Advertisement

Advertisement


Home > Politics - Opinion

గేమ్ స్టార్ట్స్ నౌ!

గేమ్ స్టార్ట్స్ నౌ!

ఒక చిన్న పరిణామం.. అనేక పెద్దపెద్ద పర్యవసానాలకు కారణం కావడం అనేది కొత్త విషయం కాదు. చరిత్రలోనూ పురాణాల్లో సైతం అలాంటి ఉదాహరణలకు మనకు అనేకం కనిపిస్తాయి. కర్ణాటక ఎన్నికల ఫలితం కూడా అలాంటిదే. కావడానికి ఇది కేవలం ఒక రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల ఫలితం మాత్రమే కావొచ్చు. కానీ.. దేశవ్యాప్తంగా రాజకీయ శక్తుల పునరేకీకరణకు ఇది బీజం అవుతున్నది. 

అప్రతిహతంగా 3.0 ప్రభుత్వంలో కొలువుతీరగలమనే కమలదళపతుల కలలకు గండిపడింది. మోడీ ప్రభంజనానికి విరుగుడుగా కాంగ్రెస్ నాయకత్వాన్ని ప్రజలు ఏకపక్షంగా విశ్వసిస్తున్నారా? అనే తరహా చిన్న చిన్న విపక్షపార్టీల అనుమానాలకు తెరపడింది. వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి.. అసలు ఆట ఇప్పుడే మొదలవుతున్నది. మారుతున్న పరిణామాల అవలోకనమే ఈ వారం గ్రేట్ ఆంధ్ర స్టోరీ ‘గేమ్ స్టార్ట్స్ నౌ!’

సాధారణంగా ఏవైనా ఎన్నికలు జరుగుతున్నప్పుడు ఈ ఎన్నికలు రాబోయే సార్వత్రిక ఎన్నికలకు సెమీఫైనల్స్ వంటివి అని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పాలనకు రెఫరెండం లాంటివి అని.. రకరకాల మాటలతో హైప్ క్రియేట్ అవుతూ ఉంటుంది. ఎన్నికలు ముగిసిన తర్వాత.. అవి సెమీఫైనల్స్ కాదు, రెఫరెండం కాదు అనే సత్యం బోధపడుతుంది. అవేమీ గేమ్ చేంజింగ్ ఎన్నికలు కావు అనే సంగతి కూడా అర్థమవుతుంది. 

అలాంటి హైప్ ఏ మాత్రమూ లేకుండా.. జరిగినవి కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు. ఇందుకు అనేక కారణాలున్నాయి. రాష్ట్రంలోను, కేంద్రంలోను బిజెపినే అధికారంలో ఉండడం ఒక కారణం. అలాగే, కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు పెద్ద ఆశావహంగా కనిపించకపోవడం కూడా మరో కారణం. అలాగని కర్ణాటక ఎన్నికల్లో వచ్చినవి అనూహ్యమైన ఫలితాలు ఎంతమాత్రమూ కాదు. 

కాంగ్రెస్‌కు గెలుపు అవకాశాలున్నాయని తొలినుంచి అంతా అనుకుంటూనే ఉన్నారు. ఆ ప్రతికూల పరిస్థితుల్ని అధిగమించి మ్యాజిక్ చేయాలని భారతీయ జనతా పార్టీ తలపోసింది. తమ సకల శక్తులు, చాణక్య యుక్తులు అన్నింటినీ ఒడ్డి పోరాడారు. ఫలితం వారికి చాలా నిరాశాజనకంగా వచ్చింది. బొటాబొటీ మెజారిటీతో అయినా సరే కాంగ్రెస్ గట్టున పడుతుందని అందరూ అంచనాలు వేస్తే, ఎగ్జిట్ పోల్స్ కూడా లెక్క కడితే.. పార్టీ నాయకులు ఎన్నికల ముందు ఆత్మవిశ్వాసంతో కనిపించడానికి చేసే గాంభీర్యపు ప్రకటనల స్థాయిలో తిరుగులేని మెజారిటీతో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. 

లోపాయికారీ పనులకు పాల్పడడానికి, ఎరలు, వలలు వేయడానికి ఆస్కారం లేనంతటి గట్టి మెజారిటీ వారికి వచ్చింది. ఇరు పార్టీలు గట్టిగా తలపడినప్పుడు.. ఎవరు గెలిచినా పర్లేదు గానీ.. తన సాయం కోరే పరిస్థితి ఏర్పడితే తానే వారి నెత్తిన ఎక్కి కొలువు తీరవచ్చునని అనుకున్న కుమారస్వామి కోరికలు కూడా ఈడేరలేదు. సీఎం పగ్గాలు ఎవరి చేతిలో ఉండాలనే విషయంలో పంతాలకు పోవడం వల్ల చిన్న చిన్న బాలారిష్టాలను దాటి.. కాంగ్రెస్ సర్కారు కన్నడ నాట కొలువు తీరింది.

ఈ ఎన్నికలు కేవలం కన్నడ అసెంబ్లీ ఎన్నికలుగా మిగిలిపోలేదు. అంతకుమించి దేశరాజకీయాల్లో తమ ముద్ర ప్రబలమైనదని ఇప్పుడు చాటుతున్నాయి. దేశంలో గేమ్ చేంజింగ్ ఎన్నికలుగా నిలుస్తున్నాయి. ఎలాగో చూద్దాం.

మోడీ 3.0 స్వప్నాలకు రెడ్ సిగ్నల్!

తమ పార్టీని, తన ప్రభుత్వాన్ని ఆపగల శక్తి ఇప్పట్లో మరేదీ లేదు అని గాఢమన నమ్మకంతో ఉన్నారు నరేంద్రమోడీ. మోడీ 3.0 ప్రభుత్వం అత్యంత సునాయాసంగా నల్లేరుమీద బండి నడక లాగా ఏర్పడగలదనే విశ్వాసంతోనూ ఉన్నారు. దేశమంతా తనకు ఎప్పటికీ నీరాజనాలు పడుతూనే ఉంటుందని కూడా ఆయనకు బలీయమైన అభిప్రాయం ఉంది. ఇంతటి అపరిమితమైన ఆత్మవిశ్వాసం ఉన్నప్పటికీ కూడా, మోడీ అండ్ కో కర్ణాటక ఎన్నికలను తేలిగ్గా తీసుకోలేదు. 

తాము అన్ని రకాలుగానూ చిన్న చూపు చూస్తున్న దక్షిణ భారతదేశంలో.. తమ అస్తిత్వం ఉన్నదని చాటుకోవడానికి వారికి ఏకైక దిక్కు కర్నాటకనే. దేశాన్ని ఏలుతున్నంత మాత్రాన, బిజెపి కేవలం ఉత్తరాది పార్టీ మాత్రమే కాదు అని నిరూపించుకోవాలంటే.. వారికి కన్నడ విజయం అత్యవసరం అయింది. అందుకే తమ సకల శక్తులను  మోహరించారు.

నరేంద్రమోడీలోని విధానపరమైన దిగజారుడుతనం కూడా కర్నాటక ఎన్నికల్లో స్పష్టంగా కనిపించింది. ప్రజలకు సంక్షేమ పథకాల పేరిట ప్రకటించే ఉచితాలు, తాయిలాల గురించి నరేంద్రమోడీ ఎన్నిసార్లు వెటకారంగా మాట్లాడారో అందరికీ తెలుసు. ఉచిత పథకాలమీద ఆయనకు చాలా చిన్నచూపు ఉంది. 

సబ్సిడీలను నెమ్మదిగా తొలగిస్తూ రూ.300 ఉన్న గ్యాస్ సిలిండర్ ధరను రూ.1100 కు తీసుకువెళ్లిన ఘనమైన చరిత్రగల మోడీ.. నల్లధనం నిరోధించడంలో బ్యాంకులకు ఎగవేసిన వారినుంచి వసూళ్లు చేయించడంలో తన చేతగానితనాన్ని దాచుకోలేకపోయిన నరేంద్రమోడీ.. తాయిలాల మీద మాత్రం చాలా ఆదర్శాలు వల్లిస్తూ వచ్చారు. అందువల్ల ప్రభుత్వాలు అప్పుల్లో కూరుకుపోతున్నాయని, దేశానికి అరిష్టం అని నానా మాటలు అన్నారు. తీరా కర్ణాటక ఎన్నికలకు దాకా వచ్చేసరికి.. ఒక మెట్టు దిగజారి బిజెపి ఉచిత గ్యాస్ సిలిండర్ల హామీని కూడా ప్రకటించింది. మోడీ దిగజారారు గానీ.. ప్రజలు మాత్రం నమ్మలేదు. పార్టీని తిప్పి కొట్టారు.

బిజెపికి విజయాలను అందించే తురుంఖాన్ అని పేరున్న అమిత్ షా కన్నడ ఎన్నికల మీద స్పెషల్ ఫోకస్ పెట్టారు. అనేకానేక సభలు, రోడ్ షోలు నిర్వహించారు. ఎట్టి పరిస్థితుల్లో విజయం తమదే అన్నారు. మోడీ కూడా ఏ రాష్ట్రంమీద పెట్టనంత శ్రద్ధ ఇక్కడ పెట్టారు. బెంగుళూరులో ఆయన సాగించిన సుదీర్ఘమైన రోడ్ షో ఒక విఫల రికార్డు.

మాటల మాయాజాలం నరేంద్రమోడీకి వెన్నతో పెట్టిన విద్య. దాన్ని ఆయన మరోసారి సమర్థంగానే ప్రయోగించారు. అవినీతి, అసమర్థ ప్రభుత్వమని పేరు మోసిన బిజెపిని మళ్లీ గెలిపించమని కన్నడిగులను అడగడానికి వారికి మార్గాలు దొరకలేదు. రొటీన్ మాటలతో మాయ చేయడానికి ప్రయత్నిస్తున్న సమయంలోనే కాంగ్రెస్ వారికి అస్త్రాన్ని అందించింది. 

బజరంగదళ్ వంటి సంస్థల్ని నిషేధిస్తాం అనే మేనిఫెస్టో ప్రకటన రాగానే మోడీ దానిని అందిపుచ్చుకున్నారు. రాముడిని ట్రంప్ కార్డులాగా వాడుకుని ఎన్నికలను గెలవడం అలవాటు చేసుకున్న బిజెపికి ఈసారి హనుమంతుడు లడ్డూలాగా దొరికాడు. ఆ అంశానికి నరేంద్రమోడీ తన  హావభావ ప్రకటన విన్యాసాలన్నింటినీ జోడించి.. హనుమంతుడంటే మీకు ఎందుకంత ద్వేషం, హనుమంతుడు పుట్టిన చోటులోనే ఆయనను అవమానిస్తారా? అంటూ నాటకీయ డైలాగులను వల్లిస్తూ.. అక్కడికేదో బజరంగదళ్ అనేది హనుమంతుడు స్వయంగా స్థాపించిన సంస్థ అయినట్టుగా కలరింగ్ ఇచ్చారు. 

రెండు దఫాలు ప్రధాని అయి, తొమ్మిదేళ్లుగా అభ్యుదయాత్మకమైన పరిపాలన అందిస్తున్నాను అనే నమ్మకం తన మీద తనకు ఆయనలో ఉంటే గనుక.. ఇలా ఎన్నికల ప్రచారానికి మతాన్ని వాడుకునే దిగజారుడు మాటలు అనేవారు కాదు. ఎన్ని టక్కుటమార గజకర్ణ గోకర్ణ విద్యలు ప్రదర్శించినా కన్నడ ప్రజలు మోడీని నమ్మలేదు. ఆ పార్టీని దారుణంగా తిరస్కరించారు.

3.0 ప్రభుత్వ ఏర్పాటు కలల్లో ఉన్న ఆయనకు ఇది హెచ్చరిక. తమ ప్రభుత్వం ఉన్న రాష్ట్రంలోనే ఇంతగా వ్యతిరేకత వస్తే.. ఇతరత్రా ప్రాంతాల్లో మోడీకి నీరాజనాలు దక్కుతాయని ఆశించడం భ్రమ. అందుకే ఆయన అలర్ట్ కావాలి. 

కాంగ్రెస్ సారథ్య కూటమికి గ్రీన్ సిగ్నల్!

కన్నడ ఫలితాలతో దేశరాజకీయాలను ప్రభావితం చేసే మరో పరిణామం కూడా చోటు చేసుకుంది. వచ్చే ఏడాది పార్లమెంటుకు  జరిగే సార్వత్రిక ఎన్నికల్లో మోడీ సర్కారును కూల్చదలచుకుంటున్న కూటమిలో కాంగ్రెస్ భాగస్వామిగా ఉండడం వరకు విపక్షాలకు అభ్యంతరం లేదు. అయితే ఆ కూటమికి సారథ్యం ఎవరు వహించాలనే విషయంలో నిన్నటిదాకా భిన్నాభిప్రాయాలున్నాయి. 

నితీశ్ కుమార్, వామపక్ష నాయకులు కాంగ్రెస్ నాయకత్వాన్ని సమర్థిస్తున్నారు. దేశవ్యాప్తంగా బలం ఉన్న కాంగ్రెస్ సారథ్యంలో కూటమి ముందుకు వెళ్లడమే లాభదాయకం అనేది వారి మాట. డీఎంకే, ఎన్సీపీ, జేఎంఎం వంటి వారంతా వారికి అనుకూలంగానే ఉన్నారు. ఎటొచ్చీ మమతా బెనర్జీ, కేజ్రీవాల్ లాంటి వాళ్లు కాస్త తేడాగా మాట్లాడుతూ వచ్చారు. కేంద్రంలో ప్రతిపక్ష కూటమికి తామే నాయకత్వం వహించాలనే కోరిక వారితో అలా మాట్లాడించింది. ఇలాంటి వాతావరణంలోనూ కన్నడ ఫలితాలు మార్పు తెచ్చాయి. కాంగ్రెస్ సారథ్యానికి సానుకూలత పెరుగుతోంది.

మమతా బెనర్జీ కాస్త మెత్తబడ్డారు. కన్నడ ఫలితాల తర్వాత- కాంగ్రెస్ బలంగా ఉన్న ప్రతిచోటా ఆ పార్టీకి మిగిలిన అన్ని విపక్షాలూ మద్దతు ఇవ్వడం మంచిదని ఆమె ప్రకటించారు. కాంగ్రెస్ సారథ్యానికి కూడా పరోక్షంగా అంగీకరించడమే. ఇప్పుడు కేజ్రీవాల్ ఎదుట కూడా వేరే గత్యంతరం లేదు. రెండు రాష్ట్రాల్లో ఆప్ అధికారంలో ఉండవచ్చు గానీ.. అధికారంలోకి వచ్చి చరిత్ర సృష్టిస్తామని ప్రకటించి పోరాడిన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆయనకు ఎదురైన పరాభవం, గ్రాఫ్ ను  దిగజార్చింది. వారైనా సరే.. విపక్ష కూటమికి కాంగ్రెస్ సారథ్యాన్ని అంగీకరించాల్సిందే. 

నిజానికి కాంగ్రెస్ సారథ్యంలో అందరినీ జట్టులోకి తెచ్చి కూటమిని బలోపేతం చేయడానికి నితీశ్ కుమార్ కాలికి బలపం కట్టుకుని దేశమంతా తిరుగుతున్నారు. ఈ కన్నడ ఫలితాలు ఆయన పనిని కాస్త సులువు చేశాయి.

కన్నడ నాట విజయం అనేది రాహుల్ పాదయాత్ర సాధించిన ఫలితం అని అక్కడి కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. కాంగ్రెస్ వారికి అలవాటైన సోనియా కుటుంబ భజనలో భాగంగా ఈ మాటలను కొట్టి పారేయడానికి వీల్లేదు. రాహుల్ ఆసేతు హిమాచలం సాగించిన పాదయాత్ర ఖచ్చితంగా ఆయా ప్రాంతాల్లో ప్రజలను ఎంతో కొంత ప్రభావితం చేస్తుంది. 

రాహుల్.. తన కష్టం, తన తీరుతో ఖచ్చితంగా దేశంలో కొంత భాగాన్ని ఆకట్టుకున్నారు. కర్ణాటకలో సుడిగాలి ప్రచారం నిర్వహించిన ప్రియాంక గాంధీ కూడా తన ముద్ర ఏమిటో ఈ ఎన్నికలలో నిరూపించారు. కాంగ్రెస్ అప్రకటిత హైకమాండ్ గా ఈ అక్కాతమ్ముళ్లు చాలా సీరియస్ గానే వర్కవుట్ చేస్తున్నారనడానికి కన్నడ ఎన్నికలు ఒక ఉదాహరణ. 

సువిశాల భారతదేశంలో దక్షిణపు కొస నుంచి ఉత్తరపు చివర వరకు పాదయాత్ర సాగించిన రాహుల్, పడమర అంచనుంచి తూర్పు నకు రెండో విడత పాదయాత్ర సాగించాలనుకుంటుండగా.. ఈ కన్నడ ఫలితం ఆయన ప్రయత్నానికి కొండంత ఆత్మబలాన్ని కూడా జత చేస్తుంది.

పార్లమెంటు ఎన్నికలలో విజయం సాధిస్తారా లేదా అనేది తర్వాతి సంగతి.. కానీ మోడీ వ్యతిరేక కూటమి ఐక్యత లేకుండా కొట్టుమిట్టాడే పరిస్థితి, తమలో తాము ఆధిపత్యం కోసం కుమ్ములాడుకునే పరిస్థితి ఇక లేదు. కన్నడ ఫలితాలు ఈ కూటమి విషయంలో స్పష్టత ఇచ్చాయి.

తెలుగు రాష్ట్రాల పరిస్థితి వేరు..

ఈ రకంగా దేశంలోనే గేమ్ చేంజింగ్ ఎన్నికలుగా కన్నడ అసెంబ్లీ ఫలితాలు వచ్చినప్పటికీ.. తెలుగు రాష్ట్రాలపై వీటి ప్రభావం చాలా తక్కువ. ఏపీలో కాంగ్రెస్ ఆల్రెడీ శవాసనం వేసి ఉంది. అది లేచి నిల్చోవడం ఇప్పట్లో సాధ్యం కాదు. 

చంద్రబాబునాయుడు జాతీయ రాజకీయాల్ని ప్రభావితం చేయగల చరిష్మాను ఎన్నడో కోల్పోయారు. పైగా మోడీ వ్యతిరేకతతో పల్లెత్తు మాట్లాడడానికి ధైర్యం లేని స్థితిలో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి విషయానికి వస్తే ఆయనకు జాతీయ రాజకీయాల ఊసు పట్టనే పట్టదు. ఏపీ రాజకీయాల వరకు, సొంత రాష్ట్రం వరకు తప్ప.. అన్యథా ఆయన దృష్టి సారించరు. రాష్ట్రం కోసం కేంద్రంతో సత్సంబంధాలు కోరుకునే నాయకుడిగా ఉన్నారు. 

ఇక తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ఈ విజయం కాస్త జోష్ ఇస్తుందనడంలో సందేహం లేదు. ముఠాతగాదాలు తె-కాంగ్రెస్ కు పెద్దశాపం అయినప్పటికీ.. వారు ఉత్సాహంగా బరిలో ఉంటారని అనుకోవచ్చు. కాకపోతే కేసీఆర్ కు ఇవి మింగుడుపడని ఫలితాలు! కుమారస్వామి తన జట్టులోని పార్టీగా ప్రకటించుకుని.. అంతలోనే చేజార్చుకున్న నాయకుడు కేసీఆర్. బేరాలు తెగలేదనేది రాజకీయ వర్గాల్లో చర్చ. 

ఎర్రకోట మీద గులాబీ జెండా ఎగరేస్తానని అంటున్న ఆయన సొంత రాష్ట్రంలో నెగ్గే అవసరాలకోసం కాంగ్రెస్ వ్యతిరేకతను నటించాలి. కనీసం ఇక్కడ అసెంబ్లీ ఎన్నికల తర్వాత అయినా కేంద్రలో కాంగ్రెస్ సారథ్య విపక్ష కూటమికి మద్దతు తెలియజేయాలి. కానీ.. అంత అవసరం కూడా ఉండదనే చర్చ ఎక్కువగా వినిపిస్తోంది. 

అసలే దేశమంతా తన పార్టీని విస్తరిస్తానని అంటున్న కేసీఆర్, బిజెపితో లాలూచీ పడి మోడీ స్కెచ్ మేరకే భారాసను బరిలోకి దింపుతున్నారనే అనుమానాలు పలువురిలో ఉన్నాయి. కాంగ్రెస్ సారథ్య కూటమిలో చేరకుండా.. దేశంలో పలు ప్రాంతాల్లో పోటీకి భారాస సిద్ధమైతే ఈ ప్రచారాల్ని నమ్మి తీరాల్సిందే. 

ఈ పరిణామాలన్నీ ఎలా ఉన్నప్పటికీ.. కన్నడ ఎన్నికలు దేశంలోని పార్లమెంటు ఎన్నికల దిశగా గేమ్ చేంజిగ్ ఎన్నికలుగా నిలిచాయి. అసలైన ఆట ఇప్పుడే మొదలవుతోంది. దేశవ్యాప్తంగా అనేక రసవత్తర పరిణామాలు చోటుచేసుకోబోతున్నాయి. 

.. ఎల్.విజయలక్ష్మి

వలయంలో జగన్

నేను మొక్కలతో, దేముడితో మాట్లాడుతా