కరోనా వ్యాప్తి నివారణలో భాగంగా దేశంలో మళ్లీ లాక్ డౌన్ ఆంక్షలు ముమ్మరం అవుతున్నాయి. ఇప్పటికే ఉత్తరాదిన పలు రకాల ఆంక్షలను పాటిస్తున్నారు. కరోనా సెకెండ్ వేవ్ ఉంటుందన్న నేపథ్యంలో ఆంక్షలు అమలు చేస్తున్నారు.
ఇక కరోనా వైరస్ లో కొత్త స్ట్రెయిన్ ను బ్రిటన్ లో గుర్తించిన నేపథ్యంలో.. ప్రపంచమంతా మళ్లీ అలర్ట్ అవుతోంది. బ్రిటన్ నుంచి వచ్చిన ప్రయాణికులపై మళ్లీ ప్రభుత్వాలు దృష్టి పెట్టాల్సిన పరిస్థితి నెలకొంది.
అలాగే బ్రిటన్ నుంచి వచ్చే విమానాలకు బ్రేకులు వేశారు. మరోవైపు కొత్త రకం కరోనా కేసులు గుర్తించకపోయినప్పటికీ కొన్ని రాష్ట్రాలు అలర్ట్ అవుతున్నాయి. అందులో భాగంగా కర్ణాటక ప్రభుత్వం రాత్రిపూట కర్ఫ్యూను ప్రకటించింది. రాత్రి పది గంటల నుంచి ఉదయం ఆరు గంటల వరకూ కర్ఫ్యూను ప్రకటించింది కర్ణాటక ప్రభుత్వం.
నూతన సంవత్సరం నేపథ్యంలో.. రాత్రిపూట వేడుకలను కూడా పూర్తిగా నిషేధించింది కర్ణాటక ప్రభుత్వం. న్యూ ఇయర్ వేడుకలకు బెంగళూరు పెట్టింది పేరు. ఈ నేపథ్యంలో రాత్రి పూట ఏకంగా కర్ఫ్యూనే ప్రకటించేయడంతో.. వేడుకలకే గాక, అన్ని రకాల యాక్టివిటీస్ పైనా ఆంక్షలు మొదలైనట్టే.
లాక్ డౌన్ కాకుండా.. కర్ఫ్యూ అని ప్రభుత్వం ప్రకటించడంతో.. ఆంక్షలు తీవ్రతరంగా ఉన్నట్టే. పక్క రాష్ట్రం అలర్ట్ అయిన నేపథ్యంలో ఏపీ, తెలంగాణలు కూడా ఈ అంశం మీద దృష్టి నిలపాల్సిన అవసరం కనిపిస్తూ ఉంది.