు పంచాయి. శరత్ బాబు ఒకనాటి తరం నటుడు అని ఎవరూ అనుకోలేదు. ఆయన ఎప్పటికపుడు అప్డేట్ అయి కొత్త వారితో నటించారు. పాత్ర బాగుంటే చాలు రెమ్యునరేషన్ గురించి పట్టించుకోని నటుడుగా పేరు తెచ్చుకున్నారు. ఆయన మరణంతో శ్రీకాకుళం జిల్లా విషాదంలో మునిగిపోయింది. ఆయన పీయూసీ దాకా ఆముదాలవలసలో చదివారు. బీఎస్సీని శ్రీకాకుళం ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో చదివారు. 

శ్రీకాకుళం నుంచి సినీ ఇండస్ట్రీకి వెళ్ళి హీరోగా రాణించిన వారిలో శరత్ బాబే మొదటి వారు. ఆ తరువాత ఇదే జిల్లా నుంచి జేవీ సోమయాజులు కూడా సినిమాల్లో నటించారు.