రాజధాని అంశంపై రాజీనామా చేసి ఉప ఎన్నికల బరిలో దిగాలని ఆ మధ్య చంద్రబాబు, వైసీపీ ఎమ్మెల్యేలు డెడ్ లైన్ పెట్టి మరీ సవాల్ విసిరారు.
తీరా డెడ్ లైన్ అయిపోయిన తర్వాత బాబు ఏంచేస్తారా అని అందరూ ఎదురు చూశారు, కొంపదీసి టీడీపీ ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేయించి, ఉప ఎన్నికలకు వెళ్తారేమోనని బాబు నైజం పూర్తిగా తెలియనివారు భ్రమపడ్డారు కూడా. కానీ డెడ్ లైన్ తర్వాత బాబు జూమ్ మీట్ పెట్టి మమ అనిపించారు. ఇప్పుడు పవన్ బాబు కూడా అదే రూట్లో వెళ్తున్నారు.
రైతులకు తుపాను నష్టపరిహారం ఇవ్వాలంటూ డెడ్ లైన్ పెట్టి మరీ ఇటీవల ఒకరోజు దీక్ష చేపట్టారు జనసేనాని. ఏపీ రైతుల కోసం హైదరాబాద్ లోని ఇంటిలో పవన్ చేపట్టిన ఆ దీక్షా ఫలం ఏంటో తెలీదు కానీ, కట్ చేస్తే సినిమాల్లో పవన్ మళ్లీ బిజీ అయిపోయారు. నిర్మాతకి ఇవ్వని కాల్షీట్ ఒకటి మిగిలిపోయిందేమే, దాన్ని ప్రజా సేవ కోసం ఖర్చు చేసేందుకు జనసేనాని తీరిగ్గా కృష్ణా జిల్లాకు వస్తున్నారట.
ఈనెల 28వ తేదీన కృష్ణా జిల్లా కలెక్టర్ ని కలసి రైతులకు నివర్ నష్టపరిహారంగా ఎకరానికి రూ.35వేలు, తక్షణ సాయం కింద రూ.10వేలు ఇవ్వాలని కోరుతూ ఓ వినతిపత్రం ఇస్తారట.
రైతు దినోత్సవం సందర్భంగా పవన్, అటు ఇవ్వాల్సిన కాల్షీట్ ఇటు ఇచ్చినట్టున్నారు. 28వ తేదీ ఉదయం విజయవాడనుంచి గుడివాడ, పెడన మీదుగా మచిలీపట్నం చేరుకుని కలెక్టర్ ని కలసి వినతిపత్రం ఇస్తారట. ఇదీ జనసేన నేతలు విడుదల చేసిన ప్రకటన సారాంశం.
అసలు వినతి పత్రం ఇవ్వడానికి హైదరాబాద్ నుంచి అంత రిస్క్ చేసి పవన్ కల్యాణ్ మచిలీపట్నం రావడం ఎందుకు. దానికి 4 రోజుల ముందుగా ఈ కర్టెన్ రైజర్ వేసి హడావిడి చేయడం ఎందుకు.
వినతి పత్రం ఇస్తే పనైపోతుంది అనుకుంటే.. జనసైనికులతో రోజూ అన్ని జిల్లాల కలెక్టర్లకు అర్జీలు ఇప్పించొచ్చు కదా. పోనీ పవనే నేరుగా రంగంలోకి దిగితే పని అవుతుంది అనుకుంటే.. ఆ పనేదో 28వతేదీ కాకుండా ఈరోజే చేసి ఉండొచ్చు కదా?
ఈ ప్రశ్నలకు జనసైనికుల వద్ద సమాధానం లేదు. ప్రజల కోసం కాల్షీట్లు ఖాళీ లేవని, వాటిని నిర్మాతలకు ఎప్పుడో పవన్ రాసిచ్చారనే బ్రహ్మ రహస్యం అతి కొద్దిమందికి మాత్రమే తెలుసు.
అయినా కూడా పవన్ ని సీజనల్ పొలిటీషియన్ అనకూడదు, షూటింగ్ గ్యాప్ లో వచ్చి రాజకీయం చేసి వెళ్లిపోయే సినిమా హీరోలా ఆయన్ని చూడకూడదు. పాతికేళ్ల భవిష్యత్తుని అరచేతిలో చూపించే జనసేనాని.. ప్రజల కోసం పట్టుమని 25 రోజులు కూడా కేటాయించలేరనే విషయం జనసైనికులు ఎంత తొందరగా అర్థం చేసుకుంటే అంత మంచిది.