కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి ఆరోగ్యంపై దుష్ప్రచారం తగదని కర్నూలు మాజీ ఎమ్మెల్యే, వైసీపీ సీనియర్ నాయకుడు ఎస్వీ మోహన్‌రెడ్డి అన్నారు. తన తల్లి అనారోగ్యంతో బాధపడుతున్నారని, ఆమె యోగక్షేమాలు చూసుకోవాల్సిన బాధ్యత తనపై వుందని, మరోసారి విచారణకు వస్తానని సీబీఐకి అవినాష్‌రెడ్డి లేఖ రాసిన సంగతి తెలిసిందే. శుక్రవారం ఆయన సీబీఐ విచారణకు కావాల్సి వుండగా, చివరి నిమిషంలో తల్లికి బాగా లేదనే సమాచారంతో గైర్హాజరయ్యారు.
ఈ నేపథ్యంలో పులివెందులకు బయల్దేరిన అవినాష్‌రెడ్డి మార్గమధ్యంలో తాడిపత్రి వద్ద తల్లి లక్ష్మమ్మను పరామర్శించారు. తల్లితో పాటు అంబులెన్స్‌లో కర్నూలుకు వెళ్లారు. అక్కడ ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో తల్లిని చేర్పించి, చికిత్స అందిస్తున్నారు. అయితే కొందరు అవినాష్‌రెడ్డికి ఆరోగ్యం బాగా లేదని దుష్ప్రచారం మొదలు పెట్టారు.
ఈ క్రమంలో కర్నూలులో చికిత్స పొందుతున్న అవినాష్‌రెడ్డి తల్లిని మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ అవినాష్ ఆరోగ్యంగా ఉన్నారన్నారు. ఆయన ఆరోగ్యంపై విష ప్రచారం చేయడం తగదన్నారు. తల్లి ఆరోగ్యం గురించి అవినాష్‌రెడ్డి ఆందోళన చెందుతున్నారన్నారు. ఆమె త్వరగా కోలుకుంటారని వైద్యులు తనతో చెప్పారన్నారు.
సీబీఐ విచారణకు గైర్హాజరయ్యారనే కారణంతో అవినాష్‌రెడ్డిపై లేనిపోని కథనాలను ఒక వర్గం మీడియా పనిగట్టుకుని చేస్తోంది. పచ్చ మీడియా దూకుడు చూస్తుంటే, వాళ్లే అరెస్ట్ చేసేలా కనిపిస్తోందనే సెటైర్స్ పేలుతున్నాయి.