ఎన్టీఆర్ యుగ‌పురుషుడైతే …మ‌రి బాబు?

ఎన్నిక‌ల‌కు గ‌డువు స‌మీపిస్తున్న నేప‌థ్యంలో దివంగ‌త ఎన్టీఆర్‌పై చంద్ర‌బాబుకు ప్రేమ పొంగుకొస్తోంది. ఎన్నిక‌లు లేకుంటే ఎన్టీఆర్ ఎవ‌రని చంద్ర‌బాబు ప్ర‌శ్నించినా ఆశ్చ‌ర్య‌పోన‌వ‌స‌రం లేదు. ప్ర‌స్తుతం ఎన్టీఆర్ శ‌త జ‌యంతి వేడుక‌ల‌ను టీడీపీ ఘ‌నంగా నిర్వ‌హిస్తోంది. …

ఎన్నిక‌ల‌కు గ‌డువు స‌మీపిస్తున్న నేప‌థ్యంలో దివంగ‌త ఎన్టీఆర్‌పై చంద్ర‌బాబుకు ప్రేమ పొంగుకొస్తోంది. ఎన్నిక‌లు లేకుంటే ఎన్టీఆర్ ఎవ‌రని చంద్ర‌బాబు ప్ర‌శ్నించినా ఆశ్చ‌ర్య‌పోన‌వ‌స‌రం లేదు. ప్ర‌స్తుతం ఎన్టీఆర్ శ‌త జ‌యంతి వేడుక‌ల‌ను టీడీపీ ఘ‌నంగా నిర్వ‌హిస్తోంది. 

ఎన్టీఆర్ అనే వాడే లేక‌పోతే తెలుగు స‌మాజానికి అస‌లు గుర్తింపే లేద‌ని, ప‌ట్టించుకునే దిక్కే లేద‌న్న రేంజ్‌లో చంద్ర‌బాబు నేతృత్వంలోని టీడీపీ చిత్రీక‌రిస్తోంది. ఈ ధోర‌ణి ఎన్టీఆర్‌పై త‌ట‌స్థుల్లో వ్య‌తిరేక‌త పెంచేలా ఉంది. ఎన్టీఆర్ లేక‌పోతే, ప్ర‌పంచ‌మే లేద‌న్న‌ట్టు, తెలుగు ప్ర‌జ‌లు మూడు పూట‌లా తినే అవ‌కాశం వుండేది కాద‌న్న‌ట్టుగా ప్ర‌చారం చేయ‌డం ఏంట‌న్న ప్ర‌శ్న ఉత్ప‌న్న‌మైంది.

ఈ మొత్తం ఎపిసోడ్‌ను బాగా ప‌రిశీలిస్తే, ఎన్టీఆర్ పేరు చెబితే త‌ప్ప టీడీపీకి ఓట్లు రాలవ‌నే ఆలోచ‌న చంద్ర‌బాబులో ఉన్న‌ట్టు క‌నిపిస్తోంది. త‌న‌ను చూసి జ‌నం టీడీపీని ఆద‌రిస్తార‌నే న‌మ్మ‌రం చంద్ర‌బాబులో కొర‌వ‌డింద‌న్న వాస్త‌వం ఎన్టీఆర్‌పై పొగ‌డ్త‌లే నిద‌ర్శ‌నం. ఇటీవ‌ల కాలంలో చంద్ర‌బాబు, టీడీపీ అనుకూల నేత‌ల ప్ర‌శంస‌లను గ‌మ‌నిస్తే… ప్ర‌పంచ వ్యాప్తంగా తెలుగు వారికి గుర్తింపు తెచ్చిన ఎన్టీఆర్ యుగ పురుషుడ‌ని, శ‌క పురుషుడ‌ని కీర్తిస్తున్నారు.

ఎన్టీఆర్ అంత గొప్ప నాయ‌కుడే అయితే, ఆయ‌న్ను వెన్నుపోటు పొడిచిన చంద్ర‌బాబును ఏ పురుషుడ‌ని పిల‌వాలి? అనే నిల‌దీత ఎదుర‌వుతోంది. ఎన్టీఆర్‌ను యుగ పురుషుడు, శ‌క పురుషుడ‌ని కీర్తిస్తున్న‌ది మ‌రెవ‌రో కాదు, ఆయ‌న్ను వెన్నుపోటు పొడిచిన చంద్ర‌బాబే కావ‌డం గ‌మ‌నార్హం. ఇదే చంద్ర‌బాబు గొప్ప‌త‌నం. ఎన్టీఆర్‌ను తిట్టిన తిట్లు, పొడిచిన వెన్నుపోట్ల గురించి ఈ త‌రానికి తెలియ‌వ‌ని, పొగ‌డ్త‌లు మాత్ర‌మే గుర్తుంటాయ‌ని ఆయ‌న న‌మ్ముతున్నారు.

రెండుసార్లు వెన్నుపోట్ల‌కు గురైన ఎన్టీఆర్ అమాయ‌క‌త్వాన్ని న‌క్క‌జిత్తుల నాయ‌కులు రాజ‌కీయంగా సొమ్ము చేసుకున్నార‌నే అభిప్రాయాలున్నాయి. ఎన్టీఆర్ నామ‌స్మ‌ర‌ణ త‌ప్ప‌, మ‌రోసారి గెలిచేందుకు ఇంకో మార్గం లేద‌ని చంద్ర‌బాబు ఎన్నెన్నో ఎత్తులు వేస్తున్నారు. అందుకే ఎన్టీఆర్‌పై కీర్త‌న‌లు శ్రుతిమించేలా చంద్ర‌బాబు మాట్లాడుతున్నారు. ఈ నెల 28న తెలుగు స‌మాజం అంతా ఇళ్ల‌లో ఎన్టీఆర్ చిత్ర‌ప‌టం ముందు దీపాలు వెలిగించి నివాళుల‌ర్పించాల‌ని చంద్ర‌బాబు పిలుపునిచ్చారంటే, ఆయ‌న పిచ్చి ఏ స్థాయికి చేరిందో అర్థం చేసుకోవ‌చ్చు.

తెలుగు జాతికి గుర్తింపు, గౌరవం కేవ‌లం ఎన్టీఆర్ వ‌ల్లే వ‌చ్చిందంటే… ఎంద‌రో త్యాగ‌ధనులు, మ‌హానుభావుల‌ను కించ‌ప‌రిచిన‌ట్టే అని గుర్తించుకోవాలి. తెలుగు స‌మాజానికి గుర్తింపు తేవ‌డంలో ఎన్టీఆర్‌కు కేవ‌లం ఒక  పేజీ మాత్రం ఉంది. చంద్ర‌బాబు త‌న రాజ‌కీయ స్వార్థం కోసం మ‌హ‌నీయుల త్యాగాల‌ను, గొప్ప‌తనాన్ని మ‌రుగున ప‌ర‌చాలని ప్ర‌య‌త్నిస్తే, తానే చ‌రిత్ర హీనుడిగా మార‌తాన‌ని గుర్తిస్తే మంచిది.