ఏపీ ప్రజానీకానికి శుభవార్త. ఎక్కడున్నా రిజిస్ట్రేషన్ సౌకర్యం అందుబాటులోకి రాబోతోంది. ఇంటర్నెట్ సౌకర్యం అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో రిజిస్ట్రేషన్ కార్యాలయానికి రాకుండా, స్థలాలు, పొలాల రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు ఏపీ ప్రభుత్వం చొరవ చూపింది. ఇప్పటికే రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు వెళ్లకుండా గ్రామ సచివాలయాల్లోనే రిజిస్ట్రేషన్ చేసుకునే వెసలుబాటును జగన్ సర్కార్ కల్పించిన సంగతి తెలిసిందే.
ఇది మరింత సులువు చేసేందుకు జూన్ ఒకటో తేదీ నుంచి రిజిస్ట్రేషన్ విధానంలో విప్లవాత్మక మార్పునకు శ్రీకారం చుట్టడం విశేషం. ఈ మొత్తం ప్రక్రియలో ఆస్తి ఉన్న సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ అధికారి సానుకూల నిర్ణయం కీలకం. ఎందుకంటే ఆన్లైన్లో అన్నీ సరిచేసుకున్న తర్వాత, దస్తావేజులు సరిగా ఉన్నాయని సబ్ రిజిస్ట్రార్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల్సి వుంటుంది.
ఎనీవేర్ రిజిస్ట్రేషన్ ప్రక్రియలో సదరు ఆస్తికి సంబంధించి వివరాలను ఆన్లైన్లో సంబంధిత రిజిస్ట్రేషన్ అధికారి నిర్ధారించుకోవాల్సి వుంటుంది. ఒకవేళ ఆస్తి ఉన్న సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ అధికారి పెండింగ్లో పెడితే ఏమీ చేయలేం. ఆస్తికి సంబంధించిన వివరాలు సక్రమంగా లేకపోతే పెండింగ్లో పెట్టే అవకాశాలుంటాయి. కావున అన్నీ సరిచూసుకున్న తర్వాతే రిజిస్ట్రేషన్ ప్రక్రియ సులువవుతుంది.
ఈ ప్రక్రియ అందుబాటులోకి రావడం వల్ల సుదూర ప్రాంతాల నుంచి అదే పనిగా రిజిస్ట్రేషన్ చేసేందుకు ఆస్తి ఉన్న సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లాల్సిన అవసరం లేదు. తానున్న ప్రాంతం నుంచే రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయవచ్చు. ఈ ప్రక్రియ మొదలు కానుండడం శుభపరిణామం. ఎందుకంటే వ్యయ ప్రయాసలు బాగా తగ్గుతాయి.