రూ.2వేల నోట్లపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నోట్లను చలామణిలో నుండి తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ప్రజలు వారి వద్దనున్న రూ.2వేల నోట్లను ఈనెల 23వ తేదీ నుంచి సెప్టెంబర్ 30లోగా బ్యాంకుల్లో మార్చుకోవచ్చని పేర్కొంది. ప్రజలు ఒకసారి గరిష్టంగా రూ. 20వేల వరకు మాత్రమే డిపాజిట్ చేసుకోవచ్చని ఆర్బీఐ ప్రకటించింది.
బ్యాంకులు కూడా ఖాతాదారులకు రూ. 2వేల నోట్లు ఇవ్వొద్దని ఆర్బీఐ సృష్టం చేసింది. కాగా 2018-19లో రూ.2000 నోట్ల ముద్రణ నిలిపివేసింది ఆర్బీఐ. అప్పటి నుండే రూ.2000 నోట్లపై అయోమయం నెలకొంది. గత కొంత కాలంగా ఏటీఎంలల్లో కూడా ఈ నోట్లు పెద్దగా కనిపించడం లేదు. ఇవాళ వాటి సర్క్యులేషన్ నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది.
కాగా భారత ప్రభుత్వం 2016 నవంబర్ లో రూ. 500, రూ. 1000 నోట్లను రద్దు చేసిన విషయం తెలిసిందే. పాత నోట్లను రద్దు చేసిన వెంటనే కొత్తగా రూ. 500, రూ. 2000 నోట్లను ప్రింట్ చేసింది. పెద్ద నోట్ల వినియోగం వల్ల నకిలీ నోట్ల వ్యాప్తికి దారితీస్తుందని ఎప్పటినుంచో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.