ఎంపీ టికెట్ ఇవ్వ‌క‌పోతే…కేశినేని కీల‌క కామెంట్స్‌!

విజ‌య‌వాడ ఎంపీ కేశినేని నాని వ్య‌వ‌హార శైలి భిన్నంగా వుంటుంది. త‌మ అధినేత చంద్ర‌బాబునాయుడిని సైతం ఒక్కోసారి ఆయ‌న లెక్క‌చేయ‌రు. త‌న‌కు న‌చ్చితే బ‌ద్ధ శ‌త్రువుల్లా ఉండే వైసీపీ ప్ర‌జాప్ర‌తినిధుల్ని సైతం అభినందించ‌కుండా ఉండ‌లేరు.…

విజ‌య‌వాడ ఎంపీ కేశినేని నాని వ్య‌వ‌హార శైలి భిన్నంగా వుంటుంది. త‌మ అధినేత చంద్ర‌బాబునాయుడిని సైతం ఒక్కోసారి ఆయ‌న లెక్క‌చేయ‌రు. త‌న‌కు న‌చ్చితే బ‌ద్ధ శ‌త్రువుల్లా ఉండే వైసీపీ ప్ర‌జాప్ర‌తినిధుల్ని సైతం అభినందించ‌కుండా ఉండ‌లేరు. వైసీపీ ఎమ్మెల్యే మొండితోక జ‌గన్మోహ‌న్‌రావుపై ఎంపీ కేశినేని, ఎంపీపై మొండితోక ప‌ర‌స్ప‌రం ప్ర‌శంస‌లు కురిపించుకోవ‌డం స‌ర్వ‌త్రా చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

ఇవాళ మ‌రోసారి కేశినేని నాని సీరియ‌స్ కామెంట్స్ చేశారు. టీడీపీ అధిష్టానం త‌న అభిప్రాయాన్ని కాద‌ని, త‌న త‌మ్ముడైన కేశినేని చిన్నిని ప్రోత్స‌హించ‌డ‌పై ఎంపీ ఆగ్ర‌హంగా ఉన్నారు. రానున్న ఎన్నిక‌ల్లో విజ‌య‌వాడ ఎంపీ సీటు కేశినేని చిన్నికి ఇస్తార‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. 

ముక్కుసూటిగా మాట్లాడే కేశినేనితో కృష్ణా జిల్లా టీడీపీ ముఖ్య నాయ‌కుల‌తో రాజ‌కీయంగా ప‌డ‌దు. మాజీ మంత్రి దేవినేని ఉమా, బొండా ఉమా, బుద్ధా వెంక‌న్న త‌దిత‌రుల‌తో కేశినేని నానికి చాలా కాలంగా విభేదాలున్నాయి. అందుకే ఆయ‌న ఎంపీ టికెట్ ఇస్తే ఇస్తారు, లేదంటే లేద‌నే లెక్క‌లేని త‌నంతో వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

ఈ నేప‌థ్యంలో టీడీపీ త‌మ‌కు వ్య‌తిరేకంగా భావించే జూనియ‌ర్ ఎన్టీఆర్ పుట్టిన రోజును పుర‌స్క‌రించుకుని ఆయ‌న అభిమానులు సీఎన్‌జీ ఆటోను పేద కార్మికుడికి ఎంపీ చేతుల మీదుగా అంద‌జేయడం గ‌మ‌నార్హం. ఈ సంద‌ర్భంగా నాని మీడియాతో మాట్లాడుతూ ఎంపీ టికెట్ ఇవ్వ‌క‌పోతే కేశినేని భ‌వ‌న్‌లో కూర్చొని బెజ‌వాడ ప్ర‌జ‌ల‌కు సేవ చేస్తాన‌ని ప్ర‌క‌టించారు.

తాను, తన కుటుంబం జీవితాంతం రాజ‌కీయాల్లో వుండాల‌ని భావించే వ్య‌క్తిని కాద‌ని స్ప‌ష్టం చేశారు. మంచి పనులు ఎవరు చేస్తే వాళ్ళని అభినందిస్తానన్నారు. త‌న‌కు వైసీపీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ నాలుగేళ్లుగా తెలుసన్నారు. అన్న‌ద‌మ్ములిద్ద‌రూ  మంచి ప‌నులు చేస్తుండ‌డం వ‌ల్లే ప్ర‌శంసించాన‌న్నారు. 

తాను ప్రాతినిథ్యం వ‌హిస్తున్న బెజవాడ పార్లమెంట్‌కు ఎవరు మంచి చేస్తే వాళ్ళతో కలుస్తానన్నారు. ఈ సంద‌ర్భంగా గ‌తంలో తెలంగాణ సీఎం కేసీఆర్ తెలంగాణ కోసం గొంగళి పురుగును ముద్దాడుతానన్న మాట‌ల‌ను ఆయ‌న గుర్తు చేశారు. తాను కూడా బెజవాడ పార్లమెంట్ అభివృద్ధి కోసం ముళ్ళ పందితో అయినా కలుస్తానని స్ప‌ష్టం చేశారు.