హైదరాబాదు నగరం ఇప్పటికీ తాగునీటి సమస్యతో అల్లాడుతుంటుంది. వేసవి వచ్చిందంటే.. దాదాపుగా నగరం మొత్తం తాగునీటి ట్యాంకర్లు ముమ్మరంగా తిరుగుతూ కనిపిస్తాయి. నగరానికి ప్రధాన నీటివనరులు అయిన హిమాయత్ సాగర్, గండిపేట చెరువుల్లో నీటిమట్టం తగ్గిందంటే.. ఇక నీటి కష్టాలు చెప్పనలవి కాదు. ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్న సరికొత్త నిర్ణయం ఈ జలాశయాలు ఉసురుతీసేలా కనిపిస్తోంది. ప్రభుత్వం ఎన్ని మాటలు చెబుతున్నా ప్రజల్లో మాత్రం భయాలున్నాయి.
హిమాయత్ సాగర్, గండిపేట చెరువుల రక్షణ కోసం ఉద్దేశించిన 111 జీవోను పూర్తిగా ఎత్తివేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. 84 గ్రామాల ప్రజల విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు కూడా వెల్లడించారు. నిజానికి ఇది రియల్ ఎస్టేట్ నిర్ణయం. ‘84 గ్రామాల ప్రజలు’ అనే ముసుగులో లక్షల కోట్ల రూపాయల దందాలు సాగించే అక్రమార్కులు, రియల్ వ్యాపారులు ఉన్నారనేది నిజం. వారే ప్రభుత్వాన్ని ప్రభావితం చేసి 111 జీవో ఎత్తి వేయించారనేది నిజం.
ఇది ఎన్నికల సంవత్సరం కావడంతో.. భారీగా నిధుల సమీకరణ కోసం రియల్ వ్యాపారుల ఒత్తిడికి తలొగ్గి తీసుకున్న నిర్ణయంగా ప్రజలు అనుమానిస్తున్నారు. ఈ జీవో పరిధిలోకి వచ్చే దాదాపు లక్ష ఎకరాల భూమిలో గరిష్టంగా రియల్ వ్యాపారుల హస్తాల్లోనే ఉండడం ఇలాంటి అనుమానాలకు కారణం.
అభివద్ధి, సరికొత్త నగర నిర్మాణం అనే మాయాపదాల ముసుగులో ప్రభుత్వం సాగించే ఈ దందా అందరికీ చాలా రుచికరంగా కనిపిస్తుంది. విమర్శలు రాకుండా హిమాయత్ సాగర్, గండిపేట చెరువుల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటాం అని, రింగ్ మెయిన్ నిర్మిస్తామని, నీరు కలుషితం కాకుండా ఎస్టీపీలను నిర్మిస్తామని ప్రభుత్వం చెబుతోంది.
ప్రభుత్వానికి నిజంగా వీటిని అలా కాపాడే ఉద్దేశం ఉంటే.. ఆ పనులన్నీ పూర్తిచేసిన తర్వాతే.. 111 జీవోను పూర్తిగా ఎత్తివేసి ఉండాల్సింది.ఈ రెండు చెరువులతో పాటు హుసేన్ సాగర్ కు కూడా గోదావరి నీటిని అనుసంధానం చేస్తామని అంటున్నారు. చేస్తే మంచిదే. కానీ నిజంగా చేస్తారా అనేది సందేహం.
అవన్నీ చేసిన తర్వాతే.. జీవో ఎత్తేసి నిర్మాణాలకు అనుమతి ఇవ్వవచ్చు కదా.. మేలు జరిగే పనులు అన్నింటినీ మాటల్లో వల్లించేసి.. రియల్ దందాలకు మేలు చేసే నిర్ణయాలను తక్షణం తీసుకోవడమే ఒక పెద్ద కుట్రగా ప్రజలు భావిస్తున్నారు. జలాశయాల రక్షణకు చేస్తామని అంటున్న పనులనైనా ప్రభుత్వం సత్వరం చేయాలని కోరుకుంటున్నారు.