ఆ ఎన్నిక‌లెందుకు, ఈ ఎన్నిక‌ల్లో స‌త్తా చూపొచ్చుగా చంద్ర‌బాబూ!

ఏపీ ప్ర‌తిప‌క్ష నేత‌, తెలుగుదేశం అధినేత చంద్ర‌బాబు నాయుడు ఈ మ‌ధ్య ఎన్నిక‌ల జ‌పం చేస్తున్నారు. ఏపీలో సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌యిపోయి ఏడాదిన్న‌ర అయినంత‌లోనే మ‌ళ్లీ ఎన్నిక‌లు వ‌స్తున్నాయంటూ చంద్ర‌బాబు నాయుడు త‌న పార్టీ కార్య‌క‌ర్త‌ల‌కు…

ఏపీ ప్ర‌తిప‌క్ష నేత‌, తెలుగుదేశం అధినేత చంద్ర‌బాబు నాయుడు ఈ మ‌ధ్య ఎన్నిక‌ల జ‌పం చేస్తున్నారు. ఏపీలో సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌యిపోయి ఏడాదిన్న‌ర అయినంత‌లోనే మ‌ళ్లీ ఎన్నిక‌లు వ‌స్తున్నాయంటూ చంద్ర‌బాబు నాయుడు త‌న పార్టీ కార్య‌క‌ర్త‌ల‌కు ప‌దే ప‌దే చెబుతూ ఉన్నారు. 

జూమ్ మీటింగుల్లో చంద్ర‌బాబు నాయుడు ఎన్నిక‌ల‌కు రెడీగా ఉండాలంటూ ప‌చ్చ చొక్కాల‌ను అల‌ర్ట్ చేస్తున్నార‌ని ఆయ‌న అనుకూల ప‌త్రిక‌లే రాస్తున్నాయి. ఇప్పుడు ఎన్నిక‌లు ఏమిటి? అంటే.. త‌లాతోకా లేని జ‌మిలి గురించి మాట్లాడ‌తారు.

జ‌మిలి ఎన్నిక‌ల‌కు సంబంధించి బోలెడ‌న్ని డౌట్లు ఉండ‌నే ఉన్నాయి. జ‌మిలి ఎన్నిక‌ల‌ను నిర్వ‌హించాల‌ని ప్ర‌ధాని మోడీ అనుకోవ‌చ్చు గాక‌.. వాటి నిర్వ‌హ‌ణ‌కు సంబంధించిన సందేహాల‌ను మాత్రం ఆయ‌న కూడా ఇంకా తీర్చ‌డం లేదు. దానిపై కూలంక‌ష‌మైన చ‌ర్చ లేదు. అలా ఆలూచూలూ లేకుండా ఎన్నిక‌లు వ‌స్తున్నాయ‌న్న‌ట్టుగా తెలుగుదేశం వ‌ర్గాలు ప్ర‌చారం చేసుకుంటున్నాయి!

ఇప్పుడు చంద్ర‌బాబు ముందున్న ప్ర‌ధాన స‌మ‌స్య క్యాడ‌ర్ ను నిల‌బెట్టుకోవ‌డం. ఇప్ప‌టికే తెలుగుదేశం క్యాడ‌ర్ చెల్లాచెదురైంది. చంద్ర‌బాబు నాయుడు త‌న పార్టీ కార్య‌క‌ర్త‌ల ముందుకు రాక ఏడాది గ‌డిచిపోయిన‌ట్టుగా ఉంది! క‌రోనా సెకెండ్ వేవ్ అనే వార్త‌ల నేప‌థ్యంలో ఆయ‌న ఎప్పుడు త‌న పార్టీ కార్య‌క‌ర్త‌ల ముందుకు అయినా వ‌స్తార‌నేది శేష ప్ర‌శ్నే. 

ఆయ‌నే అనుకుంటే ఆయ‌న త‌న‌యుడు లోకేష్ మ‌రింత లోప్రొఫైల్ మెయింటెయిన్ చేస్తున్నారు. రాజ‌కీయం అంటే.. ట్విట‌ర్ అన్న‌ట్టుగా ఉంది లోకేష్ తీరు. చంద్ర‌బాబు నాయుడు బ‌య‌ట‌కు రాలేని త‌రుణంలో లోకేష్ బయ‌ట‌కు రావ‌డానికి పెద్ద ఆస‌క్తితో క‌నిపిస్తున్న‌ట్టుగా లేరు.

ఇలాంటి త‌రుణంలో ఎన్నిక‌లు వ‌చ్చేస్తున్నాయి.. అంటూ ప‌దే ప‌దే చెబుతూ, క్యాడ‌ర్ ను వెంట నిలుపుకోవాల‌ని చంద్ర‌బాబు నాయుడు భావిస్తున్న‌ట్టుగా ఉన్నారు. అయితే ఎన్నిక‌లు వ‌స్తాయి స‌రే, వ‌స్తే? జ‌నాలు ఎగేసుకుని సైకిల్ గుర్తుకు ఓటేసేస్తారా? అనేది కీల‌క‌మైన ప్ర‌శ్న‌. 

చంద్ర‌బాబు నాయుడు హైద‌రాబాద్ లోని త‌న ఇంట్లో కూర్చుంటే, అక్క‌డ నుంచి డైరెక్టుగా ఆయ‌న‌ను మ‌ళ్లీ అమ‌రావ‌తికి ముఖ్య‌మంత్రిగా తీసుకు వ‌స్తారా? ఐదారు శాతం ఓట్లు అటుఇటు అయితే వైఎస్సార్సీపీ ఓడిపోతుంద‌ని చంద్ర‌బాబు నాయుడు చిటికెల పందిరి వేసిన‌ట్టుగా మాట్లాడుతున్నారు. 

ఆ ఐదారు శాతం ఓట్లు అటు ఇటు ఎలా అవుతాయో చంద్ర‌బాబు చెప్ప‌డం లేదు! వారికి గ‌త ఎన్నిక‌ల్లో వ‌చ్చిన ఓట్ల శాతంలో కూడా ఇప్పుడు ఎంత శాతం అలాగే ఉందో చంద్ర‌బాబు నాయుడు ముందు లెక్కేసుకోవాలి!

అయినా ఇప్పుడు ఎన్నిక‌లు ఎన్నిక‌లు అంటూ ప‌దే ప‌దే క్యాడ‌ర్ ను ఉత్సాహ‌ప‌రిచే ప్ర‌య‌త్నం చేస్తున్న చంద్ర‌బాబుకు అస‌లు ప‌రీక్ష రానే వ‌స్తోంది. ఎన్నిక‌ల‌ను తెగ క‌ల‌వ‌రిస్తున్న ఆయ‌న కోరిక మేర‌కు తిరుప‌తి బై పోల్ జ‌ర‌గ‌నుంది. తిరుప‌తి బై పోల్ లో తెలుగుదేశం పార్టీ ఏ మేర‌కు స‌త్తా చూపుతుంద‌నేది ఆస‌క్తిదాయ‌కంగా మారింది. 

అది కూడా చంద్ర‌బాబు నాయుడే స్వ‌యంగా ఎన్నిక‌ల ఊసు త‌ర‌చూ ఎత్తుతున్న నేప‌థ్యంలో.. తిరుప‌తి బై పోల్ లో ఆ ఉత్సాహాన్ని అంతా ప్ర‌ద‌ర్శించాల్సి ఉంది. కార్య‌క‌ర్త‌ల‌కు, శ్రేణుల‌కు మ‌రేం చెప్ప‌కుండా ఎన్నిక‌లు వ‌స్తున్నాయ‌నే మాట‌ను మాత్ర‌మే చెబుతున్న చంద్ర‌బాబు నాయుడు త‌న వ్యాఖ్య‌ల‌తోనే తిరుతి బై పోల్ ను మ‌రింత ప‌రీక్ష‌గా మార్చుకుంటున్న‌ట్టుగా ఉన్నారు. ఆ ప‌రీక్ష‌లో ప‌చ్చ పార్టీకి ప‌డే మార్కులు ఎన్నో!  

రాయ‌పాటి రాజ‌కీయం,వ్యాపారం