అవినాష్ చివ‌రి ప్ర‌య‌త్నాలు!

వివేకా హ‌త్య కేసులో సీబీఐ అరెస్టు నుంచి బ‌య‌ట‌ప‌డేందుకు క‌డ‌ప ఎంపీ అవినాష్‌రెడ్డి చివ‌రి ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. అవి ఫ‌లించే దాన్ని బ‌ట్టి అవినాష్‌రెడ్డికి జైలా? బ‌య‌టా? అనేది తేలుతుంది. క‌ర్నూలు విశ్వ‌భార‌తి ఆస్ప‌త్రిలో…

వివేకా హ‌త్య కేసులో సీబీఐ అరెస్టు నుంచి బ‌య‌ట‌ప‌డేందుకు క‌డ‌ప ఎంపీ అవినాష్‌రెడ్డి చివ‌రి ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. అవి ఫ‌లించే దాన్ని బ‌ట్టి అవినాష్‌రెడ్డికి జైలా? బ‌య‌టా? అనేది తేలుతుంది. క‌ర్నూలు విశ్వ‌భార‌తి ఆస్ప‌త్రిలో త‌న త‌ల్లి శ్రీ‌ల‌క్ష్మి తీవ్ర అనారోగ్యంతో బాధ‌ప‌డుతోంద‌ని, ఆమెను చూసుకోవాల్సిన బాధ్య‌త త‌న‌పై వుంద‌ని, కొన్ని రోజులు స‌మ‌యం ఇవ్వాల‌ని ఆయ‌న కోరుకుంటున్నారు.

ఈ నేప‌థ్యంలో ముంద‌స్తు బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆయ‌న ఆశ్ర‌యించ‌డంతో పాటు సీబీఐ ఏఎస్పీకి లేఖ రాయ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ప్ర‌స్తుతం సీబీఐ అధికారులు క‌ర్నూలులో తిష్ట వేశారు. విశ్వ‌భార‌తి ఆస్ప‌త్రికి వెళ్లిన‌ట్టు తెలుస్తోంది. ఈ నేప‌థ్యంలో అవినాష్‌రెడ్డి అరెస్ట్‌పై ఉత్కంఠ రేపుతోంది.

ఇదే సంద‌ర్భంలో ఆయ‌న సీబీఐ ఏఎస్పీకి లేఖ రాయ‌డం ప్రాధాన్యం సంత‌రించుకుంది. త‌న త‌ల్లి అనారోగ్యంతో ఆస్ప‌త్రిలో ఉన్నార‌ని, ఆమెకు త‌న అవ‌స‌రం వుంద‌ని లేఖ‌లో పేర్కొన్నారు. విచార‌ణ‌కు హాజ‌ర‌య్యేందుకు ఏడు రోజుల గ‌డువు కావాల‌ని సీబీఐని కోరారు. ఇప్ప‌టికే త‌న‌ తండ్రి జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్నార‌ని గుర్తు చేశారు. ఈ పరిస్థితుల్లో తల్లిని వదిలి విచారణకు రాలేన‌ని స్ప‌ష్టం చేశారు. అవినాష్‌రెడ్డి విన‌తిపై సీబీఐ నిర్ణ‌యం ఏంట‌నేది తెలియాల్సి వుంది.

మ‌రోవైపు సుప్రీంకోర్టులో బెయిల్ కోసం పిటిష‌న్ వేశారు. న్యాయ‌మూర్తులు జెకె మ‌హేశ్వరి, పీఎస్ న‌ర‌సింహ‌లతో కూడిన వెకేష‌న్ బెంచ్ ముందు మెన్షన్ చేయనున్నారు. గ‌తంలో హైకోర్టు వేకేష‌న్ బెంచ్‌ను త‌న బెయిల్ పిటిష‌న్ విచారించేలా ఆదేశించాల‌ని సుప్రీంలో పిటిష‌న్ దాఖ‌లు చేశారు. అయితే ఆ పిటిష‌న్ విచార‌ణ తేదీని ఇంకా ఖ‌రారు చేయ‌లేదు.

జూన్ రెండోవారంలో విచార‌ణ‌కు అనుమ‌తిస్తామ‌ని  సీజేఐ డీవై చంద్రచూడ్ ధ‌ర్మాస‌నం తెలిపింది. తాజాగా అరెస్ట్ చేసే ప‌రిస్థితి ఉండ‌డంతో అవినాష్‌రెడ్డి త‌న‌వంతు ప్ర‌య‌త్నాల్ని తీవ్ర‌త‌రం చేశారు. అవినాష్‌రెడ్డిని సీబీఐ విచారించ‌డం, అరెస్ట్ చేస్తార‌నే ప్ర‌చారానికి ఎండ్ కార్డ్ ఎప్పుడు ప‌డుతుందో మ‌రి!