Advertisement

Advertisement

indiaclicks

Home > Politics - National

రేపట్నుంచే నోట్ల మార్పిడి.. లిమిట్ దాటితే నిఘా

రేపట్నుంచే నోట్ల మార్పిడి.. లిమిట్ దాటితే నిఘా

2వేల రూపాయల నోటు ఉపసంహరణ ప్రక్రియ రేపట్నుంచి షురూ కానుంది. ఎవరైనా, ఏ బ్యాంకుకైనా వెళ్లి, తమ దగ్గరున్న 2వేల రూపాయల నోట్లను మార్చుకోవచ్చు. సెప్టెంబర్ 30 వరకు ఈ ప్రక్రియకు గడువు విధించింది ఆర్బీఐ. దీని కోసం ఎవ్వరూ ఎలాంటి గుర్తింపు చూపించాల్సిన అవసరం లేదు. ఫారం నింపాల్సిన పనిలేదు, ఆధార్ లేదా పాన్ కార్డ్ నంబర్ చెప్పాల్సిన అవసరం లేదు.

మరి ఈ ప్రాసెస్ లో బ్లాక్ మనీని వైట్ గా మార్చుకునే వీలుంటుంది కదా? తమ దగ్గర బీరువాల్లో దాచుకున్న లక్షల రూపాయల 2వేల నోట్లను ఎంచక్కా బ్యాంకుకు వెళ్లి మార్చుకోవచ్చు కదా? సరిగ్గా ఇక్కడే ఆర్బీఐ కీలక ప్రకటన చేసింది.

20వేల రూపాయల వరకు 2వేల రూపాయల నోట్లను మార్పిడి చేసుకునేందుకు ఎవ్వరికీ ఎలాంటి రూల్స్ లేవు. 50వేల కంటే ఎక్కువ మొత్తాన్ని మార్పిడి చేసుకోవాలన్నా, బ్యాంక్ లో డిపాజిట్ గా వేయాలన్నా పాన్ కార్డ్ తప్పనిసరి. ఈ విషయంలో ఇప్పటికే అమల్లో ఉన్న సొంత బ్రాంచీ, వేరే బ్రాంచ్ రూల్స్ అన్నీ వర్తిస్తాయి. 50వేలు దాటిన ప్రతి డిపాజిట్ లేదా మార్పిడి.. వెంటనే ఆదాయపు పన్ను శాఖకు తెలిసిపోతుంది.

బ్యాంకులో తగినంత చిల్లర ఉందా?

2వేల రూపాయల నోటు మార్చుకునేందుకు చాలామంది బ్యాంకుల ముందు క్యూ కడతారు. మరి వాళ్లందరికీ డబ్బు చెల్లించేందుకు 500, 200, 100 రూపాయల నోట్ల లభ్యత ఉందా? దీనిపై కూడా ఆర్బీఐ ప్రకటన ఇచ్చింది. ప్రతి బ్యాంక్ లో చిల్లర నిల్వ ఉందని, 2వేల రూపాయల నోట్లు ఎన్ని వచ్చినా, అన్నింటికీ సరిపడా 500, 200 రూపాయల నోట్లు ఇస్తారని తెలిపింది. ఒకవేళ మార్పిడి ఇష్టం లేని వాళ్లు, నేరుగా తమ ఎకౌంట్లలో డబ్బును జమ చేసుకోవచ్చని కూడా సూచిస్తోంది.

బంగారం షాపుల పరిస్థితేంటి..

మరోవైపు బంగారం షాపుల్లో రద్దీ అనూహ్యంగా పెరిగింది. తమ వద్ద బ్లాక్ మనీ రూపంలో ఉన్న 2వేల రూపాయల నోట్లను వదిలించుకునేందుకు చాలామంది బంగారం షాపుల ముందు క్యూ కడుతున్నారు. గడిచిన 2-3 రోజులుగా బంగారం షాపుల్లో రద్దీ విపరీతంగా పెరిగింది. వీటిపై కూడా దృష్టి సారించింది ఐటీ శాఖ. 

ప్రస్తుతం అమల్లో ఉన్న నిబంధనలను పాటిస్తూ, పరిమితి దాటి బంగారం కొనుగోలు చేసే వినియోగదారుల సమాచారాన్ని అన్ని షాపులు తీసుకోవాల్సి ఉంది. అయితే 2వేల నోట్ల మార్పిడి అంశం తెరపైకి వచ్చిన తర్వాత ఎన్ని బంగారు షాపులు ఇలా సమాచారాన్ని తీసుకుంటున్నాయనేది ప్రశ్నార్థకంగా మారింది. అటు రిటైల్ రంగంల వ్యాపారులు చాలామంది 2వేల రూపాయల నోట్లను తిరస్కరిస్తున్న విషయం కూడా తమ దృష్టికి వచ్చినట్టు ఆర్బీఐ తెలిపింది.

వెయ్యి నోటు వస్తుందా?

2వేల నోటును ఉపసంహరించుకుంటున్నారు సరే.. మరి ఆ ఉపసంహరణ ప్రక్రియ పూర్తయిన తర్వాత పరిస్థితేంటి? 500 రూపాయలే పెద్ద నోటుగా కొనసాగుతుందా లేక మళ్లీ వెయ్యి రూపాయల నోటును మార్కెట్లోకి తీసుకొస్తారా? 1000 రూపాయల నోటును తిరిగి మార్కెట్లోకి తీసుకురాబోతున్నారంటూ జరుగుతున్న ప్రచారంలో నిజం లేదు. 2వేల నోటు ఉపసంహరణ తర్వాత 500 రూపాయల నోటు మాత్రమే అతిపెద్ద నోటుగా అవతరించనుంది. 

దేశంలో డిజిటల్ చెల్లింపులు గణనీయంగా పెరిగిన నేపథ్యంలో.. పెద్ద నోట్లను మరోసారి చలామణిలోకి తీసుకురావాల్సిన అవసరం లేదని ఆర్బీఐ భావిస్తోంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?