జీవితంలో కనీసం ఒక్కసారైనా కలియుగ దైవం శ్రీవేంకటేశ్వరస్వామి వారిని వైకుంఠ ద్వారం నుంచి దర్శించుకోవాలని ప్రతి హిందువు కోరుకుంటారు. ఎందుకంటే ఆ దర్శనభాగ్యం లభించడం జన్మజన్మల పుణ్యఫలం అని హిందువుల నమ్మకం.
అలాంటి అద్భుతమైన, అరుదైన దర్శన భాగ్యం ఆ కలియుగ దైవం పాదాల చెంత ఉన్న తిరుపతి, తిరుమలలో నివాసం ఉంటున్న స్థానికులకు దక్కింది.
పదిరోజుల దర్శన భాగ్యం చరిత్రాత్మకం
గతంలో ఏ ప్రభుత్వం తీసుకోని విధంగా జగన్ ఏలుబడిలోని టీటీడీ ఓ చరిత్రాత్మక నిర్ణయాన్ని తీసుకుందని చెప్పొచ్చు. ఏటా ముక్కోటి ఏకాదశి, ద్వాదశి రోజుల్లో మాత్రమే వైకుంఠ మార్గం తెరచి ఉండేది.
ఆ రెండు రోజుల్లో స్వామివారిని దర్శించుకునేందుకు ప్రపంచ నలుమూలల నుంచి లక్షలాదిగా భక్తులు తిరుమల కొండకు చేరుకునేవారు. కనీసం మూడు, నాలుగు లక్షల మంది భక్తులు తిరుమలకు చేరుకునేవారు.
కానీ రెండురోజుల్లో కేవలం రెండు లక్షల మందికి మాత్రమే శ్రీవారి దర్శనం కల్పించేవారు. మిగిలిన వారు మామూలు దర్శనం చేసుకుని వెళ్లేవారు. తాజాగా ఈ సంప్రదాయాన్ని మారుస్తూ ఇకపై 10 రోజుల పాటు వైకుంఠ ద్వారాలు తెరవాలని టీటీడీ నిర్ణయించింది.
ఇది టీటీడీ చరిత్రలోనే సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ గొప్ప నిర్ణయంగా వేదపండితులు అభిప్రాయపడుతున్నారు. డిసెంబర్ 25న ముక్కోటి ఏకాదశి నుంచి జనవరి 3న పంచమి వరకు వైకుంఠ ప్రదక్షిణలో భక్తులకు స్వామివారి దర్శనం కల్పించనున్నారు.
రోజుకు 35 వేల మందికి…
కాగా కరోనా కారణంగా రోజుకు 35 వేల మందికి మాత్రమే దర్శన భాగ్యం కల్పించనున్నారు. టికెట్లు ఉన్న భక్తులు మాత్రమే తిరుమలకు రావాలని టీటీడీ ఉన్నతాధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.
ముఖ్యంగా వీఐపీలు, వీవీఐపీలు 25, 26వ తేదీల్లో మాత్రమే స్వయంగా వస్తేనే దర్శన సౌకర్యం కల్పిస్తామని టీటీడీ అధికారులు స్పష్టం చేస్తున్నారు. సిఫార్సు లేఖలను ఎట్టి పరిస్థితుల్లోనూ స్వీకరించే ప్రశ్నే ఉత్పన్నం కాదంటున్నారు.
తిరుపతి ఎమ్మెల్యే చొరవ
కలియుగ దైవం కొలువైన తన నియోజక ప్రజలకు ఎలాగైనా వైకుంఠ ద్వార దర్శనం కల్పించి, ప్రజలకు ఆధ్యాత్మిక సేవ చేయాలని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి గట్టిగా నిర్ణయించుకున్నారు. ఈ విషయమై టీటీడీ ఉన్నతాధికారులు, పాలకమండలితో ఆయన చర్చించారు.
కరుణాకర్‌రెడ్డి ప్రతిపాదనలోని సహేతుకతను అర్థం చేసుకున్న టీటీడీ పాలకమండలి, ఉన్నతాధికారులు స్థానికులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించేందుకు అంగీకరించారు. స్థానికులకు వైకుంఠ ద్వారం ద్వారా శ్రీవారి దర్శనభాగ్యం కల్పించాలని ఆలోచనను ఆ కలియుగ దైవమే తనలో రేకెత్తించిందని కరుణాకర్‌రెడ్డి చెప్పుకొచ్చారు.
రోజుకు 10 వేల మంది స్థానికులకు దర్శనం
ఈ నేపథ్యంలో రోజుకు 10 మంది స్థానిక ప్రజలకు కలియుగ దైవం శ్రీవేంకటేశ్వరుని దర్శనం కల్పించేందుకు నిర్ణయించారు.
ఆధార్‌కార్డులో తిరుపతి, తిరుమల చిరునామా ఉన్న వారిని స్థానికులుగా పరిగణించి, అలాంటి భక్తుల కోసం రోజుకు 10 వేల టికెట్లను ఆఫ్‌లైన్‌లో ఇవ్వనున్నారు.
దర్శనానికి ఒకరోజు ముందు నుంచి అంటే 24వ తేదీ నుంచి వీటిని తిరుపతిలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఐదు కౌంటర్లలో ఇస్తారు. ఒక్కో కేంద్రంలో 10 కౌంటర్లు చొప్పున ఏర్పాటు చేసి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా మొత్తం 50 కౌంటర్లలో టోకెన్లు కట్టనున్నారు.
ఈ మేరకు తిరుపతి ఎమ్మెల్యే కరుణాకర్‌రెడ్డి స్వయంగా గురువారం ఉదయం ఆరు గంటలకు టోకెన్ కట్టించుకుని ఈ అద్భుత కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. అనంతరం ఆయన 25వ తేదీ తెల్లవారుజామున స్థానిక భక్తులతో కలిసి స్వామివారిని దర్శించుకోనున్నారు.
కలలో కూడా ఊహించని విధంగా వైకుంఠ ద్వారం ద్వారా దర్శన భాగ్యం కల్పించిన ఎమ్మెల్యే చొరవను స్థానికులు ప్రశంసిస్తున్నారు.