తాత్కాలికంగా కొలిక్కి వచ్చిన లైగర్ వివాదం

లైగర్ వివాదం తాత్కాలికంగా కొలిక్కి వచ్చింది. నష్టపోయిన ఎగ్జిబిటర్లకు పరిహారం అందించేందుకు పూరి-చార్మి అంగీకరించారంటూ ఫిలింఛాంబర్ పెద్దలు ప్రకటించారు. దీంతో వారం రోజులుగా రిలే నిరాహార దీక్ష చేస్తున్న ఎగ్జిబిటర్లు తమ ఆందోళనను విరమించారు.…

లైగర్ వివాదం తాత్కాలికంగా కొలిక్కి వచ్చింది. నష్టపోయిన ఎగ్జిబిటర్లకు పరిహారం అందించేందుకు పూరి-చార్మి అంగీకరించారంటూ ఫిలింఛాంబర్ పెద్దలు ప్రకటించారు. దీంతో వారం రోజులుగా రిలే నిరాహార దీక్ష చేస్తున్న ఎగ్జిబిటర్లు తమ ఆందోళనను విరమించారు.

విజయ్ దేవరకొండ హీరోగా నటించిన లైగర్ సినిమా అతిపెద్ద డిజాస్టర్ అయింది. ఈ సినిమాను పంపిణీ చేసిన వాళ్లంతా తీవ్రంగా నష్టపోయారు. అలా నష్టపోయిన ఎగ్జిబిటర్లును ఆదుకుంటామని గతంలో పూరి కనెక్ట్స్ నుంచి హామీ వచ్చింది. కానీ 5-6 నెలలైనా నష్టపరిహారం అందకపోవడంతో కొంతమంది ఎగ్జిబిటర్లు, ఫిలింఛాంబర్ ఎదుట రిలే నిరాహార దీక్షలకు సిద్ధమయ్యారు.

దీక్షలకు దిగిన వెంటనే ఫిలింఛాంబర్ జోక్యం చేసుకుంది. పూరి-చార్మితో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చింది. దాంతో కొంతమంది వెనక్కు తగ్గారు, మిగిలిన వాళ్లు మాత్రం రిలే నిరాహార దీక్షలు కొనసాగించడానికే సిద్ధమై, టెంట్ వేసి దీక్షలకు దిగారు.

ఈ ఆందోళనపై నిర్మాత ఛార్మి వెంటనే స్పందించింది. తను అందరికీ సెటిల్ చేస్తానంటూ ఫిలింఛాంబర్ కు ఆమె మెయిల్ పెట్టారు. అయినప్పటికీ దీక్షలు ఆగకపోవడంతో.. స్వయంగా సునీల్ నారంగ్, శిరీష్ లాంటి వాళ్లు జోక్యం చేసుకొని.. పూరి-చార్మితో చర్చలు జరిపి ఈ అంశాన్ని కొలిక్కితెచ్చారు. స్పష్టమైన హామీ తమకు దక్కిందని చెబుతున్నారు ఎగ్జిబిటర్లు.

రీసెంట్ గా డబుల్ ఇస్మార్ట్ ప్రాజెక్టు ఎనౌన్స్ చేశాడు పూరి. రామ్ హీరోగా రాబోతున్న ఆ సినిమా పట్టాలపైకి వస్తే.. ఈ ఎగ్జిబిటర్లకు పరిహారం అందుతుందేమో. ఈ మొత్తం వ్యవహారానికి మూలబిందువైన వరంగల్ శ్రీనును గ్రేట్ ఆంధ్ర ఎక్స్ క్లూజివ్ గా ఇంటర్వ్యూ చేసింది. ఈ వివాదానికి సంబంధించిన ఎన్నో అంశాల్ని ఆయన గ్రేట్ ఆంధ్ర తో పంచుకున్నాడు. పూరి జగన్నాధ్ తన ఫోన్ ఎత్తడం లేదని ఆరోపించాడాయన.