పాఠాలు చెబుతున్న మేయర్

విశాఖ లాంటి స్మార్ట్ సిటీకి ఆమె అనూహ్యంగా మేయర్ అయ్యారు. ఏపీలోనే దాదాపుగా వంద వార్డులు ఉన్న అతి పెద్ద కార్పోరేషన్ కి మేయర్ అంటే మాటలు కాదు. అయితే సామాజిక సమీకరణలతో పాటు,…

విశాఖ లాంటి స్మార్ట్ సిటీకి ఆమె అనూహ్యంగా మేయర్ అయ్యారు. ఏపీలోనే దాదాపుగా వంద వార్డులు ఉన్న అతి పెద్ద కార్పోరేషన్ కి మేయర్ అంటే మాటలు కాదు. అయితే సామాజిక సమీకరణలతో పాటు, మహిళలకు యాభై శాతం కోటా అమలు చేయాలన్న జగన్ పట్టుదల కారణంగా విశాఖ మేయర్ గా హరి వెంకట కుమారి అయిపోయారు.

మేయర్ గా ఏడాది కాలంలో ఆమె మెల్లగా పట్టు సాధిస్తున్నారు. ప్రతి నిత్యం విశాఖ వార్డుల్లో ఆమె కనిపిస్తున్నారు. ప్రజలతో మమేకం అవుతున్నారు. వారితో ముచ్చట్లు పెడుతున్నారు. మంచీ చెడ్డా అడిగి తెలుసుకుంటున్నారు. అన్నింటికీ తాను ఉన్నానని భరోసా ఇస్తున్నారు.

ఇక ఆకస్మిక తనిఖీలు చేసి మరీ సిబ్బందిని హడలెత్తిస్తున్నారు. పొరపాట్లు రిపీట్ అయితే ఊరుకోను  అని హెచ్చరిస్తున్నారు కూడా. ఈ నేపధ్యంలో ఆమె వరసబెట్టి కార్పోరేషన్ స్కూళ్ళను కూడా తనిఖీ చేస్తున్నారు. అలా ఒకచోట సోషల్ బోధించే టీచర్ స్కూల్ కి ఇరవై రోజులుగా రావడం లేదని తెలియడంతో ఆమె పాఠశాల యాజమాన్యానికి మొదట క్లాస్ తీసుకున్నారు.

ఆ మీదట తానే టీచర్ అవతారం ఎత్తేసి విద్యార్ధులకు బోధించారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పధకాలు, కార్యక్రమాలు విద్యార్ధులకు అందుతున్నాయా లేదా అని వాకబు చేశారు. ప్రభుత్వం అందించే  భోజనం నాణ్యత ఎలా ఉందో చూసి విద్యార్ధులతో పాటే తాను అక్కడే కూర్చుని భోజనం చేశారు. 

మొత్తానికి విశాఖ ప్రధమ పౌరురాలు  క్లాసులు బాగానే తీసుకుంటున్నారు, తన యాక్షన్ ద్వారా అందరినీ దారికి తెస్తున్నారు.