తిరుపతి జిల్లా సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్యకు సొంత పార్టీలోని పెద్ద రెడ్లతో సమస్య వచ్చింది. రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన సంజీవయ్యకు, ఇక తనకు తిరుగులేదన్న భావనతో నాయకుల్ని లెక్క చేయడం లేదనే ఆరోపణ బలంగా వుంది. సూళ్లూరుపేటలో ఎంత పెద్ద నాయకులైనా సంజీవయ్యను సార్ అనాలని, లేదంటే ఆయన వద్దకు రావద్దని ముఖ్య అనుచరులతో ఎమ్మెల్యే చెప్పించారు. సంజీవయ్యా అని ఆప్యాయంగా అంత వరకూ పిలుస్తున్న నాయకులు, మారిన పరిస్థితుల్లో ఎందుకులేబ్బా అని ఎమ్మెల్యేకు దూరంగా వుంటూ వచ్చారు.
ఉమ్మడి నెల్లూరు జిల్లాలో రెడ్ల ప్రాబల్యం బలంగా వుంటుంది. సూళ్లూరుపేట ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం అయినప్పటికీ, అక్కడ రెడ్ల సామాజిక వర్గమే ఆధిపత్యం మొదటి నుంచి చెలాయిస్తూ వస్తోంది. ఈ నేపథ్యంలో తమకు కనీస గౌరవం ఇవ్వని సంజీవయ్యపై నియోజకవర్గానికి చెందిన రెడ్ల నాయకులంతా గుర్రుగా ఉన్నారు.
మరోవైపు ప్రత్యామ్నాయంగా మరొక ఎస్సీ నేతను తీసుకురావాలనే ప్రయత్నాల్ని వారు మొదలు పెట్టారు. దీంతో తన పదవికి ఎసరు పెడుతున్నారని గ్రహించిన సంజీవయ్య దిద్దుబాటు చర్యలు చేపట్టారు. అసంతృప్త రెడ్ల నాయకుల్ని మంచి చేసుకోడానికి ఆయన ప్రయత్నించారు. అయితే ఆయనలో మార్పు అభిమానంతో వచ్చింది కాదని, ఎమ్మెల్యే సీటు దక్కదనే భయంతో వచ్చిందని జగన్ సామాజిక వర్గ నేతలు అంటున్నారు.
ఈ నేపథ్యంలో తనపై నియోజకవర్గంలోని రెడ్లలో ఎలాంటి అసంతృప్తి లేదని వైసీపీ అధిష్టానానికి సంకేతాలు పంపేందుకు ద్వితీయ, తృతీయ శ్రేణి రెడ్ల నాయకులను తిరుపతిలో ఉన్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దగ్గరికి ఎమ్మెల్యే సంజీవయ్య శుక్రవారం పంపారు. సుమారు 50 మంది వరకూ రెడ్ల నాయకులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని కలవడానికి వెళ్లగా, వారికి నిరాశ ఎదురైంది. ఇంటి నుంచి బయటికొచ్చిన రామచంద్రారెడ్డి సూళ్లూరుపేట నుంచి నాయకుల్ని చూసి, హాయ్, బాయ్ చెప్పి ఏదో కార్యక్రమం వుందని వెళ్లారు.
సంజీవయ్య తరపు ఏదో చెప్పుకోవాలని వస్తే, పెద్దాయన కనీసం పది నిమిషాల సమయం కూడా కేటాయించలేదంటూ ఉసూరుమంటూ అక్కడి నుంచి సూళ్లూరుపేట వెళ్లిపోయారు. తిరుపతి జిల్లా వైసీపీ బాధ్యతల్ని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చూడడం లేదని, అందువల్లే వారితో చర్చించలేదని మంత్రి అనుచరులు చెప్పడం గమనార్హం.