మేనత్త భర్త, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి కోరికను టాలీవుడ్ అగ్రహీరో జూనియర్ ఎన్టీఆర్ నెరవేర్చారు. ఎన్టీఆర్ శతజయంతి వేడుకలకు జూనియర్ ఎన్టీఆర్ ఎట్టి పరిస్థితుల్లోనూ రాకుండా చూడాలని చంద్రబాబు కోరుకున్నారు. ఆయన కోరుకున్నట్టే జూనియర్ నడుచుకోవడం విశేషం.
ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే… శత జయంతి వేడుకలకు టీడీపీ జూనియర్ ఎన్టీఆర్‌ను ఆహ్వానించినట్టు సమాజం దృష్టిలో వుండాలి. ఇదే సందర్భంలో ఆయన రాలేని పరిస్థితిని క్రియేట్ చేయాలి. అంతా పక్కా ప్లాన్ ప్రకారమే జూనియర్ ఎన్టీఆర్ పుట్టిన రోజు ఎన్టీఆర్ శతజయంతి వేడుకలను హైదరాబాద్‌లో నిర్వహించ తలపెట్టారు.
దీంతో ముందస్తు షెడ్యూల్ ప్రకారం శత జయంతి వేడుకలకు రాలేనని జూనియర్ ఎన్టీఆర్ ముందే చెప్పారు. జూనియర్ ఎన్టీఆర్ గైర్హాజరు ఆయనతో పాటు సీనియర్ ఎన్టీఆర్ అభిమానులకు నిరాశ కలిగిస్తోంది. కానీ చంద్రబాబునాయుడు, నందమూరి బాలయ్య, లోకేశ్ తదితరులకు మాత్రం సంతోషాన్ని నింపినట్టు టీడీపీలో అంతర్గత చర్చ జరుగుతోంది.
టీడీపీకి పూర్వ వైభవం రావాలంటే జూనియర్ ఎన్టీఆర్‌కు పార్టీలో క్రియాశీలక బాధ్యతలు అప్పగించాలనే డిమాండ్ ఉంది. దివంగత ఎన్టీఆర్ వారసుడిగా లోకేశ్‌ను టీడీపీ శ్రేణులు చూడలేకపోతున్నాయి. ఎన్టీఆర్ వారసుల్లో జూనియర్ ఎన్టీఆర్ అయితేనే మళ్లీ టీడీపీని బతికించగలరన్న ఆశ, అభిప్రాయం బలంగా ఉన్నాయి. అందుకే ఆ మధ్య చంద్రబాబు, లోకేశ్ సభల్లో జూనియర్ ఎన్టీఆర్‌ను రప్పించి, రాష్ట్రమంతా తిప్పాలనే డిమాండ్స్ పెద్ద ఎత్తున వచ్చాయి. జూనియర్ ఎన్టీఆర్‌ను పార్టీలోకి తీసుకోవడం అంటే లోకేశ్‌ను పక్కన పెట్టడమే అనే అభిప్రాయం వుంది.
దీంతో కొడుకు కోసం జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ భవిష్యత్‌ను అమానవీయంగా చంద్రబాబు చంపేశారనే విమర్శలున్నాయి. తాజాగా ఎన్నికల సీజన్ కావడంతో ఎన్టీఆర్ నామస్మరణ తప్పడం లేదు. ఎన్టీఆర్ శతజయంతి వేడుకలకు ఆయన కుటుంబ సభ్యులందరినీ ఆహ్వానించారు. జూనియర్ ఎన్టీఆర్ మే 20న పుట్టిన రోజు జరుపుకునేందుకు ఇతర ప్రాంతానికి వెళుతున్నారని తెలుసుకునే, అదే రోజు శతజయంతి వేడుక నిర్వహించేందుకు చంద్రబాబు చక్రం తిప్పారు. చంద్రబాబు మేధస్సు ఎన్టీఆర్ వారసులను బాగా ఉపయోగపడుతోంది. ఇందుకు ఎన్టీఆర్ వారసులే పావులా ఉపయోగపడడం గమనార్హం.
మొత్తానికి చంద్రబాబు కోరుకున్నట్టుగానే జూనియర్ ఎన్టీఆర్ ఆ సభకు వెళ్లడం లేదు. భవిష్యత్‌లో జూనియర్ ఎన్టీఆర్‌పై విమర్శలకు ఇదో అస్త్రంగా కూడా ఉపయోగపడుతుందని చంద్రబాబు, లోకేశ్ సంబరపడుతుంటారు. తాతయ్య శతజయంతి వేడుక కంటే, పుట్టిన రోజే ముఖ్యమా? అని ట్రోల్ చేయించడానికి తండ్రీకొడుకులకు జూనియర్ ఎన్టీఆర్ అవకాశం ఇచ్చారని అంటున్నారు.
అయితే చంద్రబాబు, లోకేశ్ వ్యూహాలు తెలియనంత అమాయకుడు జూనియర్ ఎన్టీఆర్ కాదనే వాదన లేకపోలేదు.