ఒక సినిమా స్టార్ట్ చేస్తే దాన్ని పూర్తిచేయాలి. పోనీ మధ్యలో ఇంకో సినిమా వచ్చింది, తప్పదు అనుకుంటే, దాన్ని కంప్లీట్ చేసిన తర్వాత మొదటి సినిమాను మళ్లీ మొదలుపెట్టాలి. కానీ స్టార్ట్ చేసిన సినిమా సెట్స్ పై ఉంటుండగానే, వరుసగా కొత్త సినిమాలకు కొబ్బరికాయలు కొట్టి వాటిని కంప్లీట్ చేసుకుంటూ పోతే ఏమనాలి? హరిహర వీరమల్లు సినిమా పరిస్థితి ఇదే.
చాన్నాళ్ల కిందట మొదలైంది హరిహర వీరమల్లు సినిమా. ఇంకా చెప్పాలంటే, రీఎంట్రీ ఇవ్వాలనుకున్నప్పుడు పవన్ కల్యాణ్ విన్న కథల్లో ఒకటి ఈ వీరమల్లు. రీఎంట్రీ మూవీ వకీల్ సాబ్ ను మినహాయిస్తే.. ఆ తర్వాత భీమ్లానాయక్ షూటింగ్ పూర్తిచేసుకొని రిలీజైంది. ఆ తర్వాత బ్రో అనే సినిమా కూడా షూటింగ్ పూర్తిచేసుకుంది.
ఇప్పుడు ఒకేసారి ఇటు ఓజీ, అటు ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలు సెట్స్ పై నడుస్తున్నాయి. కానీ హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ మాత్రం ఇంచీ కూడా కదల్లేదు.
అంతెందుకు మొన్నటికిమొన్న ఓజీ సినిమా ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ అయిన తర్వాత వీరమల్లు సినిమా స్టార్ట్ అవుతుందని అంతా అనుకున్నారు. పవన్ వస్తాడని, షూటింగ్ కోసం మొత్తం సిద్ధం చేసి పెట్టింది ఆ యూనిట్. కట్ చేస్తే.. ఇవాళ్టి నుంచి మళ్లీ ఓజీ సినిమానే స్టార్ట్ చేశాడు పవన్.
వీరమల్లు విషయంలో పవన్ ఇలా వ్యవహరించడానికి కారణం ఏంటనేది కూడా చాలామందికి తెలుసు. తక్కువ కాల్షీట్లతో పనైపోయే సినిమాలకు ఆయన ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాడు. బ్రో అయినా, ఓజీ అయినా ఆ బాపతే. హరిహర వీరమల్లు సినిమాకు కాల్షీట్లు ఇచ్చినప్పటికీ ఇప్పట్లో అది పూర్తవ్వదనే విషయం పవన్ కు తెలుసు.
అందుకే బ్రో, ఓజీ సినిమాలకే ఆయన కాల్షీట్లు కేటాయిస్తున్నాడనేది చాలామంది మాట. మరి హరిహర వీరమల్లు సినిమా సంగతేంటి? మధ్యలో ఆపే ప్రాజెక్టు కాదది, ఎలాగైనా పూర్తిచేయాల్సిందే. అలాంటప్పుడు అడపాదడపా అయినా ఆ సినిమా సెట్స్ పైకి వెళ్లాలి కదా. యూనిట్ మాత్రం మింగలేక కక్కలేక తెగ ఇబ్బంది పడుతోంది.