
తెల్లారి లేవగానే చేదు వార్త. కేతు సార్ ఇకలేరు. రాయలసీమ కష్టాలు, జీవితం, సంఘర్షణలని అక్షర దృశ్యాలుగా చూపిన వ్యక్తి. అందరికీ ఆప్తుడు, చిరునవ్వు చెరగని మనిషి ఇక ఎప్పటికీ కనపడరు.
40 ఏళ్ల క్రితం ఏదో పనిమీద అనంతపురం వచ్చారు. సప్తగిరి హోటల్‌లో రచయితలంతా కలిశాం. సింగమనేని నారాయణ గారు నన్ను పరిచయం చేశారు. నా వయసు 19 ఏళ్లు. కథలు రాస్తానని తెలిసి కేతు చాలా ముచ్చట పడ్డారు. కొత్త రచయితలు ఇంకా రావాలి, సీమ గురించి లోతుగా రాయాలని అని అన్నారు. ఆయనకి వయసు లేదు. పెద్దల్లో పెద్ద, పిల్లల్లో పిల్లవాడు.
ఆయన రచనలన్నీ సహజంగా వుంటాయి. ఎక్కువ నాటకీయత వుండదు. జీవితం చూపించే మలుపులు, చమత్కారాలు, కన్నీళ్లు వుంటాయి. రాతలాగే మనిషి కూడా చాలా సరళం.
హైదరాబాద్ వెంగళరావునగర్‌లో ఆయన వున్నప్పుడు, నేను కొంత కాలం కళ్యాణ్‌నగర్‌లో ఉన్నాను. రోజూ వాకింగ్‌లో ఎదురయ్యేవాళ్లు. నాకంటే చురుగ్గా, వేగంగా నడిచేవాళ్లు. మీరు చాలా యంగ్ సార్ అంటే "పద్దన్నే ఈ పని చేస్తేనే , మిగతా అన్ని పనులకి ఎనర్జీ" అనేవారు.
ఒకసారి కాళీపట్నం రామారావు గారు ఆంధ్రజ్యోతి ఆఫీస్‌కు వచ్చారు. ఆయన్ని స్కూటర్‌లో కేతు సార్ ఇంటికి తీసుకెళ్లాను. విపరీతంగా సంతోషించారు. ఇంటికి ఎవరైనా వస్తే భలే ఆనందం ఆయనది. హడావుడిగా కాఫీ పెట్టడానికి ప్రయత్నిస్తే నేను చేస్తానన్నాను.
"ఎవరి ఒంటిల్లు వాళ్లకే అర్థమవుతుంది. నువ్వు అన్నీ వెతికేలోగా నేను కాఫీ చేసేస్తా" అన్నారు. సెన్సాఫ్ హ్యూమర్ తొణికసలాడే మనిషి.
సీసీరెడ్డి గారు వంశీతో సినిమా తీయాలనుకుంటే కొద్ది రోజులు నేను చర్చలకి వెళ్లాను. ఈ- భూమి ఆఫీస్‌లో కేతు సార్, పొనుగోటి, రొద్దం శ్రీనివాస్, స్వర్ణా మేడమ్, బాబ్జీలతో కలిసి కబుర్లు మరిచిపోలేని జ్ఞాపకాలు.
తిరుపతిలో మా ఇంటికి వచ్చారు. సగం రోజు సాహిత్య చర్చలు. లాజిక్‌గా విషయం చెబుతారు తప్ప, ఆవేశంగా మాట్లాడే అలవాటు లేదు. ఎల్వీకేతో కలిసి జూమ్ మీటింగ్‌లో మాట్లాడ్డమే ఆఖరు.
రెండు రోజుల క్రితం తవ్వా ఓబుల్‌రెడ్డి ఫేస్‌బుక్‌లో ఫొటో పెడితే చూసి సంతోషించాను. ఇంతలో ఇది వినాల్సి వచ్చింది.
మనుషులు పోతారు, జ్ఞాపకాలుంటాయి.
జీఆర్ మహర్షి
నేను మొక్కలతో, దేముడితో మాట్లాడుతా