ఆ మాటెత్తద్దు బాబూ.. కడుపు రగిలిపోతంది!

చంద్రబాబునాయుడు తాను 44 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న మహానుభావుడిని అని తన భుజం తానే చరుచుకుంటూ ఉంటారు. Advertisement స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఏ ఒక్క నాయకుడికీ…

చంద్రబాబునాయుడు తాను 44 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న మహానుభావుడిని అని తన భుజం తానే చరుచుకుంటూ ఉంటారు.

స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఏ ఒక్క నాయకుడికీ లేనంతగా.. పద్నాలుగేళ్లు పదవిలో ఉన్న ఘనత తనదని టముకు వేసుకుంటూ ఉంటారు. అదంతా ఓకే.. అన్నాళ్లు పదవిలో ఉండి ఏం సాధించావు బాబూ అనడిగితే.. ఎప్పటిదో పురాతనమైన హైదరాబాదు పురాణం విప్పుతారు!

హైదరాబాదులో హైటెక్ సిటీ నేను చేసినదే.. హైదరాబాదు ఐటీ ఇండస్ట్రీ నేను తీసుకువచ్చినదే.. అవుటర్ రింగ్ రోడ్డు నేను వేసినదే, ఎయిర్ పోర్టు నేను కట్టినదే అంటూ.. చిట్టా విప్పి చెబుతూ ఉంటారు. చంద్రబాబు నాయుడు ఆ రకంగా తన ఘనతను చాటుకోవడానికి హైదరాబాదు పురాణం విప్పినప్పుడెల్లా.. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మాత్రం కడుపు రగిలిపోతూ ఉంటుంది.

ఎందుకంటే-ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉమ్మడిగా ఉన్న రోజుల్లో చంద్రబాబునాయుడు తొమ్మిదేళ్లపాటు సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా సేవలందించారు. అంటే.. ఆ పదవిలో ఉన్నారు. ఆయన చేసిన సేవ మాత్రం ఏమీ లేదు.

సాధారణంగా ఎవరైనా ముఖ్యమంత్రి అయితే.. తన సొంత నియోజకవర్గానికి, సొంత జిల్లాకు, సొంత ప్రాంతానికి ఏమైనా చేయాలని అనుకుంటారు. కానీ చంద్రబాబు కుప్పం నియోజకవర్గానికి, చిత్తూరు జిల్లాకు, రాయలసీమ ప్రాంతానికి ఉద్ధరించింది ఏమీ లేదు!

రాజధాని హైదరాబాదులో కూర్చుని.. నామినేషన్ వేయడానికి కూడా కుప్పం వెళ్లే అలవాటు లేని చంద్రబాబు.. తను అనుకునే అభివృద్ధి మొత్తాన్ని హైదరాబాదులోనే చేశారు. అక్కడే బోలెడన్ని రోడ్లు వచ్పాయి, ఐటీ ఇండస్ట్రీ వచ్చింది.. ఆయన పురాణం విప్పితే ఇంకా చాలా లెక్క చెప్తారు.. అవన్నీ వచ్చాయి. 

అయితే దాని ఫలితం ఏమైంది? హైదరాబాదు  మినహా.. యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అభివృద్ధి శూన్యం అయిపోయింది. డెవలప్మెంట్ అనేది మొత్తం ఒకే ఒక చోట కేంద్రీకృతం అయిపోయింది.

అంతా అయిపోయిన తర్వాత.. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం డిమాండ్ ఊపందుకుంది. వాళ్లు రాష్ట్రం సాధించుకున్నారు. హైదరాబాదు మనదే అనుకుంటూ.. అక్కడ స్థిరపడిన సీమాంధ్ర ప్రాంతం వాళ్లంతా దిక్కులేని వలసపక్షుల్లాగా నోరుమూసుకుని తిరిగి తమ సొంత ప్రాంతాలకు వచ్చి ఈసురోమని బతుకులు ప్రారంభించారు. ఈ దుర్మార్గం అంతటికీ కారకుడు చంద్రబాబే అనే అభిప్రాయం పలువురిలో ఉంది.

ఇవాళ, విభజన తర్వాత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి విషయంలో ప్రతిదానికీ వెతుకులాడుతున్నదంటే.. దేబిరిస్తున్నదంటే దానికి మూలకారకుడు చంద్రబాబు అనే అభిప్రాయం పలువురిలో ఉంది. 

డెవలప్మెంటు అంటే.. అన్ని ప్రాంతాల్లో సమానంగా ఉండాలి అని, సమతుల అభివృద్ధి జరగాలనే కనీస స్పృహ కూడా లేని చంద్రబాబు నాయుడు తనను తాను దార్శనికుడైన నేతగా అభివర్ణించుకోవడం పెద్ద సిగ్గు చేటు!

ఆయన చేసిన పనివల్లనే హైదరాబాదు ఇవాళ సుసంపన్నంగా కనిపిస్తుండగా.. ఏపీలో ఏ ఒక్క నగరం కూడా దాని దరిదాపుల్లోకి కూడా లేని రీతిలో కుములుతోంది.

అలాంటి నేపథ్యంలో చంద్రబాబునాయుడు మళ్లీ అమరావతి తీర్పు నేపథ్యంలో.. ‘హైదరాబాదును నేనే డెవలప్ చేశా’ అనే మాట అంటూ ఉంటే.. ఆ మాట వింటున్న సీమాంధ్రులకు కడుపు రగిలిపోకుండా ఎలా ఉంటుంది.

చంద్రబాబు అలా చేయడం వల్లనే విభజన ఏర్పడిందని, విభజన తర్వాత ఏపీ అత్యంత దయనీయమైన స్థితిలో ఉన్నదని వారంతా ఆగ్రహిస్తున్నారు.