మగవాళ్ళు కొట్టుకుంటున్నారు ….ఆడవాళ్ళకు న్యాయం చేద్దాం

తెలంగాణా కాంగ్రెస్ పార్టీలో మగవాళ్ళు అంటే నాయకులు కొట్టుకుంటున్నారు. కాబట్టి ఈలోగా ఆడవాళ్లకు అంటే నాయకురాళ్లు న్యాయం చేయాలని పార్టీ అధిష్టానం ఆలోచిస్తోందని సమాచారం. కొత్త పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డిని అధిష్టానం నిర్ణయించిందని…

తెలంగాణా కాంగ్రెస్ పార్టీలో మగవాళ్ళు అంటే నాయకులు కొట్టుకుంటున్నారు. కాబట్టి ఈలోగా ఆడవాళ్లకు అంటే నాయకురాళ్లు న్యాయం చేయాలని పార్టీ అధిష్టానం ఆలోచిస్తోందని సమాచారం. కొత్త పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డిని అధిష్టానం నిర్ణయించిందని వార్తలు రాగానే వి. హనుమంత రావు అలియాస్ వీహెచ్ మండిపడుతున్నాడు. 

రేవంత్ రెడ్డి కనుక పీసీసీ చీఫ్ అయితే మాత్రం తాను పార్టీ నుంచి వెళ్లిపోతానని భయంకరమైన నిర్ణయం ప్రకటించాడు. టీడీపీని ముంచి వచ్చినోడికి టీపీసీసీ పదవి ఇవ్వడం ఏందిరా భాయ్ అంటున్నాడు. మొన్నటివరకు ఉత్తమ్ కుమార్ రెడ్డి పీసీసీ చీఫ్ గా ఉన్నాడు. 

ఆయన తరువాత రేవంత్ రెడ్డి అంటున్నారు. ఇదేదో రెడ్డి రాజుల పాలనలాగా ఉందని హనుమంత రావు అభిప్రాయం. టీపీసీసీ బీసీలకు ఎందుకివ్వరు అని మండిపడుతూ ప్రశ్నిస్తున్నాడు. బీసీలకు పదవి ఇవ్వని పార్టీలో ఉండనంటున్నాడు. 

రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా గళం విప్పిన వీహెచ్… ఏకంగా కాంగ్రెస్ హైకమాండ్‌కే ఎదురు తిరగడం చర్చనీయాంశమైంది. వీహెచ్ కారణంగా మరింత మంది భిన్న స్వరాలు వినిపిస్తున్నారని భావించిన హైకమాండ్ ఆయనపై క్రమశిక్షణా చర్యలు తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది.

ఆయన ఎక్కడెక్కడ ఏం మాట్లాడారో, వీడియోలతో సహా కావాలని పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్యం ఠాగూర్‌ కోరినట్లు తెలిసింది. దీనిపై ఓ రిపోర్టును హైకమాండ్‌కి ఇస్తారని సమాచారం. 

అసలు రేవంత్ రెడ్డి టీడీపీ నుంచి కాంగ్రెస్ లోకి వచ్చినప్పటి నుంచి ఆయనకు వ్యతిరేకత ఉంది. ఆయన కాంగ్రెసులోకి రావడంతోనే దూకుడుగా వ్యవహరిస్తూ అందరినీ డామినేట్ చేయడం ప్రారంభించాడు. టీఆర్ఎస్ మీద, కేసీఆర్ మీద విరుచుకుపడ్డాడు. ఆయన దూకుడును సీనియర్స్ తట్టుకోలేకపోయారు. 

కాంగ్రెస్ ను బలోపేతం చేయడానికి రకరకాల ప్లాన్స్ ఆలోచించాడు. ఆ ప్రతిపాదనలు సీనియర్ల ముందు పెట్టాడు. రేవంత్ ధోరణి సీనియర్లకు మింగుడు పడలేదు. దీంతో రేవంత్ చాలాకాలం గాంధీ భవన్ కు కూడా వెళ్ళలేదు. ఇప్పుడు ఆయనకు పీసీసీ పీఠం కట్టబెడుతుండటంతో అసంతృప్తి రగిలిపోతోంది. 

తెలంగాణలో టీడీపీని మట్టి కరిపించిన రేవంత్‌కి  పదవి ఎలా ఇస్తారని వీహెచ్  ప్రశ్నించారు. రేవంత్‌కి ఇస్తే… తాను పార్టీ వీడుతాననే సంకేతాలిచ్చారు. మిగతా సీనియర్లు కూడా తలో మాటా మాట్లాడుతుంటే… అటు వారిని కంట్రోల్ చేస్తూ… ఇటు కీలక పదవిలో ఎవర్ని కూర్చో పెట్టాలనే అంశం హైకమాండ్‌కి కత్తిమీద సాములా తయారైంది. 

ఈ పరిస్థితుల్లో మహిళకు ఈ పదవి ఇస్తే ఎలా ఉంటుందనే అంశం తెరపైకి వచ్చింది. అందువల్ల ఈసారి పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా మహిళకు అవకాశం ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం మాజీ మంత్రి కొండా సురేఖ పేరును పరిశీలిస్తున్నట్టు సమాచారం.

ఎమ్మెల్యే, ఆదివాసీ నేత సీతక్కకు రాష్ట్ర మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలిగా బాధ్యతలు అప్పగించాలని హైకమాండ్ భావిస్తున్నట్లు కూడా తెలిసింది. త్వరలో కీలక కమిటీల్లో ఆమె కూడా ఉండబోతున్నారని తెలుస్తోంది. గిరిజన సామాజిక వర్గానికి చెందిన సీతక్క రెండోసారి ఎమ్మెల్యేగా ఉన్నారు. 

ప్రస్తుతం మహిళా కాంగ్రెస్‌ జాతీయ ప్రధాన కార్యదర్శిగా చేస్తున్నారు. పేద ప్రజల్లో ఆమెకు మంచి గుర్తింపు, పేరు ఉన్నాయి. కరోనా లాక్ డౌన్ కాలంలో సీతక్క మారుమూల గిరిజన ప్రాంతాల్లో చేసిన సేవలకు ప్రశంసలు దక్కాయి.   మహిళల సమస్యలపై ఆమె బాగా ఫోకస్ చేస్తారని హైకమాండ్ లెక్కలు వేస్తున్నట్లు తెలిసింది.

సోహైల్ సినిమాలో అరియానా హిరోయినా  ?