ఎమ్బీయస్: మణిపూర్‌లో ఎన్నికలు

ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాలలో నాకు అతి తక్కువ ఆసక్తి ఉన్న రాష్ట్రం మణిపూర్. ఫిబ్రవరి 28న జరిగిన మొదటి విడత పోలింగులో 78% ఓటింగు జరిగింది. రెండో విడత మార్చి 5న జరుగుతుంది.…

ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాలలో నాకు అతి తక్కువ ఆసక్తి ఉన్న రాష్ట్రం మణిపూర్. ఫిబ్రవరి 28న జరిగిన మొదటి విడత పోలింగులో 78% ఓటింగు జరిగింది. రెండో విడత మార్చి 5న జరుగుతుంది. మహాభారతంలోని అర్జునుడి భార్య, బభ్రువాహనుడి తల్లి అయిన చిత్రాంగదది మణిపూరట. పేరుకి 16 జిల్లాలు, 60 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి కానీ జనాభా చూడబోతే 28.56 లక్షలు. 10 నియోజకవర్గాలున్న కడప జిల్లా జనాభా 28.84 లక్షలు! ఎంత చిన్న రాష్ట్రమో చూడండి. రాజకీయంగా ఫిరాయింపులే తప్ప పెద్ద సంచలనాలుండవు. 2002 నుంచి 2017 వరకు కాంగ్రెసుకి చెందిన ఇబోబి సింగ్ ముఖ్యమంత్రిగా ఉన్నాడు. 2017 నుంచి బిజెపికి చెందిన బీరేన్ సింగ్ ముఖ్యమంత్రిగా ఉన్నాడు. విశేషాలేమీ లేకపోవడం చేత ఆ రాష్ట్ర రాజకీయాల గురించి పెద్దగా తెలియదు. కానీ రేపు ఫలితాలు వచ్చినపుడు ఎందుకలా వచ్చాయి అని అర్థం చేసుకోవాలంటే కాస్త తెలుసుకోవాలి. అందుకని తెలుసుకుని, ఆ సమాచారాన్ని మీతో పంచుకుంటున్నాను.

మొత్తం 60 నియోజకవర్గాల్లో 40 ఇంఫాల్ లోయలోని ఆరు జిల్లాల్లో ఉన్నాయి, 20 పర్వతాల్లోని 10 జిల్లాల్లో ఉన్నాయి. లోయలో మీతేయీలు మెజారిటీగా ఉన్నారు. పర్వత ప్రాంతాల్లో మెజారిటీలో ఉన్న కూకీలు, నాగాలు క్రైస్తవులు. కానీ కుకీలు ఆర్థోడాక్స్ ప్రెస్బిటేరియన్ చర్చ్‌కు చెందగా, నాగాలు కౌన్సిల్ ఆఫ్ బాప్టిస్టు చర్చికి చెందినవారు. జనాభాలో మీతేయీలు 53% మంది ఉన్నారు. 24% మంది నాగాలు. కూకీలు 16%. యితరులు 7%. మతప్రకారం విభజించి చూస్తే హిందువులు 41%, క్రైస్తవులు 41%, సనమాహిజం అనుసరించేవారు 8%, ముస్లిములు 8% ఉన్నారు. కూకీలు కాంగ్రెసు పార్టీని సమర్థిస్తూ వచ్చారు. నాగాలు ఇటీవల బిజెపి వైపు ఆకర్షితులయ్యారు. ఇబోబి సింగ్, బీరేన్ సింగ్ యిద్దరూ మీతేయిలే!

2017 అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెసు 35% ఓట్లతో 28 సీట్లు, బిజెపి 36% ఓట్లతో 21 సీట్లు, నాగా పీపుల్స్ ఫ్రంట్ (ఎన్‌పిఎఫ్) 7% ఓట్లతో 4, నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్‌పిపి) 5.1% ఓట్లతో 4 సీట్లు, లోకజనశక్తి పార్టీ (ఎల్‌జెపి) 1 గెలుచుకున్నాయి. తక్కిన రెండిట్లో తృణమూల్‌కు ఒకటి పోగా, స్వతంత్రుడు ఒకడు నెగ్గాడు. అత్యధిక సీట్లు గెలుచుకున్నా సింపుల్ మెజారిటీకి 3 తగ్గడంతో కాంగ్రెసు తటపటాయిస్తూండగానే, బిజెపి ఎన్‌పిపి, ఎన్‌పిఎఫ్, ఎల్‌జెపిలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి యిన్నాళ్లుగా పాలిస్తూ వచ్చింది. మెజారిటీ వచ్చిన తనకు అభిమాన క్రీడ అనగా ఫిరాయింపుల క్రీడ ఆడుతూ పోయింది. దానివలన 60 స్థానాలలో 21 నెగ్గిన ఆ పార్టీకి ప్రస్తుతం 52 స్థానాలున్న అసెంబ్లీలో 31 స్థానాలున్నాయి. కాంగ్రెసుకు 13 ఉన్నాయి. బిజెపి తన మిత్రపక్షాలను కూడా వదల్లేదు. ఎన్‌పిఎఫ్ నుంచి విజయావకాశాలున్న 12 మంది మంచి నాయకులను గత నవంబరులో ఫిరాయింప చేసుకుని, యిప్పుడు అభ్యర్థులుగా టిక్కెట్లిచ్చింది.

మణిపూర్‌లో ఫిరాయింపులు కొత్త కాదు. నాయకులు నిరంతరం పార్టీలు మారుతూనే వుంటారు. అభ్యర్థిని బట్టే ఓటర్లు ఓటేస్తారని వాళ్ల నమ్మకం. ‘‘ఏ బ్రాండ్ కారైనా వేసుకుని రావచ్చు. డ్రైవరు ఎవరనేది ముఖ్యం కదా. అలాగే ఎన్నికలలో కూడా!’’ అన్నాడు ఓ నాయకుడు. మొత్తం ఓటర్లు 19 లక్షలు, నియోజకవర్గానికి రమారమి 32 వేల ఓట్లు మాత్రమే ఉంటాయి కాబట్టి తక్కువ మార్జిన్‌తోనే గెలుపోటములు సంభవిస్తాయి. ఈసారి మణిపూర్‌లో హంగ్ అసెంబ్లీ రావచ్చని పరిశీలకుల అంచనా. పార్టీల పరిస్థితి ఒకసారి చూస్తే, యిలాటి అభిప్రాయం ఎందుకు కలిగిందో అర్థమౌతుంది. పోటీ చేస్తున్న పార్టీలు కాంగ్రెసు, బిజెపి, ఎన్‌పిపి, ఎన్‌పిఎఫ్. కాంగ్రెసుకు సిపిఐతో కలిసి పోటీ చేస్తోంది. తక్కినవన్నీ విడివిడిగానే.

ముందుగా చెప్పుకోవలసినది 15 ఏళ్లు పాలించిన కాంగ్రెసు గురించి. దానికి హిందువుల్లో, క్రైస్తవుల్లో ఎల్లెడలా మద్దతు వుంటూ వచ్చింది. కానీ అనేక రాష్ట్రాలలో లాగానే యిక్కడా స్థానిక నాయకత్వం వృద్ధహస్తాల్లో ఉండిపోయింది. 73 ఏళ్ల ఇబోబి సింగ్‌పై ఎవర్నీ పైకి రానివ్వడన్న ముద్ర వుంది. 2017 నుంచి బిజెపి ముఖ్యమంత్రిగా ఉన్న బీరేన్ సింగ్ 2016 వరకు ఇబోబి అనుచరుడే. అక్కడే వుంటే భవిష్యత్తు లేదనుకుని, పార్టీ విడిచి బిజెపిలో చేరాడు. అయితే అతని అల్లుడు ఇమో సింగ్ మాత్రం కాంగ్రెసులో వుంటూ, విభీషణ పాత్ర పోషించాడు. 2020లో మావగారి ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం వచ్చినపుడు కాపాడడానికి కాంగ్రెసు నుంచి ఆరుగుర్ని రాజీనామా చేయించి, ఓటింగుకి గైరుహాజరు అయ్యేలా చేశాడు. గత ఐదేళ్లలో కాంగ్రెసులోంచి రాష్ట్ర అధ్యక్షుడితో సహా 15 మంది ఎమ్మెల్యేలు వెళ్లిపోయేట్లా సాధ్యమైనంత కృషి చేసి, చివరకు 2021 నవంబరులో తనూ పార్టీ విడిచి బిజెపిలో చేరాడు.

ఈ నిష్క్రమణలను అడ్డుకోలేక పోయిన ఇబోబిని తప్పించి యువనాయకులను ప్రోత్సహించాలని యితర కాంగ్రెసు నాయకులు సోనియా వద్ద మొరపెట్టుకున్నా, ఆమె వినలేదు. ఇబోబినే సిఎం అభ్యర్థిగా చూపించటం లేదు కానీ, అతనే కావచ్చు అన్నట్లు ఉంది వ్యవహారం. నాగా తీవ్రవాదులను అణచివేయడంలో దృఢంగా వ్యవహరించడంతో ఇబోబిపై నాగా వ్యతిరేకి అనే ముద్ర వుంది. అయినా 2017లో 20 పర్వతప్రాంతంలోని 20 నియోజకవర్గాల్లో 9 గెలిచాడు. కూకీల మద్దతు యిన్నాళ్లూ కాంగ్రెసుకు లభిస్తోంది. ఇప్పుడు కూకీ పీపుల్స్ ఎలయన్స్ పేరుతో వెలసిన కొత్త పార్టీ 9 స్థానాల్లో కాంగ్రెసు ఓట్లు చీల్చవచ్చంటున్నారు. అందువలన యీసారి కాంగ్రెసు పార్టీ ఎన్‌పిఎఫ్‌తో కలిసి పోటీ చేయాలని ఇబోబి చెప్పినా సోనియా వినలేదు.

ఇబోబి ఎన్‌పిఎఫ్‌తో కలుద్దామని ఎందుకన్నాడంటే, అది కేంద్రంలో ఎన్‌డిఏలో కొనసాగుతూనే, రాష్ట్రంలో ఈసారి ఎన్నికలలో విడిగా 15 సీట్లలో పోటీ చేస్తోంది. వీటిలో 11టిలో నాగాలు జనాభా ఎక్కువ. 2017లో 11టిలో పోటీ చేసి 4 గెలిచింది. ప్రభుత్వంలో మరో భాగస్వామిగా ఉన్న ఎన్‌పిపి, ముఖ్యమంత్రి బీరేన్ సింగ్‌పై గుర్రుగా వున్నా మరో భాగస్వామి ఎన్‌పిఎఫ్ మాత్రం సమర్థిస్తూ వచ్చింది. కానీ 2021 డిసెంబరులో నాగాలాండ్‌లో మోన్ జిల్లాలో అమాయక నాగాల మారణకాండ తర్వాత ఎఎఫ్‌ఎస్‌పిఏ (ఆర్మ్‌డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్) ఎత్తివేయమని డిమాండ్ చేసింది. కానీ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో యిప్పుడు బిజెపితో పోరాటానికి దిగింది కానీ ఫ్రెండ్లీ కాంటెస్టు అంటోంది. ఎన్నికల తర్వాత చేతులు కలపవచ్చు.  

బిజెపి విషయానికి వస్తే, బీరేన్ ‘‘మేం చాలా చేద్దామనుకున్నాం, కానీ కరోనా కారణంగా పనులు ఆగిపోయాయి. ఆదాయమార్గాలు దెబ్బ తిని ప్రాజెక్టులు చేపట్టలేకపోయాం. అయినా జనాభా మొత్తానికి హెల్త్ ఇన్సూరెన్స్ వంటి పథకాలు పెట్టాం. 5400 స్టార్టప్స్, 11 వేల ఎంఎస్ఎమ్‌ఇ యూనిట్లు పెట్టడానికి దోహదపడ్డాం. అన్ని జిల్లాలలో మోడల్ స్కూళ్లు పెట్టాం.’’ అని చెప్పుకుంటున్నాడు. మణిపూర్‌లో తలసరి ఆదాయం జాతీయ సగటులో సగమే వుంది. పరిశ్రమలు పెద్దగా లేకపోవడం చేత యువత ప్రభుత్వోద్యోగాలపై ఆధారపడుతుంది. కరోనా కారణమనండి, మరేదైనా అనండి, నిరుద్యోగం ప్రబలి, యిప్పుడు 9% ఉంది. నిరుద్యోగులు ఆగ్రహంగా ఉన్నారని గమనించి, ప్రభుత్వం ప్రభుత్వోద్యోగాలకు అనేక పరీక్షలు నిర్వహించింది కానీ ఫలితాలు వెల్లడించలేదు. ‘‘మేం మళ్లీ ఎన్నికైతే ఆ ఫలితాలను బయటపెడతాం’’ అంటున్నాడు బీరేన్. ఇదేం సరసమో తెలియటం లేదు.

మణిపూర్‌లో రోడ్లు, డ్రైనేజి, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ బాగుండవని ప్రతీతి. ఇంఫాల్ నుంచి 80 కి.మీ.లున్న ఉఖ్రుల్‌కు కారులో వెళ్లడానికి మూడు గంటలు పట్టిందని రిపోర్టరు రాశాడు. 15 ఏళ్ల కాంగ్రెసు పాలన వదిలేయండి, గత ఐదేళ్లలో ఏం చేశారని అడిగితే బిజెపి ఏం చెప్పగలుగుతుంది? ఎన్నికలున్న రాష్ట్రాలలో ఎన్నికల వేళ కేంద్ర బిజెపి ప్రాజెక్టులు ప్రారంభిస్తుందని అందరికీ తెలుసు. ఇక్కడా రూ.5 వేల కోట్ల అంచనాతో 21 మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టడం జరిగింది. ఇవేవో ముందే చేస్తే బాగుండేది. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలైనా దక్కేవి. త్రిశంకు సభ దాకా వస్తే చాలు, బిజెపి ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయం. పోనీ అప్పుడైనా యీ ప్రాజెక్టులు పూర్తి చేస్తుందని ఆశిద్దాం.

బిజెపిలో అంతఃకలహాలు చాలానే ఉన్నాయి. ఫిరాయింపులతో బలపడుతూ వచ్చిన బిజెపికి అదే బలహీనతగా మారుతోంది. కాంగ్రెసు నుంచి వచ్చిన ఎమ్మెల్యేలకు, ఇద్దరు తృణమూల్ వారికి, ఎల్‌జెపి మాజీలకు మళ్లీ టిక్కెట్లు యివ్వడంతో సొంత పార్టీ నాయకులకు అసంతృప్తి కలిగిస్తోంది. బిజెపిలో ముఖ్యమంత్రి ఆశావహులు నలుగురున్నారు. వారిలో బీరేన్ అల్లుడు ఇమో కూడా ఉన్నాడు. అధిష్టానం ఎవరి పేరూ ప్రకటించలేదు. మెజారిటీ సభ్యుల నిర్ణయానికి వదిలేస్తాం అన్నాడు కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్. అసాంలో చేసినట్లు, బీరేన్‌ను కేంద్రమంత్రిని చేసి, మరొకర్ని ముఖ్యమంత్రిగా కూర్చోబెట్టవచ్చని అనుకుంటున్నారు. ఫలితాలు వచ్చాక ఎన్‌పిపి మద్దతు కోరవలసిన పరిస్థితి ఏర్పడితే, బీరేన్ మళ్లీ సిఎం కాకపోవచ్చు.

ఎందుకంటే ఎన్‌పిపి నాయకుడు, బీరేన్ వద్ద ఉపముఖ్యమంత్రిగా పనిచేసిన జయకుమార్ సింగ్‌కి అతనంటె అస్సలు పడదు. బీరేన్ తమను పట్టించుకోవటం లేదని ఆరోపిస్తూ ఎన్‌పిపి ఎమ్మెల్యేలు నలుగురూ 2020లో ప్రభుత్వాన్ని దాదాపు పడగొట్టబోయారు. బిజెపి అధిష్టానం చర్చలు జరిపి ఆ ప్రమాదాన్ని తప్పించింది. ఇప్పుడు కేంద్రంలో ఎన్‌డిఏలో కొనసాగుతూనే రాష్ట్రస్థాయిలో బిజెపితో తలపడుతోంది ఎన్‌పిపి. గతంలో 9టిలో పోటీ చేసి 4 గెలిచిన ఆ పార్టీ యీసారి 40టిలో పోటీ చేస్తోంది. గట్టి అభ్యర్థులను ఎంపిక చేశామని చెప్పుకుంటోంది. కనీసం పదైనా గెలుస్తాయని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు, మేఘాలయ ముఖ్యమంత్రి ఐన కాన్రాడ్ సంగ్మా ఆశ. ఎఎఫ్‌ఎస్‌పిఏ ఎత్తివేయాలని సోషల్ మీడియా ద్వారా తాము బలంగా చేస్తున్న ఆందోళన యువతను ఆకర్షిస్తుందని వారి ఆశ. కానీ ముఖ్యనేత జయకుమార్ రాష్ట్ర డిజిపిగా పనిచేసినప్పుడు పౌరుల పట్ల క్రూరంగా ప్రవర్తించాడన్న రికార్డు దానికి అవరోధం కావచ్చు. ఫలితాలు వచ్చాక చూదాం, మణిపూర్ ఓటరు ఏమనుకుంటున్నాడో! (ఫోటో – ఇబోబి సింగ్, బీరేన్ సింగ్)

– ఎమ్బీయస్ ప్రసాద్ (మార్చి 2022)

[email protected]