మరింతగా దిగజారిపోతున్న బీజేపీ!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి ఉన్న ఓటు బ్యాంకు ఒక్క శాతం మాత్రమే. ‘మా తాతలు నేతులు తాగారు.. మా  మూతులు వాసన చూడండి’ అనే సామెత చందంగా.. కేంద్రంలో మా సర్కారు…

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి ఉన్న ఓటు బ్యాంకు ఒక్క శాతం మాత్రమే. ‘మా తాతలు నేతులు తాగారు.. మా  మూతులు వాసన చూడండి’ అనే సామెత చందంగా.. కేంద్రంలో మా సర్కారు వైభవంగా పనిచేస్తోంది.. మమ్మల్ని ఆదరించండి అని కమల నాయకులు చెప్పుకునే మాటలను ఏపీ ప్రజలు ఈసడించుకుంటున్నారు. 

నరేంద్రమోడీని నానా బూతులు తిట్టిపోసిన చంద్రబాబునాయుడుతో మళ్లీ చెట్టపట్టాలు వేసుకోవడానికి సిద్ధమవుతున్న వారి అసమర్థ వైఖరికూడా ఆ పార్టీ పట్ల ప్రజల్లో అసహ్యాన్ని పుట్టిస్తోంది. ఇలాంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద చార్జిషీట్లు వేస్తాం.. జిల్లాల్లో నియోజకవర్గాల్లో కూడా వేస్తాం అంటూ బిజెపి చేస్తున్న కామెడీ మరింతగా వారి పరువు తీస్తోంది.

భారతీయజనతా పార్టీ పరిస్థితి లో ఏపీలో దయనీయంగా ఉంది. దక్షిణాది రాష్ట్రాల పట్ల వివక్షతో వ్యవహరించే ఆ పార్టీకి పొరబాటున కర్ణాటకలో అధికారం గతంలో దక్కింది. అక్కడి ప్రజలు కూడా అర్థం చేసుకుని తాజాగా మట్టి కరిపించారు. ఏపీ భాజపా నాయకులు.. కేంద్రంలో తమ ప్రభుత్వం ఉన్నప్పటికీ.. జీవితంలో ఎప్పుడూ రాష్ట్రప్రయోజనాల గురించి మాట్లాడకుండా, ఏపీ కోసం కేంద్రంనుంచి వీసమెత్తు మేలు రాబట్టకుండా.. మోడీ భజన చేసుకుంటూ కాలంగడపాలని చూస్తుంటారు.

రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఇవ్వలేదని మోడీని నానా చండాలంగా తిట్టిపోసిన చంద్రబాబు పల్లకీ మోయడానికి ఇప్పుడు వారు మళ్లీ సిద్ధపడుతున్నారు.

నిన్నటిదాకా చంద్రబాబు వైఫల్యాలను దెప్పిపొడిచిన సోము వీర్రాజు కూడా.. ఇప్పుడు సైలెంట్ అయిపోయారు. పొత్తుల మాటెత్తితే మా పార్టీ పొత్తుల సంగతి అధిష్టానం చూసుకుంటుంది అంటున్నారు. జగన్ మీద చార్జిషీట్లు అంటూ చంద్రబాబు మీద పల్లెత్తు మాటనడం లేదు.

బిజెపి.. తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుంటుందని పవన్ కల్యాణ్ ప్రకటించేస్తే.. ఆయనెవరు ప్రకటించడానికి, మా పార్టీ పొత్తులు మా అధిష్టానం ఇష్టం.. పవన్ ఎలా ప్రకటిస్తారు.. అని చెప్పగల దమ్ము బిజెపికి లేదు. పవన్ కల్యాణ్ చరిష్మా ద్వారా రాగల ఒకటీ అరా ఓట్ల కోసం బిజెపి పవన్ పాదాల వద్ద దేబిరిస్తున్నట్టుగా ఆయన మాటలకు జై కొడుతున్నట్టుగా కనిపిస్తోంది. 

ఇటు చంద్రబాబును మాట అనలేక, పవన్ తమను పొత్తుల ఉచ్చులోకి బహిరంగంగా లాగేస్తోంటే కాదనలేక అవుననలేక.. ఏమీ చేతగాని పార్టీ మాదిరిగా బిజెపి తమ పరువు తామే పోగొట్టుకుంటోంది.