వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఇది కీలక సమయం అని, ఈ సమయంలో తాము కొందరు ప్రముఖులను అరెస్టు చేయనున్నట్టుగా సీబీఐ చెప్పింది. ఈ అంశాన్ని కోర్టుకు నివేదించింది కేంద్ర ధర్యాప్తు సంస్థ. ఈ కేసులో ఐదో నిందితుడిగా ఉన్న దేవిరెడ్డి శివశంకర రెడ్డి బెయిల్ పిటిషన్ పై కడప కోర్టులో జరిగిన విచారణ సందర్భంగా సీబీఐ ఈ విషయాన్ని పేర్కొనడం గమనార్హం.
అఫ్రూవర్ గా మారిన నిందితుడు దస్తగిరి ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం దేవిరెడ్డి శివశంకర్ రెడ్డిని సీబీఐ ఐదో నిందితుడిగా పేర్కొంది. అరెస్టు చేసింది. ఈ క్రమంలో బెయిల్ పిటిషన్ ను పెట్టుకున్నాడు సదరు నిందితుడు. దీనిపై సీబీఐ స్పందిస్తూ వివేక హత్య కేసు విచారణ కీలక దశలో ఉందని పేర్కొంది.
సాధారణంగా నిందితుల అరెస్టులు, బెయిల్ ల విషయంలో సీబీఐ ఎప్పుడూ ఇదే తరహాలోనే చెబుతూ ఉంటుంది. ఈ కేసు మాత్రమే కాదు.. ప్రతి కేసు విషయంలోనూ ఇలాంటి లీకులే వస్తుంటాయి. నిందితుల ఇళ్లపై సీబీఐ సోదాలు అని, కీలక పత్రాలు స్వాధీనం అనే మాట తరచూ పేపర్లలో చదువుతూ ఉంటారంతా. మరి వివేక హత్య కేసు విషయంలో ఇది కీలక సమయం అని, నిందితుడికి బెయిల్ వద్దని సీబీఐ వాదించింది.
అది పెద్ద ఆశ్చర్యం కాదు కానీ, ఈ కేసు విచారణలో తాము ప్రముఖులను అరెస్టు చేయనున్నట్టుగా కోర్టుకు సీబీఐ నివేదించడం ఆసక్తిదాయకమైన అంశం. మరి ఆ ప్రముఖులు ఎవ్వరో!