తిరుప‌తి పోరులో చల్లారిన బీజేపీ హ‌డావుడి?

తిరుప‌తి ఉప ఎన్నిక స‌మ‌రంలో చాలా ముందుగానే హ‌డావుడి మొద‌లుపెట్టిన భార‌తీయ జ‌న‌తా పార్టీ, ఇంకా అస‌లు క‌థ మొద‌లు కాకుండానే చ‌ల్లారిన వైనం క‌నిపిస్తూ ఉంది. ఇంకా నోటిఫికేష‌న్ ఎప్పుడొస్తుందో కూడా తెలియ‌ని…

తిరుప‌తి ఉప ఎన్నిక స‌మ‌రంలో చాలా ముందుగానే హ‌డావుడి మొద‌లుపెట్టిన భార‌తీయ జ‌న‌తా పార్టీ, ఇంకా అస‌లు క‌థ మొద‌లు కాకుండానే చ‌ల్లారిన వైనం క‌నిపిస్తూ ఉంది. ఇంకా నోటిఫికేష‌న్ ఎప్పుడొస్తుందో కూడా తెలియ‌ని త‌రుణంలోనే భార‌తీయ జ‌న‌తా పార్టీ వాళ్లు తిరుప‌తిలో డ‌ప్పు కొట్ట‌డం మొద‌లుపెట్టారు. అయితే ఇప్ప‌టి వ‌ర‌కూ నోటిఫికేష‌న్ ఎప్పుడు వ‌స్తుందో తెలియ‌దు. కానీ.. భార‌తీయ జ‌న‌తా పార్టీ నేత‌లు మాత్రం చ‌ల్లారారు.

తిరుప‌తి ఉప ఎన్నిక‌ల్లో స‌త్తా చూపించి అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, ఇటు తెలుగుదేశం పార్టీకి తామే ప్ర‌త్యామ్నాయం అవుతామనేంత స్థాయిలో బీజేపీ నేత‌లు హ‌డావుడి చేశారు. అయితే.. జ‌న‌సేన‌తో స‌రిగా చ‌ర్చ‌లు జ‌ర‌క‌పోవ‌డం, మ‌రోవైపు క్షేత్ర స్థాయిలో క్యాడ‌ర్ ఊసే లేక‌పోవ‌డం, మ‌రోవైపు అమ‌రావ‌తికి వంత పాడ‌టం.. ఇవ‌న్నీ భార‌తీయ జ‌న‌తా పార్టీని అతి త్వ‌ర‌గానే చ‌ల్లార్చాయి!

తెలంగాణ‌లో బీజేపీ సాధించిన విజ‌యాల‌ను చూసి భార‌తీయ జ‌న‌తా పార్టీ ఏపీ విభాగం హ‌డావుడి మొద‌లుపెట్టింది. ఆ పార్టీ ఉత్సాహ ప‌డుతున్న త‌రుణంలోనే తిరుప‌తి ఉప ఎన్నిక వ‌చ్చింది. దీంతో ఉత్సాహంగా రంగంలోకి దిగారు కాషాయ చొక్కాల వాళ్లు. తిరుప‌తి చుట్టూ తిరుగుతూ, అక్క‌డ వివిధ కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హించారు. 

అభ్య‌ర్థిని కూడా అన‌ధికారికంగా రెడీ చేసుకున్నారు. అయితే బీజేపీ ఏపీలో సొంతంగా బ‌రిలోకి దిగే సాహ‌సం చేయ‌డం లేదు. పైకి ఎన్ని మాట‌లు చెప్పినా.. సోలోగా స‌త్తా చూపించేంత ధైర్యం క‌న‌ప‌డం లేదు. అందుకే ప‌వ‌న్ క‌ల్యాణ్ ను వెంట‌పెట్టుకున్నారు. ఇక త‌న స‌త్తాపై చాలా చాలా న‌మ్మ‌కాన్ని క‌లిగి ఉన్న వ్య‌క్తి ప‌వ‌న్ క‌ల్యాణ్. 

ఎంత‌లా అంటే ఒక‌టి రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోయి కూడా.. ప‌వ‌న్ క‌ల్యాణ్ ఇంకా త‌న గురించి అతిగా ఊహించుకోవ‌డం త‌గ్గించ‌డం లేదు. తిరుప‌తి పోరులో త‌న పార్టీ బ‌రిలోకి దిగాల‌నే కోరిక‌ను బీజేపీకి ప‌వ‌న్ క‌ల్యాణ్ విన్న‌వించిన‌ట్టుగా ఉన్నారు.

ఇదంతా చంద్ర‌బాబు నాయుడి స్కెచ్ అనే వాద‌నా బ‌లంగా ఉంది. ఏపీలో తెలుగుదేశం పార్టీనికి మూడోస్థానంలోకి నెట్టి త‌ను రెండో స్థానం లోకి రావాల‌నే ఉత్సాహంతో బీజేపీ. అది చంద్ర‌బాబుకు ఏ మాత్రం న‌చ్చని అంశం. అందుకే ప‌వ‌న్ క‌ల్యాణ్ అనే త‌న చేతిలోని పావును క‌దిపి చంద్ర‌బాబు నాయుడు ప‌ని పూర్తి చేసుకునేలా ఉన్నారు. 

జ‌న‌సేన గ‌నుక తిరుప‌తిలో పోటీ చేస్తే.. అటు జ‌న‌సేన‌, ఇటు బీజేపీ రెండూ చంద్ర‌బాబు ఆట‌లో పావులుగా మారిన‌ట్టే. జ‌న‌సేన పార్టీ అభ్య‌ర్థి పోటీ చేయ‌డం మాత్ర‌మే ఉంటుంది. ఆ త‌ర్వాత ఆ అభ్య‌ర్థి జాత‌కం అంతా చంద్ర‌బాబు చేతిలోకి వెళుతుంద‌నేది బ‌హిరంగ స‌త్యం. మొన్న‌టి వ‌ర‌కూ తామే తిరుప‌తి బ‌రిలో ఉండ‌బోతున్న‌ట్టుగా ప్ర‌క‌టించిన బీజేపీ, ఇప్పుడు వెన‌క్కు త‌గ్గిన వైనం స్ప‌ష్టం అవుతోంది. 

జ‌న‌సేన‌తో సంప్ర‌దింపులు ఆ పార్టీ నేత‌ల‌కు ఇప్పుడు గుర్తుకు వ‌చ్చాయి. దీంతో తిరుప‌తి బరిలో చంద్ర‌బాబు కోరిక మేర‌కు జ‌న‌సేన బ‌రిలోకి దిగుతుందా! అనే అనుమానాలు వ్య‌క్తం అవుతూ ఉన్నాయి.

ఇక ఇదే స‌మ‌యంలో అమ‌రావ‌తి ఆందోళ‌న‌ల వార్షికోత్స‌వంలో ఏపీ బీజేపీ నేత‌లు పాల్గొన్నారు. అమ‌రావ‌తే రాజధానిగా ఉండాలి, అమ‌రావ‌తి మాత్ర‌మే రాజ‌ధానిగా ఉండాలంటూ వారు మాట్లాడారు. ఒక‌వైపు రాయ‌లసీమ‌ను ఉద్ధ‌రిస్తామంటూ తిరుప‌తిలో చెప్పుకునే బీజేపీ నేత‌లు అమ‌రావ‌తి వెళ్లి అక్క‌డ  అలా మాట్లాడారు. సీమ‌కు న్యాయంగా ద‌క్కాల్సిన వాటిని కూడా ద‌క్క‌నివ్వ‌ని చంద్ర‌బాబు విధానాల‌కే బీజేపీ మ‌ద్ద‌తు ప‌లుకుతూ ఉంది.

మ‌రి అమ‌రావ‌తికి జై కొడుతూ ఏ మొహం పెట్టుకుని తిరుప‌తిలో ఓట‌డుగుతారు? అని రాయల‌సీమ వాసులు ప్ర‌శ్నిస్తున్నారు. అమ‌రావ‌తికి మ‌ద్ద‌తు అని ప్ర‌క‌టించ‌డం ద్వారా తిరుప‌తిలో త‌మ‌కు ఏదైనా ఊపు ఉంటే దాన్ని కాస్తా నీరు గార్చుకున్నారు క‌మ‌ల‌నాథులు. రేపు వీళ్లు పోటీకే దిగ‌కుండా, జ‌నసేన అభ్య‌ర్థి పోటీకి దిగితే.. అంత‌టితో తిరుప‌తి ఉప పోరు నుంచి బీజేపీ నిష్క్ర‌మించిన‌ట్టే కాబోలు!

రాయ‌పాటి రాజ‌కీయం,వ్యాపారం