రామోజీదీ…ఇదీ సంగ‌తి!

రూ.2 వేల నోటుపై చాలా కాలంగా అంద‌రూ అనుమానిస్తున్న‌ట్టే జ‌రిగింది. న‌ల్ల‌ధ‌నాన్ని అరిక‌ట్ట‌డానికి, ఇంకా ఏవేవో పెద్ద‌పెద్ద మాట‌ల‌ను ప్ర‌ధాని మోదీ చెప్పి పెద్ద నోట్లను ర‌ద్దు చేశారు. పెద్ద నోట్ల‌ను ర‌ద్దు చేసి…

రూ.2 వేల నోటుపై చాలా కాలంగా అంద‌రూ అనుమానిస్తున్న‌ట్టే జ‌రిగింది. న‌ల్ల‌ధ‌నాన్ని అరిక‌ట్ట‌డానికి, ఇంకా ఏవేవో పెద్ద‌పెద్ద మాట‌ల‌ను ప్ర‌ధాని మోదీ చెప్పి పెద్ద నోట్లను ర‌ద్దు చేశారు. పెద్ద నోట్ల‌ను ర‌ద్దు చేసి చిన్న నోట్ల‌ను ఏమైనా తెచ్చారా? అంటే … అబ్బే అదేం లేదు. రూ.500 నోట్‌ను ర‌ద్దు చేసి, మ‌ళ్లీ అదే నోటు, వెయ్యి నోటును ర‌ద్దు చేసి, ఏకంగా రూ.2 వేల నోటును తీసుకొచ్చి దేశం మొత్తాన్ని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు. ఈ చ‌ర్య‌తో బ్లాక్ మ‌నీని ఎలా అరిక‌డ‌తార‌బ్బా అని అంద‌రూ సంశ‌యించారు.

న‌ల్ల‌ధ‌నాన్ని అరిక‌ట్ట‌లేక పోయార‌ని తేలిపోయింది. అప్ప‌ట్లో నోట్ల ర‌ద్దుతో దేశ‌మంతా రోజుల త‌ర‌బ‌డి బ్యాంకులు, ఏటీఎం సెంట‌ర్ల వ‌ద్ద ప్ర‌జానీకం గంట‌ల‌కొద్ది నిల‌బ‌డాల్సి వ‌చ్చింది. దేశంలో న‌ల్ల‌ధ‌నంరాయుళ్ల భ‌ర‌తం ప‌ట్ట‌డానికే ప్ర‌ధాని మోదీ ఈ చ‌ర్య తీసుకున్నార‌ని, క్యూలైన్ల‌లో ఆ మాత్రం క‌ష్టాలు ప‌డ‌లేమా? అని చాలా వ‌ర‌కు స‌రిపెట్టుకున్నారు. చివ‌రికి ప్ర‌జ‌ల‌కు క‌ష్టాలే త‌ప్ప‌, దేశానికి ఒరిగిందేమీ లేద‌ని తెలుసుకున్నాక‌… ఏంటో బీజేపీ ప్ర‌భుత్వం అని మ‌న‌సులోనే తిట్టుకున్నారు.

తాజాగా రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) రూ.2 వేల నోటును ఉప‌సంహ‌రించుకుంది. ఫైన‌ల్‌గా రూ.2 వేల నోటు ఇక కాల‌గ‌ర్భంలో క‌లిసిపోనుంది. క్లీన్ నోట్ పాల‌సీ కింద ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు ఆర్‌బీఐ వెల్ల‌డించింది. 2018, మార్చి 31 నాటికి గ‌రిష్టంగా రూ.6.73 ల‌క్ష‌ల కోట్లు మేర రూ.2 వేల నోట్లు చ‌లామ‌ణిలో ఉన్నాయి. చ‌లామ‌ణిలో ఉన్న న‌గ‌దులో ఇది 37.3 శాతం అని లెక్క‌లు చెబుతున్నాయి. అలాగే 2023, మార్చి 31 నాటికి రూ.3.62 ల‌క్ష‌ల కోట్ల‌కు త‌గ్గిపోయాయి. అంటే చ‌లామ‌ణిలో 10.8 శాతానికి త‌గ్గింది. ఈ నోట్ల‌ను సాధార‌ణ లావాదేవీల‌కు ఉప‌యోగించ‌లేద‌ని ఈ గ‌ణాంకాలు స్ప‌ష్టం చేస్తున్నాయి.

రూ.2 వేల నోట్లను వెన‌క్కి తీసుకోవ‌డంపై ఈనాడు ప‌త్రిక‌లో కార్టూన్ ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోంది. మాకిరెడ్డి అనే కార్టూనిస్ట్ ప్ర‌ధాని మోదీపై రాజ‌గురువు రామోజీరావు కంటే మిన్న‌గా రాజ‌భ‌క్తిని ప్ర‌ద‌ర్శించాడు. ఆర్‌బీఐ నాణెంపై ప్ర‌ధాని మోదీ పులిపై స్వారీ చేస్తున్న చిత్రం. అలాగే ఆర్బీఐ నోట్ల ర‌ద్దు, నోట్ల ఉప‌సంహ‌ర‌ణ చేసిన‌ట్టు పేర్కొన్నారు. కార్టూనిస్ట్ కామెంట్ …రామోజీరావు అంత‌రంగాన్ని ప్ర‌తిబింబించేలా వుంది. ఏమున్న‌దంటే…

“ఆక‌లిగా ఉందా!.. ఇంకెంతో దూరం లేదులే… త్వ‌ర‌గా వెళ్లి న‌ల్ల‌ధ‌నంరాయుళ్ల‌ను అంతం చెయ్‌…!!!” అని పులితో మోదీ అన్న‌ట్టుగా కార్టూన్‌ను తీర్చిదిద్దారు. న‌ల్ల‌ధ‌నం రామోజీ ద‌గ్గ‌ర వుందేమో అని నిన్న మాజీ ఎంపీ ఉండ‌వ‌ల్లి అరుణ్‌కుమార్ ఘాటు ఆరోప‌ణ‌లు చేశారు. ఒక‌వైపు చెలామ‌ణిలో చాలా త‌క్కువ మొత్తం వుంద‌ని వార్త‌లు రాస్తూ, మ‌రోవైపు అదే ప‌త్రిక కార్టూన్‌లో మాత్రం న‌ల్ల‌ధ‌నంరాయుళ్ల‌పై వేటాడుతున్న‌ట్టు చిత్రీక‌రించ‌డం దేనికి నిద‌ర్శ‌నం?

ముమ్మాటికీ ఈ కార్టూన్ కేంద్రంలో అధికారం చెలాయిస్తున్న బీజేపీ మ‌న‌సు చూర‌గొన‌డానికే త‌ప్ప‌, ప్ర‌జాభిప్రాయాన్ని ప్ర‌తిబింబించేలా లేద‌నే విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. ఒక‌ప్పుడు ఈనాడులో శ్రీ‌ధ‌ర్ వేసే కార్టూన్ల కోసం పాఠ‌కులు ఎదురు చూసేవాళ్లు. వ‌ర్త‌మాన రాజ‌కీయ అంశాల‌పై శ్రీ‌ధ‌ర్ వ్యంగ్య కార్టూన్ల కోస‌మే ఈనాడు ప‌త్రిక‌ను చ‌దివేవాళ్లు. మ‌రిప్పుడో? తాను మీ ప‌క్ష‌మే అని పాల‌కుల‌కు చెప్పుకోడానికి కార్టూన్ల‌లో సైతం అధికారానికి సాష్టాంగ ప‌డ‌డం ప‌చ్చ ప‌త్రికకే చెల్లింది. 

ఈనాడులో కార్టూన్ల‌ను ఇదీ సంగ‌తి శీర్షిక కింద అచ్చు వేస్తుంటారు. తాజా కార్టూన్ ఉద్దేశం ఏంటో అర్థం చేసుకోవ‌డం పెద్ద స‌మ‌స్య కాదు. ప్ర‌స్తుతం మార్గ‌ద‌ర్శి కేసుల్లో ఇరుక్కున్న రామోజీ ద‌య‌నీయ స్థితిని కార్టూన్ తెలియ‌జేస్తోంది. ఆ కేసులే లేక‌పోతే… బ‌హుశా ఇలాంటి కార్టూన్ ఈనాడులో వ‌చ్చేది కాదేమో!