అప్పటికి చిరంజీవికి పెళ్లి కాలేదు. సురేఖను ఇచ్చి చేయాలని అల్లు రామలింగయ్య అనుకుంటున్న రోజులవి. అలాంటి టైమ్ లో ఓ అనుకోని ఘటన జరిగింది. చిరంజీవి చేతిలో హీరోయిన్ మంజుభార్గవి చెంగు ఉండగా, రామలింగయ్య చూశారు. ఈ విషయాన్ని స్వయంగా చిరంజీవి బయటపెట్టారు.
కెరీర్ స్టార్టింగ్ లో చిరంజీవి, మంజుభార్గవి కలిసి ఓ సినిమా చేశారు. ఆ స్నేహం కొద్దీ తను నటించిన శంకరాభరణం సినిమా ప్రీమియర్ షోకు చిరంజీవిని ఆహ్వానించారు మంజుభార్గవి. అప్పటికి చిరంజీవికి కె.విశ్వనాధ్, సోమయాజులు ఎవ్వరూ తెలియదు. కేవలం మంజుభార్గవి పిలిచారని వెళ్లారు. ఆ టైమ్ లో జరిగిన ఓ ఘటన అల్లు రామలింగయ్య కంట్లో పడింది.
“ఫస్ట్ టైమ్ నేను థియేటర్ లో సినిమా చూస్తూ ఏడ్చేసిన మూవీ శంకరాభరణం. క్లైమాక్స్ కు వచ్చేసరికి కన్నీళ్లు ఆగలేదు. లైట్లు వేసే లోపు కన్నీళ్లు తుడుచుకుందామని తడుముకుంటున్నాను. పక్క నుంచి మంజుభార్గవి తన చీర చెంగు అందించింది.
దాంతో కళ్లు తుడుచుకుంటుండగా లైట్లు ఆన్ అయ్యాయి. ఆమె చీర చెంగు నా చేతిలో ఉంది. అల్లు రామలింగయ్య కుటుంబం కూడా వచ్చింది. నా చేతిలో మంజుభార్గవి చీర చెంగు ఉండడం వాళ్లు చూసే ఉంటారు.”
ఆ ఘటన జరిగిన 2-3 నెలలకే చిరంజీవికి సురేఖ పెళ్లి సంబంధం వచ్చింది. బహుశా ఆ రోజు తన చేతిలో మంజుభార్గవి చీర చెంగు ఉన్న సంగతి ఎవ్వరూ సురేఖకు చెప్పి ఉండరని, అందుకే తనకు పెళ్లి అయిందని చిరంజీవి అభిప్రాయపడ్డారు. ఇక సినిమాల పరంగా చిరంజీవి ఏడ్చిన మరో సందర్భం కూడా ఉంది.
“నా సొంత సినిమాల విషయానికొస్తే, వేట అనే సినిమా గురించి నేను బాగా ఏడ్చాను. అందులో ఎమోషనల్ సీన్స్ ఉన్నాయని నేను ఏడవలేదు. అది అట్టర్ ఫ్లాప్ అయిందని ఇంట్లో దుప్పటి కప్పుకొని వెక్కివెక్కి ఏడ్చాను. ఖైదీ లాంటి సక్సెస్ తర్వాత, భారీ అంచనాల మధ్య అదే బ్యానర్ లో వచ్చిన సినిమా కావడంతో నేను కూడా బాగా అంచనాలు పెట్టుకున్నాను. సూపర్ ఫ్లాప్ అవ్వడంతో బాగా బాధపడ్డాను.”
ఇలా తను బాగా ఏడ్చిన సినిమాల సంగతుల్ని బయటపెట్టారు చిరంజీవి. అయితే ఇప్పటికీ విజేత సినిమా క్లైమాక్స్ చూస్తే తన కళ్లు చెమర్చుతాయని.. తనకు ఎమోషనల్ గా బాగా కనెక్ట్ అయిన సినిమా అదేనని అంటున్నారు చిరంజీవి.