సోషల్ మీడియాలో ఓ పోస్టు తాడిపత్రిలో తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. సోషల్ మీడియాలో తనపై తప్పుడు ప్రచారం చేస్తున్న వాళ్ల సంగతేంటో చూడాలని తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఏకంగా తన ప్రత్యర్థి జేసీ ప్రభాకర్‌రెడ్డి ఇంటికే వెళ్లడం తీవ్ర దుమారం రేపుతోంది.
జేసీ బ్రదర్స్‌కు అనంతపురం జిల్లా తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి భారీ షాక్ ఇచ్చారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా మొట్టమొదటిసారిగా తమ నాయకులను పెద్దారెడ్డి అవమానించారని జేసీ బ్రదర్స్ అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
జేసీ ప్రభాకర్‌రెడ్డి ఇంటిపైకి పెద్దారెడ్డి స్వయంగా దాడికి వచ్చారని వారి అనుచరులు ఆరోపిస్తుంటే, తమ నాయకుడిపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తుండడంపై ప్రశ్నించడానికి మాత్రమే వెళ్లాడని పెద్దారెడ్డి అనుచరులు చెబుతున్నారు. మొత్తానికి తాడిపత్రిలో ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితులు నెలకున్నాయి.
సోషల్ మీడియాలో ఇద్దరు యువకులు ఎమ్మెల్యేపై అభ్యంతరకర పోస్టులు పెట్టారు. వాళ్లిద్దరూ జేసీ ప్రభాకర్‌రెడ్డి ఇంట్లో తలదాచుకుంటున్నారనే సమాచారంతో పెద్దారెడ్డి అక్కడికి వెళ్లారు. ప్రభాకర్‌రెడ్డి ఇంట్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిలో ఒకడైన దాసరి కిరణ్ యువకుడిని పెద్దారెడ్డి అనుచరులు చితకబాదారు.
జేసీ వర్గీయులు కూడా ఎదురుదాడికి దిగడంతో పరిస్థితి ఉద్రిక్తతకు దారి తీసింది. ఇరు వర్గాలు పరస్పరం రాళ్లదాడికి తెగబడ్డాయి. ఈ ఘటనలో పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంట్లో పెద్దారెడ్డి కూర్చున్న కుర్చీని జేసీ అనుచరులు తగులబెట్టారు.
కాగా ఈ ఘటన గురించి తెలిసిన వెంటనే జేసీ ప్రభాకర్‌రెడ్డి, ఆయన తనయుడు నేరుగా ఇంటికి చేరుకున్నారు. తన ఇంటిపైకి పెద్దారెడ్డి దాడికి రావడంపై ప్రభాకర్‌రెడ్డి ఘాటుగా స్పందించారు. తాము ఇంట్లో లేని విషయాన్ని తెలుసుకుని పెద్దారెడ్డి వచ్చాడన్నారు. తాము ఇంట్లో లేనప్పుడు ఆడామగా కానివాళ్లు కూడా వస్తారన్నాడు. పెద్దారెడ్డి ఎంత మగాడో తమకు తెలుసన్నారు. ఎవరూ లేని సమయంలో తమ ఇంటికి వచ్చాడన్నారు.
కానీ తప్పు ఆయనదో, తమదో కాదన్నారు. పోలీసులదే తప్పని జేసీ ప్రభాకర్‌రెడ్డి ఆగ్రహంతో ఊగిపోయారు. పెద్దారెడ్డి కోసం పోలీసులే పరుగెత్తుకుంటూ వచ్చి తన ఇంటి గేట్ తీశారని ఆరోపించాడు. కొడవలితో తన ఇంట్లోకి వెళ్లారన్నారు. పోలీసులకు తాను ఫిర్యాదు చేయనన్నారు. సీసీ పుటేజీ తీసి సుమోటోగా కేసు పెట్టాలని ప్రభాకర్‌రెడ్డి డిమాండ్ చేశారు.