తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నాయకుడు జేసీ ప్రభాకర్‌రెడ్డి మధ్య వివాదం మరోసారి తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. అసలే తాడిపత్రి అంటే ఎప్పుడూ రాజకీయ వివాదాలకు పెట్టింది పేరు. తాడిపత్రిలో పెద్దారెడ్డి ఎన్నికలకు ముందు అడుగు పెట్టినప్పటి నుంచి మాటల తూటాలు పేలుతూనే ఉన్నాయి.
తాడిపత్రిలో జేసీ బ్రదర్స్ ఆగడాలను ఎదుర్కొనే దీటైన నాయకుడిగా పెద్దారెడ్డిని ఆ నియోజకవర్గ ప్రజలు ఆదరించారు. సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఆ నియోజకవర్గంలో ఒకరి హత్య జరిగిన విషయాన్ని విస్తరించొద్దు.
తాజాగా సోషల్ మీడియాలో ఓ పోస్టు మరోసారి టీడీపీ, వైసీపీ మధ్య పరస్పరం దాడులకు కారణమైంది. తప్పొప్పులను పక్కన పెడితే రెండు కుటుంబాల మధ్య ఆధిపత్య పోరు, అనుచరులను మానసికంగా కుంగదీస్తోందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తాడిపత్రిలో చోటు చేసుకున్న ఉద్రిక్త పరిస్థితులపై కడప జిల్లా సీనియర్ బీజేపీ నాయకుడు, మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి స్పందించారు.
తాడిపత్రిలో పెద్దిరెడ్డి, జేసీ ఇద్దరిది తప్పేనని కడప పెదరాయుడైన ఆదినారాయణరెడ్డి తీర్పు చెప్పారు. పెద్దారెడ్డి రచ్చకు పోయి చర్చలకు వెళ్లానని చెప్పడం విచిత్రంగా ఉందని ఆయన అన్నారు. పెద్దారెడ్డికి ప్రత్యక్షంగా పోలీసుల సహకారం ఉందని పెద్దారెడ్డి ఆరోపించారు.
ఈ ఫ్యాక్షన్ సంస్కృతి పోవాలంటే ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ అధికారంలోకి రావాలని ఆదినారాయణరెడ్డి ముక్తాయింపు ఇచ్చారు. ఇంతకూ ఎన్నికలొచ్చే సమయానికి ఆదినారాయణరెడ్డి బీజేపీలోనే కొనసాగుతారా?