తిరుప‌తి త్యాగ ఫ‌లితమే అరుదైన అవ‌కాశం

హిందువుల మనోభావాలకు ప్రపంచ ప్రసిద్ధి గాంచిన కేంద్రం తిరుమల. తిరుమ‌ల పాదాల చెంత తిరుప‌తి ఉంటుంది. తిరుమ‌ల శ్రీవారిని క‌నులారా ద‌ర్శించ‌డం మ‌హాభాగ్య‌మ‌ని ప్ర‌తి హిందువు అనుకుంటారు.  అదే వైకుంఠ ఏకాదశి నాడు స్వామి…

హిందువుల మనోభావాలకు ప్రపంచ ప్రసిద్ధి గాంచిన కేంద్రం తిరుమల. తిరుమ‌ల పాదాల చెంత తిరుప‌తి ఉంటుంది. తిరుమ‌ల శ్రీవారిని క‌నులారా ద‌ర్శించ‌డం మ‌హాభాగ్య‌మ‌ని ప్ర‌తి హిందువు అనుకుంటారు.  అదే వైకుంఠ ఏకాదశి నాడు స్వామి వారిని ద‌ర్శ‌న భాగ్యం ఎన్నో జ‌న్మ‌ల పుణ్య‌ఫ‌లం అని హిందువులు ప్ర‌గాఢంగా విశ్వ‌సిస్తారు. వైకుంఠ ఏకాద‌శి నాడు సామాన్యులు శ్రీ‌వారిని ద‌ర్శించుకోవ‌డం దుర్బలం. అలాంటిది తిరుపతి స్థానిక ప్రజలకు టీటీడీ ప్రత్యేక అవకాశం కల్పించింది.

తిరుపతి ప్రజల చారిత్రక త్యాగాలకు నిలయం శ్రీవారి ఆలయం. 1250 సంవత్సరాల లిఖిత పూర్వక చరిత్ర తిరుమల ఆలయానికి ఉంది. నేడు తిరుమల తిరుపతి దేవస్థానం అత్యధిక ఆదాయం కలిగిన సంస్థ. మొత్తం టీటీడీ చరిత్ర ఇలాగే లేదు. గడిచిన 100 సంవత్సరాల నుంచే రోజువారీ ఆదాయం పెరుగుతోంది. దాదాపు 1100 సంవత్సరాలు ఇలాంటి పరిస్థితులు లేవు.

ఈ కాలంలో తిరుమల శ్రీవారి ఆలయాన్ని కంటికి రెప్పలా తిరుపతి పూర్వీకులు కాపాడుతూ వచ్చారు.  ఎలాంటి రవాణా సౌకర్యాలు లేని రోజుల్లో కూడా తమ భుజానికెత్తుకొని భక్తులకు శ్రీవారి దర్శన అవకాశం కల్పించారు. క్రూర మృగాలు ఉన్న అడవులు , ఎలాంటి రోడ్డు సౌకర్యం లేని రోజుల్లో కూడా తిరుపతి ప్రజలు తిరుపతి చెరువుల కింద పండిన పంటతో ఆలయంలో పూజల నిర్వ‌హ‌ణ‌ , ప్రసాదం పెట్టేవారు.

అలా సౌకర్యాలు, ఆదాయం లేని రోజుల్లో కూడా శ్రీవారి ఆలయాన్ని తిరుపతి ప్రజలు కాపాడుకున్నారు. తదనంతరం ఆంగ్లేయులు , మన ప్రభుత్వాలు వచ్చిన తర్వాత అనేక ర‌కాలుగా రూపాంతరం చెంది నేడు తిరుమల తిరుపతి దేవస్థానంగా స్థిర‌ప‌డింది. నేడు ప్రపంచంలోనే అత్యంత ధనిక ఆలయంగా టీటీడీ  ఉంది. అంటే 1000 సంవత్సరాలు తిరుపతి ప్రజల త్యాగాల ఫలితం అని చెప్పక తప్పదు.

ఆధునిక కాలంలో కూడా తిరుమల అభివృద్ధి కోసం తరతరాలుగా వారసత్వ సంపదను  వదులుకున్నారు. భక్తుల సంఖ్య రోజురోజుకూ పెరగడం వల్ల స్థానిక ప్రజలకు దర్శనం దక్కడం లేదు. మరీ ముఖ్యంగా పర్వదినాల్లో దుర్బలం అవుతోంది. నేటి తిరుమల వెలుగుకు దివిటీలు పెట్టిన వారసులకు కనీసం దర్శన వెసులుబాటు కూడా లేదే అన్న అసంతృప్తి గూడుకట్టుకుని ఉంది.

ఈ నేపద్యంలో వైకుంఠ ఏకాదశిని రెండు రోజులు కాకుండా 10 రోజులు ఉత్తర ద్వారం తెరిచి దర్శనం చేసుకొనే అవకాన్ని టీటీడీ కల్పించింది. వైకుంఠంలో మధు , కైతవ రాక్ష‌సులను మహా విష్ణువు యోగ నిద్రను వీడి సంహరిస్తారు. ఆ సందర్భంగా 40 నిమిషాలు పాటు 33 కోట్ల దేవతామూర్తులకు తన దర్శనా భాగ్యం కల్పిస్తారు. 

ఈ సమయంలో శాప విముక్తి పొందిన మధు కైతవలు తమకు కల్పించినట్లే భూలోకంలో మానవులకు దర్శనం కల్పించాలని కోరుతారు. వారికి మహావిష్ణువు ఇచ్చిన హామీ ఫలితమే వైకుంఠ ఏకాదశి. దేవమానం ప్రకారం ఒక‌ రోజు మానవ కాలం సంవత్సరంతో సమానం. అలా నాడు మహావిష్ణువు వైకుంఠంలో 40 నిమిషాలు దర్శనం కలిగింది కనుక మానవకాలం ప్రకారం అది 10 రోజులతో సమానం.

కారణం ఏమైనా తిరుమలలో ఈ సంప్రదాయం పాటించలేదు. తిరుమల తిరుపతి దేవస్థానం సంప్రదాయాన్ని పాటిస్తూ 10 రోజులు ఉత్తర ద్వార దర్శనం కల్పించాలని నిర్ణ‌యించింది. ఈ కృషిలో టీటీడీ ఆలయ వ్యవహారాల పట్ల సంపూర్ణ అవగాహన కలిగిన ధర్మారెడ్డి పాత్ర కీలకం. వచ్చిన ఈ వెసలుబాటులో స్థానిక ప్రజలకు అరుదైన గౌరవాన్ని టీటీడీ ఇచ్చింది. రోజుకు 10 వేల మంది స్థానిక ప్రజలకు ప్రత్యేక అవకాశం కల్పించింది. ఒక లక్ష మందికి దర్శన అవకాశం లభించింది.

టీటీడీని ఇలాంటి నిర్ణయం తీసుకునేలా ఒప్పించడంలో తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి విజయం సాధించారు. గతంలో టీటీడీ చైర్మన్‌గా ఉద్యోగుల సంక్షేమం , తిరుపతి ప్రజల సౌకర్యాలపై అమితాసక్తి చూపారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత తొలిసారిగా తిరుపతి ఎమ్మెల్యేకి బోర్డులో ప్రత్యేక ఆహ్వానితులుగా అవకాశం కల్పించారు.

ముఖ్యమంత్రి కల్పించిన అవకాశానికి సార్థకత చేకూరుస్తూ భూమన కృషి ఫలితం వైకుంఠ ఏకాదశి రోజున ఒక లక్ష మంది తిరుపతి ప్రజలకు శ్రీవారి దర్శనం చేసుకొనే అవకాశం. భూమన ప్రయత్నాలకు సహకరించిన టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి , కార్యనిర్వాహణాధిధికారి జవహర్ రెడ్డి అభినందనీయులు.

గురువారం దర్శన టోకన్లు పొందుతున్న కేంద్రాలను భూమనతో పాటు నేను కూడా వెళ్లి పరిశీలించాను. శ్రీవారి ఆలయంలో స్వామి వారి దర్సనానికి భక్తులు ఎలా పవిత్రంగా వెళ‌తారో అలాంటి వాతావరణం నెలకొంది. శ్రీవారి ఆలయంలో ఎలాంటి ఏర్పాట్లు టీటీడీ చేస్తుందో అలాంటి ఏర్పాట్లు ఇక్కడ కూడా చేసి టీటీడీ తన ప్రత్యేకతను చాటుకుంది.

ఎలాంటి అసౌకర్యానికి ఆస్కారం లేకుండా ఎస్పీ రమేశ్ రెడ్డి , టీటీడీ భద్రతాధికారి గోపినాథ్‌ జెట్టి తమ సిబ్బందితో ఏర్పాట్లు చేశారు. టోక‌న్లు ఇస్తున్న కేంద్రాల్లో కలయతిరిగిన భూమనలో, తనను ఎమ్మెల్యే గా ఎన్నుకున్న ప్రజలకు అమితానందం కలిగించే మంచి పని చేశాన‌న్న సంతృప్తిని చూశాను.

ఎం.పురుషోత్తమ్‌రెడ్డి
సమన్వయకర్త
రాయలసీమ మేధావుల ఫోరం
9490493436