చంద్రబాబు బీజేపీతో పొత్తుల కోసం ఎదురుచూస్తున్నారని ప్రచారంలో ఉన్న మాట. ఇటీవల కాలంలో ఆయన మాటవరసకు ఒకసారి అయినా కేంద్రంలోని నరేంద్ర మోడీని పొగుడుతూ వస్తున్నారు. బీజేపీ పొత్తు కోసం బాబు ఆసక్తిగా ఉన్నారని దీని బట్టి అర్ధం అవుతోంది.
ఈ విషయం మీద బీజేపీ సీనియర్ నేత విష్ణు వర్ధన్ రెడ్డి విశాఖలో మీడియాతో మాట్లాడుతూ ఏపీలో తమతో పొత్తులకు చాలా పార్టీలు ఉత్సాహం చూపుతున్నాయని అన్నారు. 2019 ఎన్నికల ముందు తమను తీవ్రంగా విమర్శించిన పార్టీలు సైతం ఇపుడు తమతో చెలిమి కోసం ఆపసోపాలు పడుతున్నాయని డైరెక్ట్ గానే బాబు మీద సెటైర్లు వేశారు.
అయితే పొత్తుల అంశం జాతీయ స్థాయిలో తమ కేంద్ర నాయకత్వం చూసుకుంటుందని ఆయన అన్నారు. రాష్ట్ర స్థాయిలో తామంతా కేంద్ర నాయకుల ఆదేశాలను తుచ తప్పకుండా అమలు చేస్తూ 2024 ఎన్నికల నాటికి ఏపీలో బీజేపీని నిర్ణయాత్మకమైన శక్తిగా మారుస్తామని విష్ణు వర్ధన్ రెడ్డి అంటున్నారు.
ఇక్కడ ఆయన తమతో పొత్తుల కోసం ఆపసోపాలు పడుతున్న పార్టీలు అంటూ టీడీపీ గురించి చంద్రబాబు గురించే ప్రస్తావించారు అనుకోవాలి. 2018లో బీజేపీ నుంచి విడిపోయి మోడీని బీజేపీని తీవ్రంగా విమర్శించిన బాబు ఇపుడు ఎన్నికల సమయంలో మళ్లీ పొత్తులు పెట్టుకోవడానికి చూస్తున్నారు అన్నదే ఆయన పాయింట్.
తాము మాత్రం జనసేనతో పొత్తులో ఉన్నామని, ఏపీలో వైసీపీకి అనుకూల ఓటు లేనపుడు ఇక వ్యతిరేక ఓటు చీలిక అన్న ప్రశ్న ఎందుకు వస్తుందని కూడా గడుసుగా ఆయన ప్రశ్నిస్తున్నారు. వైసీపీ మీద తీవ్ర వ్యతిరేకత ఉన్న పరిస్థితుల్లో జనసేన తామూ కలసి పొత్తులు పెట్టుకుని ముందుకు వస్తే చాలు అని ఆయన అంటున్నారు.
విష్ణు వర్ధన్ రెడ్డి టీడీపీతో పొత్తును మాత్రం చెప్పడంలేదు. అయితే కేంద్ర నాయకత్వం ఇష్టం అంటూ గతాన్ని బాబుకు టీడీపీకి గుర్తు చేశారు. నాడు తిట్టారు ఇపుడు వెంట పడుతున్నారు అంటే టీడీపీ తమ్ముళ్లకు అది నశాలానికి ఎక్కే కామెంటే అంటున్నారు.