టీడీపీ అధినేత చంద్రబాబు వ్యవహారం చూస్తే ఆయన కొత్తగా రాజకీయాల్లోకి రాలేదు. ఉమ్మడి ఏపీలో తొమ్మిదేళ్ల పాటు సీఎంగా పనిచేశారు, విభజన ఏపీలో అయిదేళ్ళ పాటు ముఖ్యమంత్రిగా ఉన్నారు. అలాంటి పెద్ద మనిషి ఇంకా తాను అది చేయాలనుకున్నాను, ఇది చేయాలనుకున్నాను అని చెప్పడం అంటే ఎలా ఆలోచించాలో మరి. ఎందుకంటే చంద్రబాబు చేద్దామనుకున్న హైదరాబాద్ లో చేశారు అమరావతిలో కూడా ఏదో చేయాలని తపన పడ్డారు.
మరి ఉత్తరాంధ్రాకు ఏదైనా చేయాలనుకుంటే ఎవరు అడ్డుపడ్డారో ఆయనే చెప్పాలి. నేను ఐటీ హబ్ గా టూరిజం హబ్ గా ఆర్ధిక రాజధానిగా విశాఖను తీర్చిదిద్దాలనుకున్నాను అంటూ చంద్రబాబు జనాల ముందు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఆయనకు పద్నాలుగేళ్ల పాటు సీఎం గా అవకాశాన్ని జనాలు ఇచ్చారు. ఉత్తరాంధ్రా జనం అయితే మెజారిటీ సీట్లు ఇచ్చి బ్రహ్మరథం పట్టారు. అంత చేసిన ఉత్తరాంధ్రాకు ఫలానాది చేశాను అని చెప్పకుండా ఇంకా చేయాలని అనుకుంటున్నాను అని బాబు చెప్పడంలోనే టీడీపీ ఏలుబడిలోని డొల్లతనం అర్ధమవుతోంది అంటున్నారు.
ఉత్తరాంధ్రాకు జగన్ శనిలా దాపురించారని బాబు అక్కసు వెళ్లగక్కారు జగన్ 2019లో సీఎం అయ్యారు. మరి 1995లో జగన్ లేరు కదా. అపుడెందుకు ఉత్తరాంధ్రాకు గట్టి మేలు చేయలేకపోయారు బాబూ అని జనాలు అడుగుతున్నారు దానికి తగిన జవాబు అయితే టీడీపీ వద్ద లేదు.
అయినా సరే మరో చాన్స్ అంటున్నారు. మళ్లీ అయిదేళ్ళు సీఎం గా చేస్తే ఉత్తరాంధ్రాను నందనవనంగా చేస్తాను అని చంద్రన్న చెబుతున్నారు. దీన్ని ప్రజలు ఎంత వరకూ నమ్ముతారో వచ్చే ఎన్నికలే తీర్పు చెప్పాలి. ఎప్పటికి అపుడు కన్వీనియెంట్ గా ఎదురు పక్షాన్ని ప్రత్యర్థులను విమరిస్తూ తాను సుద్ధ పూసను అని చెప్పే వర్తమాన రాజకీయాన్ని జనాలు ఎలా రిసీవ్ చేసుకుంటారో ఆలోచించాలి.