ఈ నెల ఏడో తేదీతో ఐదు రాష్ట్రాల ఎన్నికల పోలింగ్ ముగియనుంది. యూపీలో చివరి విడత పోలింగ్ మార్చి ఏడో తేదీన ముగుస్తుంది. సరిగ్గా అదే రోజు సాయంత్రమే పెట్రో ధరల్లో భారీ పెంపు ఖాయమని తెలుస్తోంది. గత నాలుగు నెలలుగా పెట్రో ధరలు స్థిరంగా ఉన్నాయి. తీవ్ర స్థాయికి చేరిన ఈ బాదుడుపై సర్వత్రా విమర్శలు వస్తున్న క్రమంలో కాస్త ధర తగ్గించి, ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వాలపై రాజకీయం మొదలుపెట్టింది కేంద్రం.
ఇంతలో యూపీ ఎన్నికలు షెడ్యూల్ అయ్యాయి. రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని వ్యూహాత్మకంగా మళ్లీ పెట్రో ధరలను కదిలించలేదు. మరి తుఫాను ముందు నిశ్శబ్ధం ఈ నెల ఏడో తేదీతో ముగియడం ఖాయంగా కనిపిస్తోంది. పోలింగ్ సాయంత్రం ఐదు గంటలకు పూర్తవ్వనుండగా, ఆ రోజు అర్ధరాత్రి నుంచినే పెట్రో ధరలు భారీగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఈ సారి లీటరుపై బాదుడు ఏడెనిమిది రూపాయల వరకూ ఉండవచ్చని అంచనాలు వినిపిస్తున్నాయి. గత నాలుగు నెలల పెంపునూ ఒకేసారి పూర్తి చేసేలా ఉన్నారు. ఎన్నికల రాజకీయంలో భాగంగా ఇన్నాళ్లూ కాస్త ఊరట ఇచ్చారు. ఇప్పుడు కీలకమైన రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు అయిపోతున్నాయి ఇక బాదుడుకు తిరుగే ఉండకపోవచ్చు.
ఈ బాదుడు ఇకపై ఒకసారితో ఆగకపోవచ్చు కూడా. రాబోయే రోజుల్లో పెట్రో పన్నుల నుంచి కేంద్రం పిండుకునే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఇదే ఊపులో లీటర్ పెట్రోల్ ధర అతి త్వరలోనే 150 రూపాయలను దాటేయవచ్చు. ఎలాగూ రీజన్లు చెప్పడానికి రష్యా – ఉక్రెయిన్ యుద్ధం వంటి కారణాలు వాట్సాప్ యూనివర్సిటీ అమ్ముల పొదిలో ఉండనే ఉన్నాయిగా!