సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఏం చేస్తున్నారని తనను సోషల్ మీడియాలో ప్రశ్నించడంపై ఆయన విస్మయం చెందారు. ఈ సందర్భంగా ఆయన కీలక ప్రశ్నలు సంధించడం గమనార్హం. ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయుల రక్షణపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్‌ను జస్టిస్ ఎన్వీ రమణ విచారణ చేపట్టారు.
విచారణలో భాగంగా తనపై సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో గురించి ఆయన ప్రస్తావించారు. “సోషల్ మీడియాలో ఓ వీడియో చూశాను. ప్రధాన న్యాయమూర్తి ఏం చేస్తున్నారని ఆ వీడియోలో ప్రశ్నించారు. ఉక్రెయిన్‌పై సైనిక చర్య ఆపాలని రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను నేను ఆదేశించగలనా?” అని ఆయన ఆవేదనతో ప్రశ్నించారు. ఉక్రెయిన్‌లో చిక్కుకున్న విద్యార్థుల గురించి తాము కూడా ఆందోళన చెందుతున్నట్టు ఆయన తెలిపారు.
ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయ విద్యార్థులను స్వదేశానికి తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం తన పని తాను చేస్తోందన్నారు. ఉక్రెయిన్ సరిహద్దుల్లో రొమేనియాకు సమీపంలో విద్యార్థులకు సాయం అందించాలని అటార్నీ జనరల్‌కు చీఫ్ జస్టిస్ సూచించారు. తనపై రష్యా సైనిక చర్యకు దిగడంతో ఉక్రెయిన్ గగనతలాన్ని మూసి వేసింది. దీంతో అక్కడి నుంచి మన విద్యార్థులను స్వస్థలాలకు తరలించేందుకు కష్టమైంది. ఈ నేపథ్యంలో రష్యా, ఉక్రెయిన్ దేశాధినేతలతో భారత విదేశాంగ ప్రతినిధులు చర్చించి, అక్కడి విద్యార్థులను స్వదేశానికి తరలించేందుకు మార్గాన్ని సుగమం చేశారు.
విడతల వారీగా ఉక్రెయిన్ నుంచి భారత్‌కు మన వాళ్లను తరలిస్తున్నారు. ఇదిలా వుండగా ఉక్రెయిన్ నుంచి భారతీయులను తరలించకుంటే, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌ను ప్రశ్నించడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఆ వీడియో జస్టిస్ ఎన్వీ రమణ కంటే పడడం మరింత ఆశ్చర్యం. సంబంధం లేని అంశంపై తనను ప్రశ్నించిన నేపథ్యంలో ఎన్వీ రమణ స్పందిస్తూ పుతిన్‌ను తానెలా నిలువరించగలనని అడగడం విశేషం.