రాజధానిపై ఏపీ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించిన నేపథ్యంలో వైసీపీ సర్కార్ హితవు చెప్పేవాళ్లు ఎక్కువయ్యారు. అలాంటి జాబితాలో జనసేన నాయకుడు, మెగాబ్రదర్ నాగబాబు చేరారు. రాజధానిని అభివృద్ధి చేయడంతో పాటు వివిధ అంశాలపై స్పష్టమైన ఆదేశాలను హైకోర్టు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ తీర్పుపై మెగాబ్రదర్ నాగబాబు తనదైన శైలిలో స్పందించారు. ఈ రోజు తనకు చాలా సంతోషంగా ఉందంటూ ఆయన ఓ వీడియోను విడుదల చేశారు. అందులో ఏమున్నదంటే…
ఇప్పటికైనా హైకోర్టు తీర్పుపై వైసీపీ ప్రభుత్వం పంతానికి పోవద్దని కోరారు. హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్లొద్దని విన్నవించారు. ఒకవేళ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించినా, ఏపీ హైకోర్టులో ఎదురైన అనుభవమే పునరావృతం అవుతుందని చెప్పారు. వైసీపీ ప్రభుత్వం రాగానే, మూడు రాజధానుల కాన్సెప్ట్‌ను తెరపైకి తెచ్చి అమరావతి రాజధానిని నిర్వీర్యం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
రాజధాని ఉద్యమంపై వైసీపీ మంత్రులు, నాయకులు ఎన్నో మాటలు మాట్లాడారని గుర్తు చేశారు. ఇదొక స్పాన్సర్ ఉద్యమమని విమర్శించారని చెప్పారు. అమరావతి రాజధాని ఉద్యమంలో తమ నాయకులు పవన్‌కల్యాణ్, నాదెండ్ల మనోహర్ పాలు పంచుకున్నారన్నారు. అందుకే హైకోర్టు తాజా తీర్పు తమకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందన్నారు. ఇప్పటికైనా సరైన రాజధానిగా అమరావతి రూపొందేందుకు ఒక అవకాశం వచ్చిందన్నారు.
ఏ ప్రభుత్వమైనా సరే ఎవరితోనైనా శత్రుత్వం పెట్టుకోవచ్చు కానీ, ప్రజలతో కాదని ఆయన హితవు చెప్పారు. ప్రజలతో శత్రుత్వం పెట్టుకున్న ఏ ప్రభుత్వమైనా నిలబడలేదన్నారు. ప్రజలతో శత్రుత్వం పెట్టుకుని ఏపీ సర్కార్ తప్పు చేసిందన్నారు. ఇప్పటికైనా ఆ తప్పును సరిదిద్దుకోవాలని ఆయన కోరారు. రాజధాని ప్రాంత ప్రజల జోలికి వెళ్లొద్దని నాగబాబు సూచించారు. భారతదేశంలో న్యాయం ఇంకా బలంగా ఉందనడానికి హైకోర్టు తాజా తీర్పే నిదర్శనమన్నారు.