అనంతపురం జిల్లా తాడిపత్రిలో రాజకీయ గొడవలు కొత్త కాదు. కొన్ని సార్లు ఇవి హత్యాకాండలకు కూడా దారి తీశాయి. ప్రత్యేకించి గత కొన్ని దశాబ్దాల్లో తాడిపత్రిలో తిరుగులేని హవా చలాయించిన జేసీ సోదరులు తమకు రాజకీయంగా అననుకూల సందర్భాల్లో దాడులు కూడా చేయించారనే ఆరోపణలు బలంగా ఉన్నాయి.
అవి ఏ స్థాయిలో అంటే.. 2009లో కాంగ్రెస్ గెలిచిన తర్వాత జేసీ దివాకర్ రెడ్డికి వైఎస్ కేబినెట్ లో స్థానం దక్కలేదని సాక్షి ఆఫీసుపై దాడి చేసేంత స్థాయిలో! అప్పట్లో సాక్షి ఆఫీసు మీద దాడి చేసి, అక్కడ పని చేసే ఒక ఉద్యోగిని కూడా హతమార్చినట్టుగా కూడా వార్తలు వచ్చాయి. జేసీకి వైఎస్ కేబినెట్లో చోటు ఇవ్వకపోతే సాక్షి ఆఫీసు మీద దాడి చేయడం ఏమిటో, ఆ గొడవతో ఏ మాత్రం సంబంధంలేని ఒక అమాయకుడిని హతమార్చడం ఏమిటో మరి! అదీ తాడిపత్రి మార్కు రాజకీయం అనుకోవాలేమో.
ఇక సొంత పార్టీ వాళ్లతో కూడా బాహాబాహీకి దిగడం జేసీ వర్గానికి కొత్త కాదు. గత ఐదేళ్ల టర్మ్ లో అనంతపురం వేదికగా తెలుగుదేశంలోని వర్గాలే అనేక సార్లు కలహించుకున్నాయి. దివాకర్ రెడ్డి రోడ్డు మీదకు ధర్నాలు, దీక్షలు చేశారు. ఆ తర్వాత ప్రభాకర్ రెడ్డి సాక్షి ఆఫీసు ముందు టెంటు వేసుకుని వేసిన వేషాలు సరేసరి. ఇక తాడిపత్రిలో లెక్కలేనన్ని గొడవలు జరిగాయి.
అలాంటి జేసీ వర్గపు ప్రభకు గత ఎన్నికలతో చెక్ పడింది. ఇక ఇప్పుడు కూడా జేసీ సోదరులు అనేక వివాదాలు రేకెత్తిస్తూ ఉన్నారు. ఆ పరంపరలో ప్రభాకర్ రెడ్డి ఒకటి రెండు సార్లు అరెస్టయ్యారు. అందుకు సంబంధించిన సంగతులన్నీ తెలిసినవే.
ఇలాంటి క్రమంలో తాజాగా మరోసారి తాడిపత్రిలో చిచ్చు రగులుకుంది. ఈ సారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థానిక ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి కూడా రంగంలోకి దిగడంతో గొడవ మరింత తీవ్రం అయ్యింది.
ఇంతకీ దీని వెనుక కథేమిటంటే.. తనకు వ్యతిరేకంగా, తన కుటుంబంపై బురద జల్లుతూ జేసీ వర్గీయులు పదే పదే సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారనేది పెద్దారెడ్డి ఆరోపణ. దీనికి సంబంధించి పోలీసులకు ఆయన కంప్లైంట్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది.
అయితే ఇన్నాళ్లూ స్థానిక సీఐ ఒకరు జేసీ వర్గానికి గులాం కావడంతో.. ఎలాంటి చర్యలూ లేవని కూడా తెలుస్తోంది. ఇటీవల కేతిరెడ్డి పెద్దారెడ్డి భార్య మీద కూడా పోస్టులు పెట్టినట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలో పోలీసుల నుంచి ఎలాంటి చర్యలూ లేకపోవడంతో.. పెద్దారెడ్డి డైరెక్టుగా జేసీ ఇంటి వద్దకు వెళ్లారు.
ప్రస్తుతం రాజకీయ నేతలు సోషల్ మీడియా పేజ్ లను తమ ఇంటి ఆవరణల నుంచినే నడిపిస్తున్నారు. ఈ క్రమంలో అక్కడ జేసీ అనుచరుడు ఒకరిని పెద్దారెడ్డిని వర్గీయులు కొట్టినట్టుగా సమాచారం. దీంతో వేడి రాజుకుంది. ఇరు వర్గాల బాహాబాహీకి దిగాయి. ఇంటి వద్ద లేని జేసీ ప్రభాకర్ రెడ్డి కూడా అక్కడకు రావడంతో రచ్చ మరింత ఊపందుకుంది. పోలీసులు సర్ది చెప్పి పెద్దారెడ్డిని ఇంటికి పంపించారు. అనంతరం జేసీ వర్గీయులు రెచ్చిపోయారు. పెద్దారెడ్డి కూర్చున్న కుర్చిని కాల్చారు. పోలీసుల వాహనాలపై కూడా రాళ్లు రువ్వారు. ఒక పోలిస్ వెహికల్ ను ధ్వంసం చేశారు.
ఇదీ కథ. అసలే ఇలాంటి రచ్చలకు అవకాశం కోసం జేసీ వర్గం ఎదురుచూస్తోంది. పదే పదే అరెస్టులు, కేసులకు కూడా జేసీ ఫ్యామిలీ ఇంకా ఉత్సాహంతోనే కనిపిస్తోంది. ఇలాంటి నేపథ్యంలో పెద్దారెడ్డి వాళ్లకు మరో అవకాశాన్ని ఇచ్చినట్టుగా ఉన్నారు. సోషల్ మీడియాను సోషల్ మీడియాతోనే దెబ్బ కొట్టాలనే వ్యూహాన్ని మరిచి, చిన్న ఇష్యూను పెద్దది చేసి.. జేసీ ప్రభాకర్ రెడ్డికి మరింత ప్రచారాన్ని కల్పిస్తున్న ఘనత పెద్దారెడ్డిదే.